తప్పు చేశా..
ABN , Publish Date - Feb 06 , 2026 | 03:27 AM
గత వైసీపీ హయాంలో టీటీడీ కల్తీ నెయ్యి దందాకు దారులు వేసింది డెయిరీ ఎక్స్‌పర్ట్ విజయభాస్కర్‌రెడ్డేనని ‘సిట్’ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఎక్కడో ఉత్తరాఖండ్‌లో ఉన్న భోలేబాబా డెయిరీ యజమాని పొమిల్ జైన్‌ను తిరుపతి సమీపంలోని....
టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంలో డెయిరీ ఎక్స్‌పర్ట్ విజయభాస్కర్‌రెడ్డి పశ్చాత్తాపం
నాడు ‘నెయ్యి’ దందాలో కీలక పాత్ర
(తిరుపతి-ఆంధ్రజ్యోతి)
గత వైసీపీ హయాంలో టీటీడీ కల్తీ నెయ్యి దందాకు దారులు వేసింది డెయిరీ ఎక్స్‌పర్ట్ విజయభాస్కర్‌రెడ్డేనని ‘సిట్’ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. ఎక్కడో ఉత్తరాఖండ్‌లో ఉన్న భోలేబాబా డెయిరీ యజమాని పొమిల్ జైన్‌ను తిరుపతి సమీపంలోని వైష్ణవి డెయిరీకి తీసుకొచ్చింది, ఆ సంస్థతో కల్తీ నెయ్యి సరఫరాకు ఒప్పందం కుదిర్చింది కూడా విజయభాస్కరరెడ్డే. ఆ విషయం స్వయంగా ఆయనే సిట్ వద్ద అంగీకరించారు. ‘తప్పు చేశాను’ అంటూ పశ్చాత్తాపం ప్రకటించారు. తాను లంచంగా తీసుకున్న సొమ్ములో మిగిలిన రూ.34 లక్షల నగదును, గోల్డ్ కాయిన్‌ను సిట్‌కు స్వచ్ఛందంగా అప్పగించారు. ఈ కేసులో అప్రూవర్‌గా మారేందుకు కూడా సిద్ధపడ్డారు. హైదరాబాద్‌కు చెందిన విజయభాస్కర్‌రెడ్డి ఏపీలో ప్రాచుర్యం కలిగిన దొడ్ల డెయిరీకి తొలుత కన్సల్టెంట్‌గా పనిచేశారు. ఎలాగో టీటీడీకి చేరువై 2013 నుంచి 2027 వరకు నెయ్యి కొనుగోలు వ్యవహారాల్లో కీలక పాత్ర వహిస్తూ వచ్చారు. ఏమైందో ఏమో గానీ ఆ తర్వాత టీటీడీ ఆయనను దూరం పెట్టింది. 2019లో వైసీపీ ప్రభుత్వం రాగానే, తిరిగి టీటీడీ నెయ్యి కొనుగోలు వ్యవహారాల్లో విజయభాస్కర్‌రెడ్డి తెర ముందుకు వచ్చారు.
పునబాకకు పొమిల్‌జైన్..
2019 ఆగస్టులో ట్యాంకర్ల ద్వారా టీటీడీకి నెయ్యి సరఫరా చేసే టెండర్లలో ఉత్తరాఖండ్ రాష్ట్రం భగవాన్‌పూర్‌లోని భోలేబాబా డెయిరీ పాల్గొంది. ఆ క్రమంలో డెయిరీ ప్లాంట్‌ను తనిఖీ చేసేందుకు డెయిరీ ఎక్స్‌పర్ట్ విజయభాస్కర్‌రెడ్డి ఉత్తరాఖండ్ వెళ్లారు. అక్కడ తనిఖీలో భోలేబాబా డెయిరీకి పాల సేకరణ సామర్థ్యం గానీ, నెయ్యి సరఫరా సామర్థ్యం గానీ లేవని తిరస్కరించారు. అదే సమయంలో భోలేబాబా డెయిరీ యజమాని పొమిల్‌జైన్‌తో విజయభాస్కర్‌రెడ్డి కుమ్మక్కై కీలక సలహా ఇచ్చారు. ఏపీలోని డెయిరీలను ప్రోత్సహించడానికి టీటీడీ 2018 నుంచీ ఏపీ కేటగిరీ కింద ప్రత్యేకంగా టెండర్లు పిలుస్తోందని, ఆ కేటగిరీ కింద టెండర్లలో పాల్గొంటే నెయ్యి సరఫరా కాంట్రాక్టు దక్కించుకోవచ్చునని సూచించారు. ఏపీలో తనకు వైష్ణవి అనే డెయిరీ తెలుసుని, దానితో ఒప్పందం కుదిరిస్తానని చెప్పారు. ఆ డెయిరీని టేకప్ చేసి దాని ద్వారా టెండర్లు వేసి టీటీడీ నెయ్యి కాంట్రాక్టు సొంతం చేసుకోవాలని పొమిల్ జైన్‌కు సూచించారు. 2019 అక్టోబరులో పొమిల్ జైన్‌ను వెంటబెట్టుకుని తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పునబాక గ్రామం వద్ద ఉన్న వైష్ణవీ డెయిరీకి ఆయనే తీసుకెళ్లారు.
రూ. 7 కోట్ల అప్పులు... జీతాలివ్వలేని వైష్ణవి
పునబాకలో వైష్ణవి డెయిరీ 2011లో ఏర్పాటైంది. దానికి నలుగురు యజమానులు. 2016 వరకూ ఆ డెయిరీ బాగానే నడిచింది. తర్వాత ఆర్థికంగా సంక్షోభంలో కూరుకుపోయింది. 2019 అక్టోబరులో విజయభాస్కర్‌రెడ్డి భోలేబాబా యజమాని పొమిల్‌జైన్‌ను అక్కడికి తీసుకెళ్లేనాటికి వైష్ణవి డెయిరీ రూ.7 కోట్ల అప్పుల్లో ఉంది. సిబ్బందికి జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉంది. నలుగురు యజమానుల్లో ముగ్గురు డెయిరీని నడపడం తమ వల్ల కాదంటూ నాలుగో వ్యక్తి రాజేశ్ చావడాకు అప్పగించి వెళ్లిపోయారు. రాజేష్‌ను పొమిల్‌జైన్‌కు విజయభాస్కర్‌రెడ్డి పరిచయం చేశారు. వైష్ణవి డెయిరీ నిర్వహణను పొమిల్ జైన్ చేపడతారని, కేవలం డాక్యుమెంట్లు ఇస్తే చాలు...వైష్ణవి పేరిట టీటీడీ టెండర్లలో పాల్గొంటారని చెప్పారు. నెయ్యి తయారీ, సరఫరా, టీటీడీని మేనేజ్ చేయడం వంటివన్నీ పొమిల్ జైనే చూసుకుంటారని చెప్పారు. నిజానికి వైష్ణవి డెయిరీకి కూడా టీటీడీ టెండర్లలో పాల్గొనే అర్హత లేదు. డెయిరీ డాక్యుమెంట్లు తీసుకున్న పొమిల్ జైన్ వాటి ఆధారంగా ఎక్కువ సామర్థ్యం చూపుతూ నకిలీ పత్రాలు సృష్టించి టెండర్లలో పాల్గొన్నారు. పొమిల్ జైన్ 2020 జనవరి నుంచి 2024 వరకూ నిరంతరంగా టీటీడీకి ‘నెయ్యి’ సరఫరా చేశారు. భోలేబాబా డెయిరీ నుంచి కల్తీ నెయ్యిని 32 వేల కిలోల సామర్థ్యం కలిగిన ట్యాంకర్లలో వైష్ణవి డెయిరీకి తరలించారు. ఈ విధంగా విజయభాస్కర్‌రెడ్డి సహకారంతో వైష్ణవి డెయిరీ ద్వారా టీటీడీకి ఏకంగా రూ. 130 కోట్ల విలువైన 33 లక్షల కిలోల కల్తీ నెయ్యిని పొమిల్ జైన్ సరఫరా చేయగలిగారు. సిట్ ఈడెయిరీని తనిఖీ చేసే నాటికి వైష్ణవీ డెయిరీలో కనీసం వెయింగ్ మెషిన్ కూడా లేకపోదు. కాగా, వైష్డవి డెయిరీ యాజమాన్యాన్ని పరిచయం చేసి ఒప్పందం కుదిర్చిన తీరులోనే పుణెలోని మాల్‌గంగా డెయిరీ యాజమాన్యాన్ని కూడా విజయభాస్కర్‌రెడ్డే పొమిల్ జైన్‌కు పరిచయం చేశాడు. 2022లో దీని కోసమే ఆయన టీటీడీకి దక్షిణ భారత దేశంలోని డెయిరీల నుంచీ నెయ్యి కొనుగోలు చేయాలని సలహా ఇచ్చారు. ఈ మేరకు టీటీడీ 1500 కిలోమీటర్ల పరిధిలోని డెయిరీల నుంచీ టెండర్లు పిలిచింది. ఆ క్రమంలోనే పొమిల్ జైన్‌కు పుణేలోని మాల్‌గంగా డెయిరీ యాజమాన్యంతో ఒప్పందం కుదిర్చారు.
విజయభాస్కర్‌రెడ్డి పశ్చాత్తాపం..
శ్రీవారి ప్రసాదాలైన లడ్డూల తయారీకి వాడే నెయ్యి విషయంలో తప్పిదానికి పాల్పడ్డానని విజయభాస్కర్‌రెడ్డి పశ్చాత్తాపానికి లోనయ్యారు. అప్రూవర్‌గా మారేందుకు సిద్ధపడ్డారు. అయితే అనారోగ్యం కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు. శ్రీవారి పట్ల తప్పు చేశానన్న పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేసిన విజయభాస్కర్‌రెడ్డి, తాను లంచంగా తీసుకున్న సొమ్ములో కొంత స్వచ్ఛందంగా సిట్ అధికారులకు అందజేశారు. ఆయనకు పొమిల్ జైన్ నుంచి హవాలా మార్గంలో రూ. 25 లక్షలు చొప్పున మూడుసార్లుగా మొత్తం రూ.75 లక్షలు లంచంగా అందింది. దానితో పాటు ఆల్ఫా డెయిరీ యాజమాన్యం నుంచి ఎనిమిది గ్రాముల గోల్డ్ కాయిన్ కూడా లంచం రూపంలో అందింది. ిలంచంగా తీసుకున్న నగదు, గోల్డ్ కాయిన్‌లను డర్టీ మనీగా భావిస్తున్నానంటూ రూ. 34 లక్షల నగదు, 8 గ్రాముల గోల్డ్ కాయిన్‌లను సిట్‌కు అప్పగించేశారు. వాటిని ఏసీబీ కోర్టుకు సిట్ స్వాధీనం చేసింది.