ఒకట్రెండు నెలల్లో అలిపిరి టౌన్‌షిప్‌కు పునాది
ABN , Publish Date - May 07 , 2026 | 03:47 AM
అలిపిరిలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌కు స్థలం ఎంపిక చేసి.. ఒకట్రెండు నెలల్లో పునాది రాయి వేయాలని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు.
జూలై 15 వరకు సిఫారసు లేఖలపై వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు
తిరుమలలోని రోడ్లు, కూడళ్లు, ముఖ్య ప్రాంతాలకు కొత్త పేర్లు
రాష్ట్రంలోని ఆలయాలకు ధూప, దీప, నైవేద్యాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.5 వేలు.. రూ.10 వేలకు పెంపు
టీటీడీ బోర్డు సమావేశంలో నిర్ణయం
తిరుమల, మే 6 (ఆంద్రజ్యోతి): అలిపిరిలో నిర్మించనున్న ఇంటిగ్రేటెడ్ టౌన్‌షిప్‌కు స్థలం ఎంపిక చేసి.. ఒకట్రెండు నెలల్లో పునాది రాయి వేయాలని నిర్ణయం తీసుకున్నామని టీటీడీ బోర్డు చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. తిరుమలలోని అన్నమయ్య భవనంలో బుధవారం టీటీడీ బోర్డు సమావేశం జరిగింది. ఈ వివరాలను ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, కొంతమంది బోర్డు సభ్యులతో కలిసి చైర్మన్ మీడియాకు వెల్లడించారు. తిరుమలలోని రోడ్లు, కూడళ్లు, మాడవీధులు, ముఖ్య ప్రాంతాలకు కొత్త పేర్లు పెట్టాలని నిర్ణయించామని, దీనికి 51 పేర్లను ఎంపిక చేసినట్టు వివరించారు. టీటీడీ విద్యాసంస్థల్లో అత్యాధునిక మౌలిక వసతుల ఏర్పాటుకు అదనంగా రూ.43.40 కోట్ల మంజూరుకు ఆమోదం తెలిపామన్నారు. దీంతో గతంలో ఇచ్చిన రూ.118 కోట్లతో కలిపి మొత్తం రూ.161.40 కోట్ల కేటాయింపులు జరిగినట్లు చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రాష్ట్రంలోని ఆలయాలకు ధూప, దీప, నైవేద్యాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.5 వేలను.. రూ.10 వేలకు పెంచేందుకు నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. కొన్ని ఆలయాలు, కల్యాణమండపాల నిర్వహణకు అవసరమైతే ఔట్‌సోర్సింగ్ ప్రాతిపదికన ఇస్తామన్నారు. కల్తీ నెయ్యి అంశంలో ఏకసభ్య కమిషన్ ప్రభుత్వానికి నివేదిక సమర్పించిందని, ప్రభుత్వం నుంచి ఏదైనా ఆదేశాలు వస్తే అనుసరిస్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. తిరుమలలోని కర్ణాటక సత్రాన్ని టూరిజం విభాగానికి అప్పగించారనే సమాచారం తమకు లేదని, ఏదైనా ఫిర్యాదులు వస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. వేసవి రద్దీకి తగినట్టు ఏర్పాట్లు పూర్తిచేశామన్నారు. మే 1 నుంచి జూలై 15వ తేది వరకు సిఫారసు లేఖలపై ఇచ్చే వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశామన్నారు. రద్దీకి తగ్గట్టుగా తిరుపతిలో జారీ చేసే ఎస్‌ఎస్డీ టోకెన్ల జారీలో మార్పులు, చేర్పులు చేస్తామన్నారు. ఆలయం ముందు రథ మండపం నిర్మాణంపైనా చర్చించామని తెలిపారు.
మరికొన్ని నిర్ణయాలు..
నీటి వృథాను అరికట్టేందుకు గోగర్భం డ్యాం నుంచి ఫిల్టర్ ప్లాంట్ వరకు రూ.6 కోట్లతో దాదాపు 2 కిలోమీటర్ల మేరకు అదనపు పైపు లైన్ ఏర్పాటుకు అనుమతి
అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మండలం వర్థనపల్లి గ్రామంలో శివాలయం నిర్మాణానికి రూ.55 లక్షల ఆర్థిక సాయం
సనాతన ధర్మాన్ని మరింత వ్యాప్తి చేయడంలో భాగంగా తలపెట్టిన ‘అక్షర గోవిందం’ కార్యక్రమంలో పాల్గొనే చిన్నపిల్లలకు పంపిణీ చేసే కిట్లను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయం
పద్మశ్రీ అవార్డు గ్రహీత డాక్టర్ శోభారాజ్‌ను తిరిగి టీటీడీ ఆస్థాన విద్వాన్‌గా నియమించేందుకు నిర్ణయం
గుంటూరు జిల్లా తుళ్లూరు మండలంలోని శ్రీవారి ఆలయంలో రాజగోపురం నిర్మాణానికి రూ.2.71 కోట్లు కేటాయింపు
అమరావతిలోని వెంకటపాలెంలోని శ్రీవారి ఆలయంలో రూ.36.95 కోట్లతో ఏడు అంతస్తుల మహారాజగోపురం, ఆర్జితసేవా మండపం, అద్దాల మండపం, వాహన మండపం, రథమండపం, ఆంజనేయస్వామి ఆలయం, పుష్కరిణి నిర్మాణానికి అంగీకారం
తిరుమలలో వివిధ ప్రాంతాల్లో ఉన్న కార్యాలయాలను ఒకే చోట ఏర్పాటు చేసేందుకు పరిపాలన భవనం నిర్మాణానికి ఆమోదం
అలిపిరి టోల్‌గేట్ వద్ద వాహనాల రద్దీని తగ్గించేందుకు సమీపంలో ఉన్న వినాయకస్వామి ఆలయం వద్ద రూ.4.25 కోట్లతో ఆర్టీసీ బస్సుల తనిఖీల కోసం శాశ్వత షెల్టర్లు ఏర్పాటుకు నిర్ణయం.