Share News

Sculpture Training Institute: ఈ తిరకాసేమిటి.. తిరుమలేశా?

ABN , Publish Date - Jan 12 , 2026 | 05:23 AM

ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అసలు ఏం జరుగుతోంది? టీటీడీ పాలక మండలిలో సభ్యులు, అధికారులు ఏం చేస్తున్నారు? ధర్మపరిరక్షణ సంస్థ అయిన టీటీడీ బోర్డులో నిబంధనలు ఎందుకు ఉల్లంఘిస్తున్నారు?

Sculpture Training Institute: ఈ తిరకాసేమిటి.. తిరుమలేశా?

  • నిబంధనలకు టీటీడీ బోర్డు తూట్లు.. ఈసారి ప్రఖ్యాత శిల్ప శిక్షణ సంస్థకు ఎసరు

  • ఎస్‌వీఐటీఎస్ఏ కూల్చివేతకు నిర్ణయం

  • అక్కడ భక్తులకు టౌన్‌షిప్‌ కడతారట

  • టీటీడీ బోర్డులో తీర్మానం ఆమోదం

  • అలిపిరి-చెర్లోపల్లి రహదారిలో ఏర్పాటుకు ఇంజనీరింగ్‌ అధికారుల ప్రతిపాదన

  • అందుబాటులో ఇతర స్థలాలూ ఉన్నాయి

  • అయినా విరుద్ధంగా టీటీడీ చైర్మన్‌ నిర్ణయం

  • ముందస్తు చర్చ లేకుండానే తీర్మానం

  • దీనివెనుక కారణాలపై ఎన్నో సందేహాలు

  • ఇటీవల వరుసగా వివాదాస్పద నిర్ణయాలు

అలిపిరిలో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థ (ఎస్‌వీఐటీఎస్ఏ-కాలేజీ) ఉంది. దేవతామూర్తుల విగ్రహాలను, స్థపతులను తయారు చేయడం దీని లక్ష్యం. ఏడు కొండల ముఖద్వారం కనిపించేలా ఈ శిక్షణ సంస్థను ఏర్పాటు చేశారు.

ఇంతటి విశిష్టత ఉన్న ఈ సంస్థను కూల్చేందుకు టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది. అక్కడ భక్తుల కోసం టౌన్‌షిప్‌ నిర్మించాలని టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు స్వయంగా ప్రతిపాదించారు. బోర్డులో ఆమోదింపజేసుకుని, తీర్మానం కూడా చేయించేశారు.

వాస్తవానికి అలిపిరి-చెర్లోపల్లి రహదారిలో తిరుపతికి సమీపంలోని పేరూరు గ్రామ పరిధిలో టౌన్‌షిప్‌ ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్‌ అధికారులు ప్రతిపాదించారు. ఇక్కడ టీటీడీకి ఖాళీగా 20 ఎకరాల భూమి ఉంది. తిరుమల కొండపైకి వెళ్లే దారికి సమీపంలో ఉంది. భక్తులకు సౌకర్యంగా ఉంటుందని ప్రతిపాదించారు. ఇది వద్దనుకున్నా అందుబాటులో ఇంకా చాలా భూములు ఉన్నాయి.

అధికారుల ప్రతిపాదనకు పూర్తి విరుద్ధంగా టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడు నిర్ణయం తీసుకున్నారు. ముందస్తు ప్రతిపాదన, చర్చ లేకుండా.. బోర్డులో అధికారులు ఉంచిన ప్రతిపాదనకు సవరణ చేశారు. ఎస్‌వీఐటీఎస్ఏకాలేజీని కూల్చేసి అక్కడ టౌన్‌షిప్‌ కట్టేలా తీర్మానం చేశారు. దీనిపై ఎన్నో సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

ప్రతిష్ఠాత్మక తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)లో అసలు ఏం జరుగుతోంది? టీటీడీ పాలక మండలిలో సభ్యులు, అధికారులు ఏం చేస్తున్నారు? ధర్మపరిరక్షణ సంస్థ అయిన టీటీడీ బోర్డులో నిబంధనలు ఎందుకు ఉల్లంఘిస్తున్నారు? వరుసగా చోటు చేసుకుంటున్న వివాదాస్పద అంశాలు భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇటీవల మాజీ మంత్రి యనమల ప్రైవేటు ఆలయాన్ని టీటీడీ పరిధిలోకి తీసుకురాగా.. మొన్నటికి మొన్న బోర్డు సభ్యుడిగా ఉన్న జంగా కృష్ణమూర్తికి చెందిన ట్రస్టుకు కొండపై భూమి కేటాయించారు. తాజాగా అలిపిరి సమీపంలో ఉన్న శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థ (ఎస్‌వీఐటీఎ్‌సఏ-కాలేజీ)ను కూలదోసి అక్కడ భక్తుల కోసం టౌన్‌షిప్‌ కట్టాలని బోర్డులో ఆమోదించారు. వాస్తవానికి తిరుమలకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారి వసతి కోసం.. అన్నిరకాల అధ్యయనాలు, పరిశీలనలు చేసి అలిపిరి-చెర్లోపల్లి మార్గంలో ఉన్న టీటీడీ స్థలం 20 ఎకరాల్లో టౌన్‌షిప్‌ కట్టాలని ఇంజనీరింగ్‌ అధికారులు ప్రతిపాదించారు. అయితే టీటీడీ చైర్మన్‌ బీఆర్‌నాయుడు ఆ ప్రతిపాదనను మార్చేశారని చెబుతున్నారు. ముందస్తుగా ఎలాంటి చర్చ, ప్రతిపాదన లేకుండా బోర్డు సమావేశంలో అప్పటికప్పుడు ఈ ప్రతిపాదనకు సవరణ చేశారు. అధికారులు వ్యతిరేకించినా.. ఎస్‌వీఐటీఎ్‌సఏ-కాలేజీని కూలదోసి అక్కడ టౌన్‌షిప్‌ కట్టాలనే సవరణ ప్రతిపాదనను ఆమోదించినట్లుగా ఏకంగా ఓ తీర్మానం చేసేశారు. అధికారులు ప్రతిపాదించినదానికి పూర్తి విరుద్ధంగా, వారు వద్దన్నా చైర్మన్‌ ప్రతిపాదన చేయడం, దాన్ని ఆమోదిస్తూ బోర్డులో తీర్మానం చేయడం జరిగిపోయాయి. చైర్మన్‌ అనూహ్య చర్య, ఈ నిర్ణయం వెనుక ఉన్న కారణాలపై అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ అంశంపై చర్చ జరిగినట్లుగా తమకు గుర్తే లేదని పలువురు సభ్యులు చెబుతున్నారు. ఇటు అధికారులు, అటు బోర్డు సభ్యులకు పూర్తి సమాచారం అందించకుండా, హడావుడిగా నిర్ణయం తీసుకోవడానికి ప్రత్యేక కారణాలు ఏమిటో?


ఇదీ తీర్మాన సారాంశం..: గత నెల 16న టీటీడీ పాలకమండలి సమావేశం జరిగింది. అందులో ఇంజనీరింగ్‌ విభాగం ఓ ప్రతిపాదన చేసింది. తిరుపతి సమీపంలోని పేరూరు గ్రామ పరిధిలో (అలిపిరి-చెర్లోపల్లి మార్గంలో) సర్వే నంబర్‌ 604-9లో 20 ఎకరాల భూమి ఉంది. అందులో భక్తుల కోసం టౌన్‌షిప్‌ నిర్మించాలని ప్రతిపాదించింది. ఇందుకోసం ప్రణాళికలు, డిజైన్లు అందించేందుకు నిపుణులను ఎంపిక చేయడానికి ఉద్దేశించిన టెండర్‌ డాక్యుమెంట్‌ (రిక్వెస్ట్‌ ఫర్‌ ప్రపోజల్‌)ను ఆమోదించాలని కోరింది. అయితే వారు ప్రతిపాదించిన స్థలంలో కాకుండా ఎస్‌వీఐటీఎ్‌సఏ-కాలేజీలో టౌన్‌షిప్‌ ఏర్పాటు కు బోర్డు చైర్మన్‌ బీఆర్‌ నాయుడు ప్రతిపాదించారని చెబుతున్నారు. దీన్ని పాలక మండలి ఆమోదించినట్లుగా తీర్మానం(నం. 600)లో చేర్చారు. తీర్మానం చివరన చైర్మన్‌ సంతకంతో ‘టౌన్‌షి్‌పను ఇప్పుడున్న శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థ ప్రాంగణంలో ఏర్పాటు చేయాలన్న సవరణకు ఆమోదించారు’ అని ఉంది. అంటే.. ఆలయ శిల్ప శిక్షణ సంస్థను కూలదోయాలన్నది అసలు టార్గెట్‌లా ఉంది.


అక్కడే ఎందుకు?

పేరూరులో ఖాళీగా ఉన్న స్థలం తిరుమల కొండపైకి వెళ్లే దారికి సమీపంలో ఉంది. అక్కడ సత్రాలు నిర్మిస్తే భక్తులకు సౌకర్యవంతంగా ఉంటుందని నిర్ధారణకు వచ్చింది. ఈ ప్రతిపాదనే ఎందుకన్నదానిపై ఇంజనీరింగ్‌ విభాగం స్పష్టంగా వివరణ ఇచ్చింది. కానీ దీన్ని బోర్డు చైర్మన్‌ కాదన్నారని తెలుస్తోంది. ఒకవేళ ఆ స్థలం వద్దనుకుంటే అలిపిరిలో, ఇంకా ఎస్వీ యూనివర్సిటీ వద్ద టీటీడీకి భూములున్నాయు. వాటిని కూడా ఎంపిక చేయవచ్చు. వాటిని పట్టించుకోకుండా శిల్ప శిక్షణ కాలేజీ ఉన్న భూముల్లోనే టౌన్‌షిప్‌ నిర్మాణం చేయాలని చైర్మన్‌ ఎందుకు ఎంచుకున్నారో? సవరణ ప్రతిపాదన గురించి అధికారులతో చైర్మన్‌ ముందే చర్చించి ఉంటే, ఆ స్థలాన్ని అధికారులు పరిశీలించేవారు. అక్కడ టౌన్‌షిప్‌ పెట్టాలో, వద్దో ఏదో ఒక అభిప్రాయం చెప్పేవారు. అలాకాకుండా పాలకమండలి సమావేశం జరుగుతుండగా.. ఉన్న ప్రతిపాదనను కాదని చైర్మన్‌ శిల్ప శిక్షణ కాలేజీనే ఎందుకు ఎంపిక చేశారు? సవరణ ప్రతిపాదన చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి? ప్రత్యేక కారణాలు ఏమై ఉంటాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.


హేతుబద్ధ్దత ఏదీ?

రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఏదైనా అంశంపై నిర్ణయం తీసుకోవాలంటే ముందుగా ప్రభుత్వ పెద్దలు చర్చించి, దాన్ని ప్రతిపాదనగా పంపించాలని సంబంధిత అధికారులను ఆదేశిస్తారు. అధికారులు ఆ మేరకు ప్రతిపాదన సమర్పిస్తారు. ఆ ప్రతిపాదనే ఎందుకు చేయాల్సి వచ్చింది? దాని అవసరం ఏమిటి? దానికున్న హేతుబద్ధత ఏమిటో అధికారులు లిఖితపూర్వకంగా మంత్రివర్గానికి పంపిస్తారు. దానిపై మంత్రివర్గంలో చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటారు. అంతేకానీ ముఖ్యమంత్రి అప్పటికప్పుడు ఓ సొంత నిర్ణయం తీసుకొని, దాన్ని మంత్రులంతా ఆమోదించాలని ఒత్తిడి చేయరు. టీటీడీ పాలక మండలికి కూడా ఇదే నియమం వర్తిస్తుంది. పైగా ధర్మ పరిరక్షణ బాధ్యతలు కూడా ఉంటాయి. ఏ ప్రతిపాదన అయినా అధికారుల నుంచి రావాలి. ఒకవేళ చైర్మన్‌ లేదా సభ్యుడు ప్రతిపాదించినా.. అది మరో సమావేశంలో ఓ ప్రతిపాదనగా అధికారుల నుంచి లిఖితపూర్వకంగా అజెండాలోకి రావాలి. అది జరగాలంటే ఆ ప్రతిపాదనపై ముందు చర్చ జరగాలి. అది సహేతుకంగా ఉందని అధికారులు భావించాలి. అలిపిరి-చెర్లోపల్లి మార్గంలో ఖాళీ స్థలంలో టౌన్‌షిప్‌ నిర్మించాలని, అందుకు కారణాలేమిటో ముందే అధికారులు నివేదించారు.


ఈ ప్రతిపాదన పాలక మండలి ముందు ఉంచడానికి ముందే శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ శిల్ప శిక్షణ సంస్థలో టౌన్‌షిప్‌ ఏర్పాటు చేయాలన్న తన మనసులో మాటను చైర్మన్‌ అధికారులకు చెప్పినట్లుగా, ముందుగా చర్చించినట్లుగా లేదు. సమావేశం మొదలయ్యాక ప్రతిపాదనపై చర్చ జరుగుతున్న సమయంలో అనూహ్యంగా టీటీడీ చైర్మన్‌ సవరణ ప్రతిపాదన తీసుకువచ్చి ఆమోదింపజేశారు. ఇందులో హేతుబద్ధ్దత కనిపించడం లేదని అధికారవర్గాలు చెబుతున్నాయి. సవరణ ప్రతిపాదన ఎందుకు చేయాల్సి వచ్చింది? దాని వెనకున్న నేపథ్యం ఏమిటి? అక్కడే ఎందుకు టౌన్‌షిప్‌ నిర్మించాలన్న కారణాలను చైర్మన్‌ లిఖితపూర్వకంగా బోర్డు ముందు ఉంచకపోవడం చర్చనీయాంశంగా మారింది. చైర్మన్‌ ఆలోచన అమలు చేయాలంటే, అక్కడున్న శిల్ప శిక్ష కాలేజీని మరోచోటకు మార్చాలి. ఇది సంప్రదాయాల పరిరక్షణకు సంబంధించిన సున్నితమైన అంశం. దీనిపై చర్చ జరగాలి. కానీ చైర్మన్‌ ఆ అవకాశమే ఇవ్వకుండా తీర్మానం చేయించడం కొత్త చర్చకు దారితీస్తోంది. అధికారుల అధ్యయన నివేదికలు, ప్రతిపాదనలకు భిన్నంగా టౌన్‌షి్‌పను శిల్ప కళ కాలేజీలోనే ఎందుకు ఏర్పాటు చేయాలనుకుంటున్నారు? హేతుబద్ధత కనిపించని ఈ ప్రతిపాదనల వెనక ఉన్న అసలు కోణం, కారణాలు ఏమిటో?


సంప్రదాయాలకు తూట్లు

ఆలయాలు, ప్రముఖ సంస్థలకు స్థానబలం, విశిష్టత ఉంటుంది. తిరుమల దేవదేవుడి ప్రసాదం గుడిలోపలే చేస్తారు. వెంకన్నకు అతి సమీపంలో ఉన్న పోటులో ప్రసాదం తయారు చేస్తారు. అక్కడ గతంలో అనేక అగ్నిప్రమాదాలు జరిగాయి. ఈ కారణం చూపి లడ్డూ తయారీని గుడి బయటకు మార్చాలని ప్రతిపాదనలు వచ్చాయి. వీటిని ఆగమశాస్త్రపండితులు అంగీకరించలేదు. సమస్యలున్నా ఆలయం లోపలే లడ్డూప్రసాదం తయారీ జరగాలని నిర్దేశించారు. అలాగే దేవతామూర్తుల శిల్పాల తయారీ ఏడుకొండల ముఖద్వారం కనిపించేలా, సప్తగిరుల బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండాలని 1960లో టీటీడీ నిర్ణయించింది. ఇది కూడా సంప్రదాయంలో భాగమే. ఇంతటి విశిష్టత, ప్రాముఖ్యత ఉన్న సంస్థను కూలదోసి మరెక్కడో నిర్మించాలనుకోవడ ం అనేక అనుమానాలను రేకెత్తిస్తోంది.

సంస్థ ప్రత్యేకత ఇదీ

శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ శిల్ప శిక్షణ సంస్థకు ఓ చారిత్రక నేపథ్యం ఉంది. రాష్ట్రవ్యాప్తంగా వెంకటేశ్వరస్వామి ఆలయాల నిర్మాణం చేపట్టాలన్న డిమాండ్లు వస్తుండటంతో దేవతామూర్తుల విగ్రహాల తయారీ, స్థపతులను తయారు చేయడం లక్ష్యంగా 1960లో టీటీడీ ఈ సంస్థను అలిపిరి సమీపంలో ఏర్పాటు చేసింది. దేశీయంగా, అంతర్జాతీయంగా భక్తులు ఏర్పాటు చేసే వెంకటేశ్వరస్వామి ఆలయాలు, ఇతర ఆలయాలకు దేవతామూర్తుల శిల్పాలకు ఇక్కడే ప్రాణం పోస్తున్నారు. విగ్రహాలను ఎంతో నిష్టతో తయారు చేసేలా, సప్తగిరుల బ్యాంక్‌గ్రౌండ్‌ కనిపించేలా సంస్థను తీర్చిదిద్దారు. ఆలయాల నమూనాల రూపకల్పన ఇక్కడే చేస్తారు. ప్రపంచ ప్రసిద్ధి పొందిన స్థపతులను ఈ సంస్థ అందించింది. ఈ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ప్రముఖ స్థపతులుగా ఎదిగారు. ప్రపంచ ఖ్యాతిగాంచిన ఆలయాల డిజైన్లు, గోపురాలు, శిలాశిల్పాలు, సుధాశిల్పాలు, పంచలోహ శిల్పాలు. సంప్రదాయ వర్ణచిత్రాలను ఇక్కడే తయారు చేశారు.

కొండపై అపచారాలు

గతంలో రాజశేఖరరెడ్డి సీఎంగా ఉన్నప్పుడు, ఆ తర్వాత జగన్మోహన్‌రెడ్డి హయాంలో టీటీడీ సంప్రదాయాలను తుంగలో తొక్కేందుకు అనేక ప్రయత్నాలు జరిగాయి. ఏడు కొండలను రెండు కొండలుగా మార్చాలనుకోవడం, అన్యమత ప్రచారాలకు సహకరించడం, మతపరమైన చిహ్నాలను ప్రదర్శించడం.. వంటి అపచారాలు జరిగాయి. మళ్లీ ఇప్పుడు మరో రకమైన అరాచకం టీటీడీలో కనిపిస్తోంది.

Updated Date - Jan 12 , 2026 | 06:00 AM