అది మార్ఫింగ్ వీడియో
ABN , Publish Date - Mar 02 , 2026 | 04:09 AM
తనపై వీడియోను మార్ఫింగ్ చేశారని, దుష్ప్రచారం చేసి అప్రతిష్ఠపాలు చేసేందుకు భూమన కరుణాకర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు.
30 ఏళ్లుగా ఆ కుటుంబంతో స్నేహం ఉంది... నన్ను అప్రతిష్ఠపాలు చేసేందుకు భూమన కుట్ర
అక్రమాలను వెలికి తీస్తున్నందుకే దుష్ప్రచారం
కుంభకోణాలు బయటకు తీయవద్దని నన్ను కలిసేందుకు కరుణాకర్‌రెడ్డి ప్రయత్నించారు
ఆయన దుర్మార్గాలు బయటకు వస్తాయనే నేను రాజీనామా చేయాలంటున్నారు
ప్రతి దాంట్లో అవినీతి చేశారు: టీటీడీ చైర్మన్
తిరుపతి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): తనపై వీడియోను మార్ఫింగ్ చేశారని, దుష్ప్రచారం చేసి అప్రతిష్ఠపాలు చేసేందుకు భూమన కరుణాకర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు. తనకు సంబంధించిన ఒక వీడియోను వైరల్ కావడం, దీనిపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి ఆరోపణలు చేయడంపై బీఆర్ నాయుడు ఆదివారం తిరుపతిలో స్పందించారు. 20 ఏళ్ల కిందటి ఫొటోలూ మిక్స్ చేసి సోషల్ మీడియాలో పెట్టారని, ఆ మహిళ కుటుంబంతో 30 ఏళ్లుగా పరిచయం ఉందని స్పష్టం చేశారు. ఆ వీడియోలో అసభ్యకరమైనది, అశ్లీలత ఏమీ లేదని, కొన్నిచోట్ల మార్ఫింగ్ చేశారని వెల్లడించారు. తనపై బురదజల్లితే భయపడేవాడిని కానని స్పష్టం చేశారు. ఈ విషయాన్ని ఉన్నతస్థాయికి తీసుకెళ్లి వీళ్ల సంగతి తేలుస్తానని హెచ్చరించారు. ‘‘శ్రీవారికి పట్టువస్ర్తాలు తీసుకువచ్చేప్పుడు సతీసమేతంగా ఎందుకు రావట్లేదని జగన్మోహన్‌రెడ్డిని ప్రశ్నించాను. గతంలో రాజశేఖరరెడ్డి రాలేదు. తర్వాత జగన్ రాలేదు. భారతి పేరు ఎత్తానని వాళ్లకు కోపం. రోజుకో కుంభకోణం బయటకు వస్తోందనే ఉద్దేశంతో నాపై బురదజల్లే కార్యక్రమం చేస్తున్నారు. నన్ను కలవాలని, నాతో మాట్లాడాలని, కుంభకోణాలు బయటకు తీయవద్దని చాలా విధాలుగా కరుణాకర్‌రెడ్డి ప్రయత్నించాడు. చంద్రబాబు నాకు పదవి ఇచ్చారు. ఆయన చెబితే ఒక్క నిమిషంలో రాజీనామా చేస్తాను. భూమన చేసిన దుర్మార్గాలు ఒకటి, రెండు కాదు.. వంద బయటకు వస్తున్నాయి. అవన్నీ బయటకు వస్తే తిరుపతి ప్రజలు ఆయన్ను తరిమితరిమి కొడతారు. ఐదేళ్లలో వేల టికెట్లు అమ్ముకున్నారనే రికార్డులు నా వద్ద ఉన్నాయి. నేనూ మీడియాలో ఉన్నాను.
నీకు (భూమన), సుబ్బారెడ్డికి చుక్కలు చూపిస్తాను. కరుణాకర్‌రెడ్డి.. నువ్వు మద్రాసుకు వెళ్లి ఏమేం చేశావో నాకు తెలుసు. వైవీ సుబ్బారెడ్డి ఏం చేశా డో నాకు తెలుసు. కరుణాకర్‌రెడ్డి హయాంలో భగవద్గీతను ఐదు భాషల్లో రూ.50 కోట్లు ఖర్చు చేసి కోటి పుస్తకాలు ప్రచురించారు. 32 లక్షల పుస్తకాలు గోడౌన్‌లో పడి ఉన్నాయి. అందులో ఏమీ లేదు. ఈ కుంభకోణంలో కరుణాకర్‌రెడ్డి కొడుకు ఉన్నాడు. ఏ ఫైల్ తీసుకున్నా అన్నీ దొంగ లెక్కలే. ఏకసభ్య కమిషన్ నుంచి దృష్టి మరల్చేందుకే నాపై దుష్ప్రచారం మొదలుపెట్టారు. నేను ఈ రోజు కొత్తగా కరుణాకర్‌రెడ్డి గురించి ఆరోపణలు చేయాల్సిన అవసరం లేదు. కరుణాకర్‌రెడ్డి దొంగ, జగన్ గజదొంగ అని ప్రపంచమంతా తెలుసు. నేను మొదటి బోర్డు సమావేశంలోనే హిందూయేతరులు వెళ్లిపోవాలన్నందుకే నాపై దాడి మొదలుపెట్టారు’’ అని బీఆర్ నాయుడు అన్నారు.