Share News

10 గంటలు.. రూ.97 కోట్లు!

ABN , Publish Date - Jul 16 , 2026 | 04:43 AM

శ్రీవారికి పది గంటల్లో రూ.96.98 కోట్ల విరాళాలు వెల్లువలా వచ్చాయి. ఇదో రికార్డు! ఈ ఏడాది జూన్‌ 26 నాటి రికార్డుల ప్రకారం టీటీడీకి మొత్తం 1,97,888 మంది దాతలు ఉన్నారు.

10 గంటలు.. రూ.97 కోట్లు!

  • టీటీడీకి విరాళాల వెల్లువ

  • డోనర్‌ పాలసీ మార్పు ఎఫెక్ట్‌

  • పాత విధానంలోని సదుపాయాలు పొందడానికే..

తిరుమల, జూలై 15(ఆంధ్రజ్యోతి): శ్రీవారికి పది గంటల్లో రూ.96.98 కోట్ల విరాళాలు వెల్లువలా వచ్చాయి. ఇదో రికార్డు! ఈ ఏడాది జూన్‌ 26 నాటి రికార్డుల ప్రకారం టీటీడీకి మొత్తం 1,97,888 మంది దాతలు ఉన్నారు. రోజురోజుకూ ఈ సంఖ్య పెరుగుతోంది. వారికిచ్చే దర్శనాలు, గదుల సదుపాయాలతో భవిష్యత్తులో సామాన్య భక్తులకు దర్శన సమయం తగ్గుతుందనే ఉద్దేశంతో ముందస్తు జాగ్రత్తతో టీటీడీ నూతన డోనర్‌ పాలసీని రూపొందించింది. విరాళాలు అందించే మొత్తాన్ని బట్టి డోనర్లను నాలుగు క్యాటగిరీలుగా విభజించింది. బుధవారం నుంచే (మంగళవారం అర్ధరాత్రి తర్వాత) ఇది అమలులోకి వస్తుందని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు, ఈవో రవిచంద్ర ప్రకటించారు. ఉదాహరణకు... పాత విధానంలో శ్రీవారి ట్రస్టులకు రూ.లక్ష విరాళం అందించే భక్తులకు ఏడాదిలో ఒకసారి సుపథం దర్శనం(ఐదుగురికి) లభించేది. కొత్త విధానంలో దానిని ఎస్‌ఈడీ (ప్రత్యేక ప్రవేశ దర్శనం)గా మార్చారు. పాత విధానంలో రూ.25 లక్షల విరాళం ఇచ్చే వారికి ఏడాదిలో మూడుసార్లు వీఐపీ బ్రేక్‌ దర్శనం, ఒకరోజు సుపథం దర్శనం లభించేది. కొత్త విధానంలో వారికి బ్రేక్‌ దర్శనాన్ని రెండుసార్లకు పరిమితం చేశారు. ఇలా కొత్త విధానంలో పలురకాల మార్పులు చేయడంతో పాత విధానంలో ఉన్న సదుపాయాలను పొందాలనే ఉద్దేశంతో టీటీడీ ట్రస్టులకు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ ద్వారా భక్తులు భారీగా విరాళాలు ఇచ్చారు. మంగళవారం మధ్యాహ్నం 2 నుంచి అర్ధరాత్రి 12 గంటలలోపు ఆన్‌లైన్‌ ద్వారా 2354 మంది, 106 మంది ఆఫ్‌లైన్‌ ద్వారా టీటీడీలోని వివిధ ట్రస్టులకు విరాళాలు సమర్పించారు. ఇందులో రూ.లక్ష నుంచి రూ.10 లక్షలలోపు 1212 మంది, రూ.10 లక్షల నుంచి రూ.25 లక్షలలోపు 1246 మంది, రూ.కోటి, అంతకంటే ఎక్కువ ఇద్దరు భక్తులు విరాళాలు ఇచ్చారు.

Updated Date - Jul 16 , 2026 | 04:44 AM