ఒకే చోట నుంచి తిరుమల పాలన
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:04 AM
తిరుమలలో పరిపాలనను సులభతరం చేయడానికి టీటీడీ నడుంకట్టింది. కార్యాలయాలన్నీ ఒకే చోట ఏర్పాటు చేసి పాలనను సమన్వయం చేయడానికి సంకల్పించింది.
అన్ని కార్యాలయాలకు ఇక ఒకే భవనం
85 కోట్లతో సెంట్రల్ అడ్మినిస్ర్టేషన్ బిల్డింగ్ నిర్మాణం
బి-టైప్ క్వార్టర్స్ పక్కన 1.35 ఎకరాలు ఎంపిక
నాలుగు అంతస్థులుగా భవంతి
24 విభాగాల కోసం సదుపాయాలు
టీటీడీ బోర్డు ఆమోదం.. త్వరలో టెండర్లు
తిరుమల, జూన్ 6(ఆంధ్రజ్యోతి): తిరుమలలో పరిపాలనను సులభతరం చేయడానికి టీటీడీ నడుంకట్టింది. కార్యాలయాలన్నీ ఒకే చోట ఏర్పాటు చేసి పాలనను సమన్వయం చేయడానికి సంకల్పించింది. దీని కోసం ‘సెంట్రల్ అడ్మినిస్ర్టేషన్ బిల్డింగ్’ నిర్మించనుంది. దాదాపు రూ. 85 కోట్లతో నిర్మించే ఈ భవంతికి టీటీడీ బోర్డు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తిరుమలలో అనేక విభాగాలు విస్తృతంగా సేవలందిస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఈ విభా గాల కార్యాలయాలు వివిధ చోట్ల ఉన్నాయి. దీంతో పరిపాలనలో ఇబ్బందులు ఏర్పడుతున్నాయి. పైగా, చాలా కార్యాలయాలు కాటేజీల్లో ఉన్నాయి. ఈ క్రమంలో అన్ని విభాగాలను ఒకే ప్రాంతంలో తీసుకువచ్చి సమర్థవంతమైన పరిపాలనతో భక్తులకు అదనపు వసతిని కూడా కల్పించవచ్చని టీటీడీ నిర్ణయించింది. మొత్తం 24 విభాగాలు ఒకే బిల్డింగ్ నుంచి పాలన సాగించేలా సదుపాయాలు కల్పించనున్నారు. తిరుమలలో అదనపు ఈవో కార్యాలయం, ఇంజనీరింగ్, రెవెన్యూ, ఎస్టేట్, విజిలెన్స్, అగ్నిమాపక, ఆరోగ్య, ఉద్యానవన, అటవీ, ఆలయ, అన్నప్రసాదం, కల్యాణకట్ట, మార్కెటింగ్, డెయిరీ ఫాం, డోనర్ సెల్, ట్రాన్స్‌పోర్టు, హెల్త్, ప్రజాసంబంధాలు, అకౌంట్స్, ఐటీ, పరకామణి, మ్యూజియం, అర్బన్ ప్లానింగ్ తదితర విభాగాలన్నీ ఒకే బిల్డింగ్‌లో ఉండేలా సెంట్రల్ అడ్మినిస్ర్టేషన్ బిల్డింగ్‌ను నిర్మించేందుకు బీ-టైప్ క్వార్టర్స్ ఉత్తరభాగంలో దాదాపు 1.35 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. అక్కడ పార్కింగ్‌కు సౌకర్యంగా ఉంటుందని అధికారులు భావించారు. ఈ స్థలం రింగ్‌రోడ్డు, క్యూలైన్లు సమీపంలోనే ఉండటంతో అన్నింటికీ సౌకర్యంగా ఉంటుందని అభిప్రాయపడ్డారు.
తొలుత షాపింగ్ కాంప్లెక్స్ వద్దనున్న అన్నపూర్ణ క్యాంటీన్ భవనంలో పరిపాలన భవనాన్ని నిర్మించాలని గతేడాది జూన్‌లో బోర్డు నిర్ణయించినప్పటికీ ఆ స్థలం కేవలం 1,412 చదరపు మీటర్లు మాత్రమే ఉండటంతో అన్ని కార్యాలయాలు అక్కడకు తరలించడానికి, పార్కింగ్‌కు ఇబ్బందులు వస్తాయని అధికారులు గుర్తించి ఆ నివేదికను బోర్డుకు సమర్పించారు. దీంతో బీ-టైప్ క్వార్టర్స్ ఉత్తరభాగంలో స్థలానికి మొగ్గు చూపారు. నాలుగు అంతస్థులుగా నిర్మించే కేంద్రీయ పాలన భవనాన్ని పూర్తిగా ‘గ్రీన్ బిల్డింగ్’గా ఏర్పాటు చేయాలని టీటీడీ భావిస్తోంది. దీనిలో సోలార్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. పచ్చదనం ఉట్టిపడేలా భవనాన్ని నిర్మించనున్నారు. కార్యాలయాలతో పాటు మీటింగ్ హాల్స్, మినీ థియేటర్‌ను ఏర్పాటు చేస్తారు. డిజైన్లు పూర్తయిన తర్వాత త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించనున్నారు.
టీటీడీ ఆలయాల్లో రూ.2.33 లక్షల తరుగు
అభరణాల్లో విలువైన రాళ్లు, ఇతర వస్తువులు మాయం
సంబంధిత అధికారుల నుంచి వివరణ కోరిన టీటీడీ
తిరుపతి(టీటీడీ), జూన్ 6(ఆంధ్రజ్యోతి): దేశవ్యాప్తంగా టీటీడీ పరిధిలో ఉన్న ఆలయాల్లో ఏటా బంగారం, వెండి, వజ్రాభరణాల వివరాలను తిరువాభరణం రిజిస్టర్‌లో నమోదు చేస్తుంటారు. ఇందులో భాగంగా 2024-25 సంవత్సరానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఉన్న 81 టీటీడీ ఆలయాల్లో పరిశీలన చేశారు. తిరుమలలోని మూలవర్ల తిరువాభరణంలో రూ.47,500 విలువైన రాళ్లు, మలయప్ప స్వామి తిరువాభరణాల్లో రూ.18,910 విలువైన రాళ్లు లేవని గుర్తించారు. మొత్తంగా రూ.1.01 లక్షల విలువైన రాళ్లు, ఇతర వస్తువులు లేవని పరిశీలనలో వెల్లడైంది. మకరకంఠిలో రూ.2,500 విలువైన రాళ్లు, తిరుచానూరు పద్మావతీ దేవి ఆలయంలో రూ.10,400 విలువైన రాళ్లతో పాటు రూ.18,878 విలువైన వస్తువులు తగ్గినట్లు రికార్డుల్లో పొందుపర్చారు. మొత్తం 81 ఆలయాల పరిధిలో రూ.2,33,461 మేర తరుగును గుర్తించారు. వాస్తవానికి బ్రహ్మోత్సవాలు, ఇతర ఉత్సవాల సమయంలో వినియోగించినప్పుడు ఆభరణాల్లోని కొన్ని రాళ్లు పోతుంటాయి. ఏటా తిరువాభరణం రిజిస్టర్ పరిశీలన సమయంలో ఆ వివరాలను అధికారుల నుంచి సేకరిస్తారు. నిబంధనల మేరకు సంబంధిత అధికారుల నుంచి ఆరు నెలల్లోగా వివరణ తీసుకోవాలని కమిటీ సూచించింది.