Share News

జగన్‌, గజదొంగలంతాక్షమాపణ చెప్పాలి

ABN , Publish Date - Jan 31 , 2026 | 05:42 AM

నెయ్యి కల్తీ జరగలేదని, సిట్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని అబద్ధాలు చెబుతున్న వైసీపీ నేతలకు సిగ్గుండాలని టీటీడీ చైౖర్మన్‌ బీఆర్‌ నాయుడు మండిపడ్డారు.

జగన్‌, గజదొంగలంతాక్షమాపణ చెప్పాలి

  • నెయ్యి కొనుగోలులో అన్నీ ఉల్లంఘనలే

  • జంతువుల కొవ్వు ఉందని ఎన్‌డీడీబీ ల్యాబ్‌ నివేదిక

  • సిట్‌ సప్లిమెంటరీ చార్జిషీటులో లోపాలు

  • సుబ్బారెడ్డి పీఏ ఖాతాలోకి వచ్చిన కోట్ల రూపాయలు ఎక్కడికి పోయాయి?

  • కల్తీ నెయ్యి దందా వెనుకున్న పెద్దలను బయట పెట్టాలి: టీటీడీ చైర్మన్‌

తిరుపతి, జనవరి 30 (ఆంధ్రజ్యోతి): నెయ్యి కల్తీ జరగలేదని, సిట్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని అబద్ధాలు చెబుతున్న వైసీపీ నేతలకు సిగ్గుండాలని టీటీడీ చైౖర్మన్‌ బీఆర్‌ నాయుడు మండిపడ్డారు. కోట్లాదిమంది హిందువుల మనోభావాలు దెబ్బతీసిన కల్తీ నెయ్యి వ్యవహారంలో మాజీ సీఎం జగన్‌ సహా గజదొంగలంతా హిందూ సమాజానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం తిరుపతిలో మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన వేలాది అరాచకాల్లో కల్తీ నెయ్యి వ్యవహారం కూడా ఒకటన్నారు. సిట్‌ చార్జిషీట్‌లో వందశాతం కల్తీ నెయ్యి అని పదేపదే ప్రస్తావించిందన్నారు. అయితే జంతువుల కొవ్వు లేదని చెబుతూ వైసీపీ నేతలు యజ్ఞాలు, యాగాలు, సంబరాలు చేసుకుంటున్నారని అన్నారు. హిందూ దేవుళ్లను, భక్తులను కించపరిచే విధంగా గత వైసీపీ పాలనలో దాడి జరిగిందని ఆరోపించారు. నెయ్యి కొనుగోలుకు సంబంధించి తొలి రోజు నుంచీ అన్నీ ఉల్లంఘనలే జరిగాయన్నారు. సామర్థ్యం లేని డెయిరీలకు నెయ్యి సరఫరా ఆర్డర్లు ఇచ్చారని అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్లలో రూ.250 కోట్ల విలువైన 60 లక్షల కిలోల నెయ్యి కొనుగోలు చేశారన్నారు. అందులో జంతువుల కొవ్వు ఉందని ఎన్‌డీడీబీ ల్యాబ్‌ రిపోర్టు తేల్చిందని, దాని ఆధారంగానే సీఎం, డిప్యూటీ సీఎం, సాధువులు స్పందించారని అన్నారు. అది వదిలిపెట్టి సిట్‌ క్లీన్‌ చిట్‌ ఇచ్చిందని వైసీపీ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో నియమితులైన డెయిరీ నిపుణుల్ని భోలేబాబా డెయిరీ తనిఖీ కోసం పంపిస్తే అక్కడ ఒక ఆవు గానీ, చుక్క పాలు గానీ, చుక్క జున్ను గానీ లేవన్నారు. కానీ 60 లక్షల కిలోల నెయ్యి ఎలా వచ్చిందని ప్రశ్నించారు. సిట్‌ దర్యాప్తులో భాగంగా వైవీ సుబ్బారెడ్డి, ఆయన సతీమణి బ్యాంకు ఖాతాల వివరాలు అడిగితే సహకరించలేదని అన్నారు. టీటీడీలో ఏ ఫైలు తీసుకున్నా అవినీతి కనిపిస్తోందని, ఒక్క ఫైలు కూడా సక్రమంగా లేదని చెప్పారు. టీటీడీని భ్రష్టుపట్టించి కోట్లు సంపాదించారన్నారు. సిట్‌ కోర్టులో దాఖలు చేసిన సప్లిమెంటరీ చార్జిషీటులో లోపాలున్నాయని అభిప్రాయపడ్డారు. సుబ్బారెడ్డి పీఏ చిన్నప్పన్న ఖాతాలోకి వచ్చిన కోట్ల రూపాయలు తర్వాత ఎక్కడికి పోయాయన్నది చార్జిషీటులో లేదన్నారు. ఆ దిశగా ఎందుకు దర్యాప్తు చేయలేదని, కనీసం తదుపరి చార్జిషీట్‌లోనైనా కల్తీ నెయ్యి దందా వెనుక ఉన్న పెద్దలను బయట పెట్టాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Jan 31 , 2026 | 05:42 AM