శ్రీవారి భక్తులతో జగన్ చానల్ ‘రోత’ రాజకీయం
ABN , Publish Date - May 03 , 2026 | 05:55 AM
టీటీడీ చేపట్టిన ఏర్పాట్లపై భక్తుల్లో అసంతృప్తి ఉన్నట్టుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి జగన్ సొంత రోత మీడియా చానల్ భంగపడింది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల క్యూలైన్‌లోకి...
టీటీడీ ఏర్పాట్లు బాలేవని చెప్పించేందుకు పాట్లు
వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన లోకేశ్
అసత్య ప్రచారాలు నమ్మొద్దని టీటీడీ ఖండన
తిరుపతి/తిరుమల, మే 2 (ఆంధ్రజ్యోతి): టీటీడీ చేపట్టిన ఏర్పాట్లపై భక్తుల్లో అసంతృప్తి ఉన్నట్టుగా చిత్రీకరించేందుకు ప్రయత్నించి జగన్ సొంత రోత మీడియా చానల్ భంగపడింది. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని తిరుమల క్యూలైన్‌లోకి చేరే భక్తులకు నిరంతరం అన్నపానీయాలు అందజేయడంతో పాటు వీలైనంత త్వరగా దర్శనం చేయించేలా టీటీడీ క్యూలైన్లను సమర్థంగా నిర్వహిస్తోంది. అయితే టీటీడీ ఏర్పాట్లు సక్రమంగా లేవని చెప్పించేందుకు జగన్ చానల్ కెమెరామన్ చేసిన ప్రయత్నాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రింగురోడ్డులోని సర్వదర్శన క్యూలైన్‌లో ఉన్న ఓ భక్తుడిని శుక్రవారం కెమెరామన్ మాట్లాడించారు. ‘ఎన్ని గంటలకు వచ్చారు? ఇంకా ఎంత టైం పడుతుందంటున్నారు? ఏర్పాట్లు ఎలా ఉన్నాయి?’ అని ప్రశ్నించగా.. భక్తుడు ‘అంతా బాగుంది’ అంటూ బదులిచ్చి వెళ్లిపోయారు. ఆ వీడియోను మంత్రి లోకేశ్ తన ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఖాతాల్లో పోస్టు చేశారు. ‘అంతా బాగుందని చెప్తున్న భక్తులతో ఏర్పాట్లు బాగా లేవు.. ఇబ్బంది పడుతున్నాం.. అని చెప్పించడానికి ప్రయత్నించి భంగపడుతున్న సాక్షి చానల్’ అనే శీర్షిక పెట్టారు. ‘కలియుగ దైవంతో పెట్టుకోవద్దు జగన్మోహన్ రెడ్డి గారూ’ అంటూ వీడియో కింద రాశారు. కదులుతున్న క్యూలైన్‌లోని భక్తులను రెచ్చగొట్టి దర్శనం ఆలస్యమవుతోందని చెప్పించడం, రాజకీయ ప్రయోజనాల కోసం బైట్లు తీసుకుని ప్రచారం చేయడాన్ని ఆక్షేపిస్తున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో పేర్కొంది. ‘వేసవి సెలవులకు తోడు వారాంతం కూడా రావడంతో భక్తులు అధిక సంఖ్యలో తిరుమలకు వచ్చారు. అన్ని సౌకర్యాలు కల్పించడం కోసం టీటీడీ యంత్రాంగం, శ్రీవారి సేవకులు అహర్నిశలు కృషి చేస్తున్నారు. అసత్య కథనాల కోసం ప్రయత్నించే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది’ అని పేర్కొంది.