Share News

టీటీడీలో ఈవీల జోష్‌!

ABN , Publish Date - May 16 , 2026 | 04:19 AM

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు కాలుష్య నియంత్రణ దిశగా టీటీడీ అడుగులేస్తోంది. దీనిలో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) వినియోగంపై అధికారులు దృష్టి సారించారు.

టీటీడీలో ఈవీల జోష్‌!

  • ఇప్పటికే 12 ఎలక్ర్టిక్‌ బస్సులు, 36 కార్ల వినియోగం

  • టీటీడీకి ఏటా రూ.3కోట్ల నుంచి 4కోట్ల వరకు ఆదా

  • త్వరలో విరాళంగా అందనున్న 4 ఎలక్ర్టిక్‌ బస్సులు

  • డీజిల్‌, పెట్రోల్‌ భారం నుంచి విముక్తికి యత్నాలు

(తిరుమల-ఆంధ్రజ్యోతి)

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు కాలుష్య నియంత్రణ దిశగా టీటీడీ అడుగులేస్తోంది. దీనిలో భాగంగా ఎలక్ట్రిక్‌ వాహనాల (ఈవీ) వినియోగంపై అధికారులు దృష్టి సారించారు. శ్రీవారి దర్శనం కోసం నిత్యం వేలాది మంది భక్తులు తిరుమలకు వచ్చి వెళ్తుంటారు. వారి లగేజీని కొండపైకి పంపడంతో పాటు ప్రసాదాల తయారీకి అవసరమైన ముడిసరుకుల రవాణా తదితరాల కోసం టీటీడీ ప్రస్తుతం దాదాపు 300 కార్లు, బస్సులు, లారీలను వినియోగిస్తోంది. వీటికి డీజిల్‌ కోసం ఏటా దాదాపు రూ.9 కోట్లు, పెట్రోల్‌ కోసం రూ.40లక్షల నుంచి రూ.45లక్షల వరకూ ఖర్చవుతోంది. అయితే నానాటికీ పెరుగుతున్న పెట్రోల్‌, డీజిల్‌ ధరలు టీటీడీకి భారంగా మారుతున్నాయి. దీంతో ఈవీల వినియోగం మరింతగా పెంచాలని బోర్డు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే తిరుపతి- తిరుమల మధ్య 64 ఎలక్ర్టిక్‌ బస్సులను ఆర్టీసీ అందుబాటులో ఉంచింది. త్వరలో మరో వంద ఈవీ బస్సులు ఘాట్‌రోడ్లలో నడిపేందుకు సన్నాహాలు చేస్తోంది. టీటీడీ కూడా మూడు నాలుగేళ్లుగా ఈవీల వినియోగం వైపు మళ్లింది. అధికారులు వాడే డీజిల్‌ వాహనాల స్థానంలో 36 ఎలక్ర్టిక్‌ కార్లు, భక్తుల ఉచిత రవాణా కోసం 12 ఎలక్ర్టిక్‌ బస్సుల(ధర్మ రథాలు)తో పాటు వివిధ విభాగాల సిబ్బంది 143 ఎలక్ర్టిక్‌ ద్విచక్ర వాహనాలను వినియోగిస్తున్నారు. దీనిద్వారా ఏడాదికి రూ.3 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు టీటీడీకి ఆదా అవుతోంది. దీంతో ఇకపై ఈవీలనే కొనుగోలు చేయాలని బోర్డు తీర్మానం కూడా చేసింది.


భక్తుల కోసం మరో నాలుగు ఎలక్ర్టిక్‌ బస్సులను అందుబాటులోకి తీసుకురానుంది. వీటిలో ఒకటి శనివారం, త్వరలో మరో మూడు బస్సులు విరాళం కింద అందనున్నాయి. పెరుగుతున్న డీజిల్‌, పెట్రోల్‌ ధరలను దృష్టి పెట్టుకొని ప్రస్తుతం వినియోగిస్తున్న డీజిల్‌ వాహనాల స్థానంలో వీలైనంత త్వరగా ఈవీలు అందుబాటులోకి తీసుకురావాలని సంబంధిత అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు. అలాగే అవసరం లేనిచోట డీజిల్‌ వాహనాల వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. టీటీడీ వినియోగించే లారీలు మినహా మిగిలిన వాహనాలన్నీ ఈవీలు ఉండేలా ప్రయత్నాలను ముమ్మరం చేశారు.

Updated Date - May 16 , 2026 | 04:20 AM