Share News

చుక్కచుక్కలో కల్తీ!

ABN , Publish Date - Feb 10 , 2026 | 03:50 AM

‘భోలేబాబా పంపించేది కల్తీ నెయ్యి అని తెలుసు. దాన్నే అతి స్వచ్ఛమైన ఆగ్‌మార్క్‌ నెయ్యిగా చెబుతూ టీటీడీకి సరఫరా చేయాలి. అందరినీ మేనేజ్‌ చేయాలి.

చుక్కచుక్కలో కల్తీ!

  • వైష్ణవి డెయిరీ సీఈఓ అపూర్వచావ్డా కల్తీ లీలలు

  • పత్రాలు, కాల్‌ రికార్డ్‌లతో అడ్డంగా దొరికారు

అమరావతి, ఫిబ్రవరి 9(ఆంధ్రజ్యోతి): ‘భోలేబాబా పంపించేది కల్తీ నెయ్యి అని తెలుసు. దాన్నే అతి స్వచ్ఛమైన ఆగ్‌మార్క్‌ నెయ్యిగా చెబుతూ టీటీడీకి సరఫరా చేయాలి. అందరినీ మేనేజ్‌ చేయాలి. నెయ్యిలో చుక్కచుక్క కల్తీ ఉన్నా...అతి స్వచ్ఛమైనదిగా చెబుతూ ఇటు ల్యాబ్‌ల నుంచి అటు టీటీడీ నుంచి సర్టిఫికెట్‌ రావాలి. ఇందుకోసం ఏం చేయడానికైనా రెడీగా ఉండాలి’....ఇదీ వైష్ణవీ డెయిరీ సీఈఓ అపూర్వ చావ్డా (ఏ9) తీరు. తన ఉద్యోగులకు, ఇంకా టీటీడీలో నమ్మిన బంట్లకు ఆయన ఇచ్చిన ఆదేశాలివీ. ఇదంతా ఓ పద్ధతిగా సాగిపోయేలా నాటి టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డికి పీఏగా పనిచేసిన చిన్నప్పన్న చక్కటి మార్గాలేశారు. దీంతో 2020 నుంచి 2023 వరకు టీటీడీకి వైష్ణవీ డెయిరీ తరఫున సరఫరా చేసిన ఆవు నెయ్యి కల్తీదని తెలిసినా, అదే అసలు సిసలైన స్వచ్ఛమైన ఆవు నెయ్యి అని ఇటు ల్యాబ్‌లను, అటు టీటీడీ అధికారులను అపూర్వ చావ్డా మేనేజ్‌ చేయగలిగారు. ఇందుకు టీటీడీ అధికారులు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించారు. దీంతో చావ్డా చేసిన కల్తీ పనులు రాచమార్గంలో సాగిపోయాయి. ఫలితంగా చిన్నప్పన్న ఖాతాలో కోట్లాది రూపాయలు వచ్చిపడ్డాయి. అపూర్వా చావ్డాకు హవాలా మార్గంలో 19.86 కోట్లు చేరాయి. టీటీడీ డెయిరీ నిపుణుడు మద్ది విజయభాస్కర్‌రెడ్డికి 75 లక్షలు, కమిషన్‌ ఏజెంటుకు 31 లక్షలు ముట్టాయి. ఇదంతా కల్తీని స్వచ్ఛమైనదిగా చూపించడం కోసం చేసిన కష్టఫలితమేనని సీబీఐ సిట్‌ తేల్చింది. కల్తీ నెయ్యి కేసులో చావ్డా ఏ9గా ఉన్నారు.


మేనేజ్‌ చేశారిలా.. చిన్నప్పన్న ఆదేశం మేరకే కేజీ నెయ్యికి రూ.25 కమీషన్‌ ఇవ్వనందుకు భోలే బాబా డెయిరీ కాంట్రాక్టును అర్ధాంతరంగా నిలిపివేయించిన విషయాన్ని సీబీఐ సిట్‌ వెలుగులోకి తీసుకొచ్చింది. 2020లో నెయ్యి కొనుగోలు టెండర్లు పిలిచినప్పుడు నేరుగా భోలేబాబా టెండర్‌లో పాల్గొనలేకపోవడంతో అది వైష్ణవీ డెయిరీ, ఏఆర్‌ డెయిరీ, మాల్‌గంగా డెయిరీలను రంగంలోకి దించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భోలేబాబా నుంచి తనకు ట్యాంకర్ల ద్వారా వచ్చే నెయ్యి ఫక్తు రసాయనాలు, ఇతర ఆయిల్స్‌తో కల్తీచేసి తయారు చేసిందేననేది అపూర్వ చావ్డాకు పూర్తిగా తెలుసు. ఒకసారి కల్తీనెయ్యితో టీటీడీకి వెళ్లిన ట్యాంకర్లు తిరిగి వెనక్కి రాకుండా ఉండేందుకు, అందులో కల్తీ సరుకు ఉందని గుర్తించకుండా ఉండేందుకు చావ్డా మేనేజ్‌మెంట్‌ పనులు చేశారని సిట్‌ చెబుతోంది. కేసు విచారణలో భాగంగా సిట్‌ వైష్ణవీ డెయిరీ ఉద్యోగులు వెంకటాచలపతి, సుధాకర్‌, సమీర్‌ తదితరుల ఫోన్‌లను పరిశీలించింది. వారు అపూర్వ చావ్డాతో జరిపిన ఫోన్‌ సంభాషణల కాల్‌రికార్డ్స్‌ ఈ పరిశోధనలో బయటపడ్డాయి. ‘‘మీరేం చేస్తారో తెలియదు. ఎన్‌ఏబీఎల్‌ ల్యాబ్‌ రిపోర్టు అనుకూలంగా రావాలి. ఆ తొమ్మిది ట్యాంకర్ల నెయ్యి టీటీడీ తీసుకొనేలా రిపోర్టు అనుకూలంగా ఉండాలి. ఏం జరిగినా, ఎంత ఖర్చయినా పర్వాలేదు. కానీ పనవ్వాలి. ఖచ్చితంగా అనుకూలమైన ల్యాబ్‌ రిపోర్టు తీసుకోండి’’ అని అపూర్వ చావ్డా తన ఉద్యోగులతో మాట్లాడారు. నిందితుల ఫోన్‌లను సీబీఐ సిట్‌ విశ్లేషించినప్పుడు బయటకొచ్చిన వాటిల్లో ఇదే కీలకమైన అంశం. భారత ఆహారభద్రతా, ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్ఎస్ఏఐ) వద్ద వైష్ణవీ డెయిరీ 2017 ఫిబ్రవరి 21న లైసెన్స్‌ (10017042002926) తీసుకుంది. ఇది ఆవు నెయ్యి తయారీ కోసం, పాల సేకరణ కోసం తీసుకున్నది కాదు. ఐస్‌క్రీమ్‌ల తయారీ, ఇడ్లీ, దోశల పిండి తయారీ, వేరుశనగ పల్లీచిక్కీ తయారీ వంటి వాటికోసం తీసుకున్నారు. దానిని చూపించే టీటీడీ నెయ్యి టెండర్లలో వైష్ణవి పాల్గొంది. ఇవన్నీ పక్కా డాక్యుమెంట్లు, కాల్‌డేటాతో బయటపడ్డాయి.

Updated Date - Feb 10 , 2026 | 03:51 AM