Share News

అలిపిరి కాలినడక మార్గంలో... తొలిదశ విస్తరణ పనులు పూర్తి

ABN , Publish Date - May 17 , 2026 | 05:46 AM

తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గం విస్తరణ పనుల్లో తొలిదశను టీటీడీ పూర్తిచేసింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి మోకాళ్లమిట్ట వరకు భక్తులు...

అలిపిరి కాలినడక మార్గంలో... తొలిదశ విస్తరణ పనులు పూర్తి

  • 70 మీటర్ల మేర 6 అడుగులు వెడల్పు చేసిన టీటీడీ

  • 90శాతం పూర్తయిన మొదటి ఘాట్‌ తారురోడ్డు పనులు

తిరుమల, మే 16(ఆంధ్రజ్యోతి): తిరుమలకు వెళ్లే అలిపిరి కాలినడక మార్గం విస్తరణ పనుల్లో తొలిదశను టీటీడీ పూర్తిచేసింది. లక్ష్మీనరసింహస్వామి ఆలయం నుంచి మోకాళ్లమిట్ట వరకు భక్తులు మొదటి ఘాట్‌రోడ్డులోనే దాదాపు 1.6 కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోంది. రెండు నుంచి మూడు అడుగుల వెడల్పు మాత్రమే ఉండే ఈ ఇరుకైన మార్గంలో నడవడం చాలా ప్రమాదకరం. ఎదురుగా వచ్చే వాహనాలను గమనిస్తూ ముందుకు సాగాలి. ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుంది. పక్కనే లోయ ఉన్న క్రమంలో టీటీడీ కూడా ఏమీ చేయలేని పరిస్థితి. ఈ క్రమంలో తొలిదశలో 70 మీటర్ల మేరకు విస్తరణ పనులను గత డిసెంబరులో ప్రారంభించి, ఇటీవల పూర్తిచేసింది. గతంలో రోడ్డుపక్కనే 3 అడుగులు వెడల్పున్న నడకమార్గం ప్రస్తుతం 6 అడుగులకు విస్తరించింది. ఈ మార్గంపై షెడ్డు నిర్మాణ పనులూ పూర్తయ్యాయి. దీంతో భక్తులు రోడ్డుపైకి వెళ్లే అవసరం లేకుండా నడకను కొనసాగిస్తున్నారు. మరోవైపు మార్గానికి అత్యంత లోతైన లోయ ఉన్న క్రమంలో విస్తరణ పనులు ఎలా చేపట్టాలనే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు.


మరోవైపు, తిరుమల నుంచి తిరుపతికి వచ్చే మొదటి ఘాట్‌లో తారు రోడ్డు పనులు 90 శాతం పూర్తయ్యాయి. 2021 నవంబరు, డిసెంబరు నెలల్లో వచ్చిన భారీ వర్షాలు, డ్రైనేజీ పనులు, ఘాట్‌రోడ్ల వెంబడి క్రాష్‌బ్యారియర్ల ఏర్పాటు వంటి పనులతో రెండు ఘాట్‌రోడ్లు గుంతలమయంగా మారాయి. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తులు ఇబ్బంది పడుతుండటాన్ని గుర్తించిన టీటీడీ అధికారులు ఈ రోడ్ల మరమ్మతుల కోసం దాదాపు రూ.10కోట్ల బడ్జెట్‌ కేటాయించారు. ఇందులో భాగంగా ఇప్పటికే తిరుపతి నుంచి తిరుమలకు చేరుకునే రెండో ఘాట్‌లో పనులు గతేడాది పూర్తయ్యాయి. ఈ ఏడాది మార్చి 23న మొదటి ఘాట్‌ రోడ్డు మరమ్మతులు ప్రారంభించారు. వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని 50 రోజుల్లోనే యుద్ధప్రాతిపదికన పనిచేసి పనులు కొలిక్కి తెచ్చారు. త్వరలో పెయింట్‌ వేసే పనులు చేపట్టి సైన్‌బోర్డులను ఏర్పాటు చేయనున్నారు.

Updated Date - May 17 , 2026 | 05:47 AM