Share News

మూడు రకాల అగరుబత్తీల తయారీకి టీటీడీ స్వస్తి

ABN , Publish Date - Apr 30 , 2026 | 03:48 AM

టీటీడీ తయారు చేస్తున్న అగరుబత్తీల్లో మూడు రకాలకు స్వస్తి పలకాలని నిర్ణయించింది. వీటి ఉత్పత్తిని తగ్గిస్తూ క్రమేణా పూర్తిగా నిలిపివేసేందుకు సిద్ధమైంది.

మూడు రకాల అగరుబత్తీల తయారీకి టీటీడీ స్వస్తి

  • రసాయనాలతో రూపొందడమే కారణం

తిరుపతి(టీటీడీ), ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): టీటీడీ తయారు చేస్తున్న అగరుబత్తీల్లో మూడు రకాలకు స్వస్తి పలకాలని నిర్ణయించింది. వీటి ఉత్పత్తిని తగ్గిస్తూ క్రమేణా పూర్తిగా నిలిపివేసేందుకు సిద్ధమైంది. మరోవైపు స్థానిక ఆలయాల నుంచి సేకరించే సంపంగి, నూరువరహాలు, తులసిలతో అగరుబత్తీల తయారీపై టీటీడీ అధికారులు దృష్టి పెట్టారు. ప్లాంటు, యంత్రాల ఏర్పాటుతో పాటు అగరుబత్తీల ఉత్పత్తికి దర్శన్‌ ఇంటర్నేషనల్‌ సంస్థ టీటీడీతో ఒప్పందం చేసుకుంది. తందనాన, దివ్యపాద, అభయహస్త, దివ్య దృష్టి, దివ్య శ్రీష్టి, తుష్టి, ఆకృష్టి పేర్లతో మొత్తం ఏడు రకాల అగరుబత్తీలను ఈ ప్లాంట్ల ద్వారా తయారు చేస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా ప్రత్యేక ప్యాకెట్లలో పొందుపర్చి విక్రయించేవారు. వీటిలో కొన్ని పరిమళ రసాయనాలతో ఉత్పత్తి చేసినవి ఉన్నాయి. ఆఽధ్యాత్మిక కేంద్రంలో రసాయనాలను ఉపయోగించి తయారు చేసిన అగరుబత్తీలను విక్రయించడం సరికాదని ఇటీవల అధికారులు అభిప్రాయపడ్డారు. దీంతో ప్రస్తుతం తందనాన, తుష్టి, దివ్యపాద, ఆకృష్టి, అభయహస్త రకాలకు చెందిన అగరుబత్తులు మాత్రమే అందుబాటులో ఉంచారు. దివ్య శ్రీష్టి, దివ్య దృష్టి రకాల అగరుబత్తుల ఉత్పత్తిని పక్కనబెట్టారు. త్వరలో ఆకృష్టి అగరుబత్తీల ఉత్పత్తిని తగ్గించనున్నారు.

Updated Date - Apr 30 , 2026 | 03:48 AM