Share News

సైబర్‌ సెక్యూరిటీ ల్యాబ్‌ ఏమైంది?

ABN , Publish Date - Jan 31 , 2026 | 05:01 AM

శ్రీవారి భక్తులు సైబర్‌ మోసాలకు గురికాకుండా నియంత్రించేందుకు ఏర్పాటు చేయదలిచిన ‘ప్రత్యేక సైబర్‌ సెక్యూరిటీ ల్యాబ్‌’ నిర్ణయం కేవలం ప్రకటనలకే పరిమితమైంది.

సైబర్‌ సెక్యూరిటీ ల్యాబ్‌ ఏమైంది?

  • టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుని 7 నెలలు

  • ఒక్క అడుగూ ముందుకు పడని ల్యాబ్‌ ఏర్పాటు అంశం

  • సైబర్‌ మోసాల నుంచి భక్తులకు రక్షణ ఎలా?

తిరుమల, జనవరి 30(ఆంధ్రజ్యోతి): శ్రీవారి భక్తులు సైబర్‌ మోసాలకు గురికాకుండా నియంత్రించేందుకు ఏర్పాటు చేయదలిచిన ‘ప్రత్యేక సైబర్‌ సెక్యూరిటీ ల్యాబ్‌’ నిర్ణయం కేవలం ప్రకటనలకే పరిమితమైంది. తిరుమలలో ప్రత్యేక సైబర్‌ సెక్యూరిటీ ల్యాబ్‌ను ఏర్పాటు చేస్తామని టీటీడీ గతేడాది జూలైలో ప్రకటన చేసినా, ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. అవినీతి అక్రమాలను అడ్డుకునేందుకు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ టీటీడీలో నిత్యం ఏదో ఒక అక్రమం వెలుగుచూస్తూనే ఉంది. శ్రీవారి దర్శనానికి ఉన్న డిమాండ్‌ను క్యాష్‌ చేసుకుంటూ కొందరు సైబర్‌ నేరగాళ్లు అక్రమాలకు పాల్పడుతున్నారు. శ్రీవారి దర్శనం, బస, ప్రసాదాలు, ఆర్జితసేవలు వంటి వాటిల్లో అక్రమాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. నకిలీ దర్శన టికెట్లు సృష్టించడంతో పాటు కొందరు తాము టీటీడీ అధికారులమంటూ భక్తులను మోసగించిన సందర్భాలూ చాలానే ఉన్నాయి. ఇక, టీటీ డీ, తిరుమల పేరిట నకిలీ వెబ్‌సైట్లు పుట్టుకొస్తున్నాయి. బల్క్‌ బుకింగ్‌ ద్వారా టికెట్లు, గదులు పొం ది బ్లాక్‌లో విక్రయించి సొమ్ము చేసుకున్న కేసులూ బయట పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బుకింగ్‌ సిస్టమ్‌తో పాటు యాప్‌లు, పోర్టల్‌లో భద్రపరిచిన భక్తుల వ్యక్తిగత, ఆర్థిక, బయోమెట్రిక్‌ సమాచారంతో పాటు టీటీడీకి సంబంధించిన సున్నితమైన సమాచారాన్ని రక్షించుకునేందుకు ప్రత్యేకంగా టీటీడీకి ఇన్‌హౌ్‌స సైబర్‌ సెక్యూరిటీ ల్యాబ్‌ అవసరమని గతంలో నిపుణుల బృందం నివేదిక సమర్పించింది. వీటితోపాటు టీటీడీపై తప్పుడు వార్తలను, ప్రతిష్ఠను దెబ్బతీసే చర్యలను అడ్డుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని భావించారు. ఈ నివేదిక ఆధారంగా గతేడాది జూలె ౖలో సైబర్‌ సెక్యూరిటీ ల్యాబ్‌ ఏర్పాటుకు టీటీడీ బోర్డు నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. తొలుత 40నుంచి 50 మంది సిబ్బందితో అక్టోపస్‌ భవనంలో ప్రత్యేకంగా ల్యాబ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఆ తర్వాత వైకుంఠం క్యూకాంప్లెక్స్‌-1లో ఏర్పాటు చేసిన ఏఐ ఇంటిగ్రేటెడ్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లోనే ఏర్పాటు చేయాలని అనుకున్నారు. అయితే ఇప్పటిదాకా ఏదీ కార్యరూపం దాల్చలేదు. సైబర్‌ నేరగాళ్లు పెరిగిపోతున్న ఈ కాలంలో దీని అవసరం తీవ్రంగా ఉన్నా టీటీడీ పట్టించుకోకపోవడం పట్ల భక్తుల్లో అసంతృప్తి నెలకొంది.

Updated Date - Jan 31 , 2026 | 05:01 AM