లగేజీ సేవల్లో టీటీడీ రికార్డు
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:58 AM
శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల లగేజీని డిపాజిట్ చేసుకుని సురక్షితంగా తిరిగి డెలివరీ చేసే వ్యవస్థను టీటీడీ సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రశంసలు అందుకుంటోంది.
ఏప్రిల్, మే నెలల్లో 51.38 లక్షల డిపాజిట్, డెలివరీలు
తిరుమల, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చే భక్తుల లగేజీని డిపాజిట్ చేసుకుని సురక్షితంగా తిరిగి డెలివరీ చేసే వ్యవస్థను టీటీడీ సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రశంసలు అందుకుంటోంది. ప్రత్యేకించి ఏప్రిల్, మే నెలల్లో రికార్డుస్థాయిలో 51.38 లక్షల లగేజి డిపాజిట్, డెలివరీ సేవలు అందించింది. భక్తులు తమతో తీసుకొచ్చే లగేజీ, బ్యాగులు, సెల్‌ఫోన్లను భద్రంగా ఉంచుకునేందుకు తిరుమలలో, కాలినడక మార్గాల్లో మొత్తం 65 కౌంటర్లు ఏర్పాటు చేసి 345 మంది సిబ్బందితో నిరంతరాయ సేవలను టీటీడీ అందిస్తోంది. ఏప్రిల్ నెలలో 23,15,279 మంది భక్తులు, మే నెలలో 28,23,697 మంది భక్తులకు రికార్డుస్థాయిలో లగేజి డిపాజిట్, డెలివరీ సేవలు అందించారు. గతేడాది ఏప్రిల్, మే నెలలతో పోల్చితే అదనంగా 6,80,873 డిపాజిట్, డెలివరీ సేవలు అందించారు. గత మూడు రోజులలో 3,41,742 మందికి డిపాజిట్, డెలివరీలు నమోదు కావడం గమనార్హం.