నో హారన్ జోన్‌గా తిరుమల!
ABN , Publish Date - Jul 01 , 2026 | 04:37 AM
ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో.. తిరుమల కొండపై శబ్దకాలుష్యం కట్టడికి టీటీడీ, పోలీసు విభాగాలు పూనుకున్నాయి. తిరుమలలో హారన్లు, సైరన్లు నిషేధం అంటూ భారీ ప్రచారం మొదలెట్టాయి.
హారన్లు, సైరన్ల వినియోగంపై నిషేధం
తిరుమల, జూన్ 30(ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలతో.. తిరుమల కొండపై శబ్దకాలుష్యం కట్టడికి టీటీడీ, పోలీసు విభాగాలు పూనుకున్నాయి. తిరుమలలో హారన్లు, సైరన్లు నిషేధం అంటూ భారీ ప్రచారం మొదలెట్టాయి. తిరుమలకు వచ్చే వాహనాల సంఖ్య రోజురోజుకూ భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. గతంలో 8 వేల వాహనాలు వస్తేనే ఎక్కువ అనుకునేవారు. అలాంటిది ప్రస్తుతం రోజూ పది వేలకుపైగా వాహనాలు తిరుమల కొండెక్కేస్తున్నాయి. అలిపిరి తనిఖీ కేంద్రంతో పాటు తిరుమల మొత్తం వాహనాలే కనిపిస్తున్నాయి. కొవిడ్ సమయం నుంచి సొంత వాహనాల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య పెరిగిన క్రమంలో తిరుమలలో శబ్దకాలుష్యం విపరీతంగా పెరిగింది. సాధారణంగా యూనివర్సిటీలు, ఆస్పత్రులు, ఆలయాలు వంటి వాటిని సైలెంట్ జోన్లుగా పరిగణిస్తారు. ఈ ప్రదేశాల్లో పగటి పూట 50, రాత్రి వేళ 40 డెసిబెల్స్ కంటే ఎక్కువగా శబ్దాలు వినిపించకూడదు. అయితే తాజా రికార్డుల ప్రకారం పగటి వేళల్లో 10 శాతానికి పైగా, రాత్రి వేళ్లల్లో 20 శాతానికిపైగా నాయిస్ లెవల్స్ నమోదవుతున్నాయి.
దాదాపుగా వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల్లో ఉన్న శబ్దాలు తిరుమలలో వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఇటీవల శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చిన సీఎం చంద్రబాబు.. తిరుమలలో పచ్చదనం పెంపుతో పాటు శబ్దకాలుష్య నియంత్రణపై కూడా దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఇందులో భాగంగానే అలిపిరి, తిరుమలలోని టోల్‌గేట్ల వద్ద ‘సైలెంట్ తిరుమల. హరన్లు, సైరన్ల వినియోగం నిషేధం. తిరుమలలో ప్రశాంతమైన వాతావరణానికి సహకరిద్దాం’ అంటూ సూచికబోర్డులు వెలిశాయి. నిజానికి 2020లోనే తిరుమలను నో హారన్ జోన్‌గా ప్రకటించినప్పటికీ అమలు జరగలేదు. ప్రస్తుతం తిరుమలలో శబ్ద కాలుష్యాన్ని పూర్తిస్థాయిలో నియంత్రించే లక్ష్యంతో ‘సైలెంట్ తిరుమల’ అంటూ.. పలు ప్రాంతాల్లో టీటీడీ, జిల్లా పోలీసులు సంయుక్తంగా బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు బ్రాడ్ కాస్టింగ్‌లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.