Share News

తిరుగిరుల్లో 89.4శాతం పచ్చదనం!

ABN , Publish Date - May 18 , 2026 | 04:45 AM

శేషాచల అడవుల పరిరక్షణలో టీటీడీ అటవీ విభాగం కృషికి గుర్తింపు లభించింది. ఈ విభాగం పరిధిలో 2,719 హెక్టార్ల అరణ్య ప్రాంతం ఉండగా, తాజాగా విడుదల చేసిన ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ నివేదిక (ఐఎస్ఎఫ్ఆర్‌) ప్రకారం..

తిరుగిరుల్లో 89.4శాతం పచ్చదనం!

  • అటవీ సంపద పరిరక్షణలో టీటీడీ భేష్‌

  • 576 హెక్టార్లలో స్థానిక వృక్ష జాతుల పునరుద్ధరణ

  • తిరుమల, తిరుపతి రహదారిలో ఉద్యానవనాలు,

  • డివైడర్లు, పచ్చదనం అభివృద్ధి కార్యక్రమాల నిర్వహణ

(తిరుమల-ఆంధ్రజ్యోతి)

శేషాచల అడవుల పరిరక్షణలో టీటీడీ అటవీ విభాగం కృషికి గుర్తింపు లభించింది. ఈ విభాగం పరిధిలో 2,719 హెక్టార్ల అరణ్య ప్రాంతం ఉండగా, తాజాగా విడుదల చేసిన ఇండియా స్టేట్‌ ఆఫ్‌ ఫారెస్ట్‌ నివేదిక (ఐఎస్ఎఫ్ఆర్‌) ప్రకారం సుమారు 2,431 హెక్టార్లలో (89.40ు) అటవీ ప్రాంతం నమోదైంది. ఇది దేశంలోనే టీటీడీని అగ్రగామిగా నిలిపింది. టీటీడీ అటవీశాఖ 1980 నుంచి శేషాచల అరణ్య సంపదను పరిరక్షిస్తూ, పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ జీవవైవిధ్య పరిరక్షణలో కీలక ప్రాత పోషిస్తోంది. తిరుమలలో రెండు, తిరుపతిలో రెండు ఫారెస్ట్‌ రేంజ్‌లు ఉన్నాయి. చెట్ల నరికివేత, వేటను ఫ్లయింగ్‌ స్వ్కాడ్‌ బృందాలు అరికడుతుండగా ప్రత్యేక శిక్షణ పొందిన ఫైర్‌లైన్‌ బృందాలు అగ్ని ప్రమాదాలు జరగకుండా చూస్తున్నాయి. విదేశీ జాతికి చెందిన అకేషియా చెట్ల స్థానంలో స్థానిక వృక్ష సంపదను పునరుద్ధరించే కార్యక్రమంలో భాగంగా 576 హెక్టార్లలో రావి, మర్రి, జువ్వి, మేడి, సంపంగి, మామిడి, గంధం, ఎర్రచందనం, ఉసిరి, నేరేడు తదితర మొక్కలను దశల వారీగా నాటుతున్నారు. ఇప్పటికే 22 హెక్టార్లలో పనులు పూర్తయ్యాయి. మరోవైపు ఏనుగులు, చిరుతలు, ఎలుగుబంట్లు, పాముల వంటి వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటున్నారు. వేసవి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని జంతువుల దాహార్తి తీర్చేందుకు సాసర్‌ పిట్స్‌ (నీటి గుంతలు) ఏర్పాటు చేసి వాటిలో నీటిని నింపుతున్నారు. అలాగే దర్శన క్యూలైన్‌ ప్రాంగణంలో మూడు స్నేక్‌ రెస్క్యూ బృందాలను ఉంచుతున్నారు. ఇక తిరుమల, టీటీడీ ఆలయాల అవసరాల కోసం శ్రీగంధం చెక్కలు, వంటచెరకు, దర్భ గడ్డి, ఇతర పూజా సామగ్రిని టీటీడీ అటవీ విభాగం సమకూరుస్తోంది.


తిరుమల, తిరుపతి రహదారిలో డివైడర్లు, ఉద్యానవనాలు, పచ్చదనం అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తోంది. మొత్తం 24 కిలోమీటర్ల మేర రహదారి డివైడర్లు, 25 ఉద్యానవనాలను సంరక్షిస్తోంది. ఆయుర్వేధ ఔషధాల తయారీకి అవసరమైన ముడిపదార్థాలను కూడా సరఫరా చేస్తోంది. ప్రస్తుతం పవిత్ర వనం, దివ్యఔషధ వనం, పలమనేరు టింబర్‌ ప్లాంటేషన్‌, వన్యప్రాణి ఘర్షణల నివారణకు వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ భాగస్వామ్యం, కొండల పచ్చదనం పెంపు వంటి పలు కీలకమైన ప్రాజెక్టులను టీటీడీ ఫారెస్ట్‌ విభాగం అమలుచేస్తోంది. అటవీ సంపదను సంరక్షించడం ద్వారా భవిష్యత్తు తరాలకు ప్రకృతి వారసత్వాన్ని అందించడం లక్ష్యంగా పనిచేస్తోంది.

Updated Date - May 18 , 2026 | 05:47 AM