Share News

సింఘాల్‌ తప్పు చేశారు..!

ABN , Publish Date - Jan 31 , 2026 | 05:44 AM

టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ సిట్‌ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.

సింఘాల్‌ తప్పు చేశారు..!

  • ‘తిరుమల లడ్డూ’ వ్యవహారంలో తప్పుడు నిర్ణయాలకు తలూపారు

  • రాష్ట్ర ప్రభుత్వానికి సీబీఐ సిట్‌ నివేదిక!

అమరావతి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): టీటీడీ కల్తీ నెయ్యి వ్యవహారంపై దర్యాప్తు జరుపుతున్న సీబీఐ సిట్‌ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. కల్తీ నెయ్యి సరఫరా కావడానికి టీటీడీ మాజీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి హయాంలో నెయ్యి సేకరణ విధానంలో తెచ్చిన మార్పులే కారణమని దర్యాప్తు అధికారులు నిర్ధారించినట్టు తెలిసింది. అప్పటి, ప్రస్తుత ఈవో అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఈ వ్యవహారాన్ని సకాలంలో గుర్తించకపోవడం లేక గుర్తించినా చూసీచూడనట్లు వదిలేయడం క్షమించరాని నేరంగా సిట్‌ ఆక్షేపించినట్టు సమాచారం. ఈ వ్యవహారంలో సింఘాల్‌ అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలు లేకపోయినా, తన విధి నిర్వహణలో ఆయన తీవ్ర నిర్లక్ష్యం వహించారని, టీటీడీ పాలక మండలి ఒత్తిడికి తలొగ్గారని గుర్తించినట్టు తెలిసింది. వైవీ సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్నపై నేరాభియోగాలతో ఇటీవలే నెల్లూరు కోర్టులో సిట్‌ చార్జిషీట్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఇదే క్రమంలో మరికొన్ని వివరాలతో ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.


పాలసీలో భారీ మార్పులు..

లడ్డూ ప్రసాదం తయారీకి వాడే నెయ్యికొనుగోలుకు టీటీడీలో ఒక విధానం ఉంది. వైసీపీ హయాంలో దీనికి మంగళం పాడారు. బాగా పేరున్న సంస్థలను పక్కకు తప్పించి, ఊరుపేరు లేని సంస్థలకు టెండర్లలో అవకాశం ఇవ్వడమే లక్ష్యంగా 370 తీర్మానం ద్వారా టీటీడీ గేట్లు ఎత్తేసింది. ఈ పనిని సుబ్బారెడ్డి ఉద్దేశపూర్వకంగా చేశారా లేదా అన్న విషయాన్ని సిట్‌ తేల్చింది. ఒకవైపు చిన్నప్పన్న తన పీఏ కాదని సుబ్బారెడ్డి అంటున్నారు. మరీ ఆయన పీఏ కానప్పుడు ఆయన ఖాతాల్లోకి డబ్బులు ఎందుకు వెళ్లాయన్నది పెద్ద ప్రశ్న. ఏపీ భవన్‌లో పని చేసే ఒక చిన్న ఉద్యోగి ఖాతాలోకి రూ.4.5 కోట్లు ఎవరైనా ఎందుకు వేస్తారు? ఆ డబ్బులు అప్పన్న ఖాతాల్లోకి వచ్చిన తర్వాతనే టీటీడీ నెయ్యి కొనుగోలు పాలసీలో భారీ మార్పులు జరిగాయి. ఆ తర్వాతే టీటీడీ బోర్డులో తీర్మానం చేశారంటే, ఆయన చెబితేనే అప్పటి చైర్మన్‌ చేసి ఉండాలి. లేదా చైర్మన్‌ టీటీడీ పాలసీ నిబంధనలను కొందరి కోసం మార్చాలని నిర్ణయించుకున్న తర్వాత.. చిన్నప్పన్న ద్వారా సదరు వ్యక్తుల నుంచి లబ్ధి పొంది ఉండాలి. ఇలా తప్ప కిందస్థాయి సిబ్బంది అంత పెద్ద నేరానికి పాల్పడే అవకాశం లేదు. టీటీడీ పాలక మండలిలో రాజకీయ నాయకులే ఎక్కువ . వారికి రకరకాల వ్యాపకాలు, లావాదేవీలు, వివిధ వ్యక్తులతో సంబంఽధాలు ఉంటాయి. వాటన్నింటినీ టీటీడీపై రుద్దకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది. బోర్డులో ఒక సభ్యుడు ఏదైనా ప్రతిపాదన పెడితే, దాని లోతుపాతులను కూలంకషంగా పరిశీలించాల్సిన బాధ్యత అధికారులదే. నెయ్యి కొనుగోలు వ్యవహారంలో అప్పటి వరకూ ఉన్న పటిష్ఠమైన పాలసీకి తూట్లు పొడిచినా, దిక్కుమాలిన డెయిరీలకు నెయ్యి సరఫరా చేసే అవకాశం కల్పించినా సింఘాల్‌ ఏదశలోనూ నిలువరించలేదని సిట్‌ తన నివేదికలో తెలిపినట్టు సమాచారం.


ఏ నిబంధన ఏం చెబుతుందంటే..

నెయ్యి కొనుగోలుకు సంబంధించిన నిబంధనలను మారుస్తూ, సుబ్బారెడ్డి నేతృత్వంలోని బోర్డు 2020 ఫిబ్రవరి 29వ తేదీన తీర్మానం చేసింది. 18, 19, 20, 21, 72 నిబంధనలను సవరించింది. నిబంధన 18 ప్రకారం మూడేళ్లు ఆపరేషన్‌లో ఉన్న డెయిరీకి మాత్రమే టెండర్లలో పాల్గొనే అర్హత కల్పించాలి. దానిని ఏడాదికి తగ్గించారు. రోజుకు 4 లక్షల లీటర్ల అవు నెయ్యి సేకరించి ఉండాలని, ఏడాదిలో ఎనిమిది టన్నుల ఆవు పాల కొవ్వు ప్రాసెస్‌ చేసే సామర్థ్యం కలిగి ఉండాలన్న 19, 20 నిబంధనలను పూర్తిగా ఎత్తేశారు. నిబంధన 21 ప్రకారం... ప్రతి రోజు 12 టన్నుల ఆవు పాల కొవ్వుకు సంబంధించిన పాల సేకరణ చేసి ఉండాలి. దానిని ఎనిమిది టన్నులకు కుదించారు. రూ.250 కోట్ల టర్నోవర్‌ ఉన్న డెయిరీలు మాత్రమే పాల్గొనాల్సిన నిబంధనను సవరించి రూ.150 కోట్ల టర్నోవర్‌ ఉన్న డెయిరీలకు కూడా టెండర్లలో పాల్గోనే అవకాశం కల్పించారు. ఈవో సింఘాల్‌ సకాలంలో స్పందించి ఉంటే అసలు కల్తీ నెయ్యి స్కామ్‌కే అవకాశం ఉండేది కాదని, ఆయనపై గట్టి చర్యలు తీసుకోవాలని సిట్‌ తన నివేదికలో కోరినట్టు తెలిసింది. సింఘాల్‌ తర్వాత ఈవోగా బాధ్యతలు స్వీకరించిన ధర్మారెడ్డి టీటీడీ ఆర్థిక సలహాదారు బాలాజీ కూడా తన విధి నిర్వహణలో నిర్లక్ష్య పూరితంగా వ్యవహరించారని సిట్‌ తన నివేదికలో పేర్కొన్నట్టు సమాచారం.

4.jpg

Updated Date - Jan 31 , 2026 | 05:44 AM