Share News

శ్రీవాణి దాతలకు టీటీడీ వెసులుబాటు

ABN , Publish Date - May 16 , 2026 | 04:26 AM

శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు ఇచ్చి శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూసే భక్తులకు వెసులుబాటు కల్పిస్తూ టీటీడీ ప్రత్యేకంగా టికెట్లు కేటాయించనుంది.

శ్రీవాణి దాతలకు టీటీడీ వెసులుబాటు

  • విరాళాలిచ్చి దర్శనం కోసం ఎదురుచూసేవారికి జూన్‌ నుంచి ప్రత్యేకంగా టికెట్లు కేటాయింపు

తిరుమల, మే 15(ఆంధ్రజ్యోతి): శ్రీవాణి ట్రస్టుకు విరాళాలు ఇచ్చి శ్రీవారి దర్శనం కోసం ఎదురుచూసే భక్తులకు వెసులుబాటు కల్పిస్తూ టీటీడీ ప్రత్యేకంగా టికెట్లు కేటాయించనుంది. జూన్‌ నెల మొదటి వారం నుంచి ప్రత్యేకంగా వీరికి శ్రీవాణి టికెట్లు కేటాయించేలా ఏర్పాట్లు చేస్తోంది. గతంలో ఆన్‌లైన్‌ ద్వారా శ్రీవాణి టికెట్ల కోసం విరాళాలు ఇచ్చి దర్శనం టికెట్లు పొందలేకపోయిన భక్తులు సుమారు 40 వేల మందికి పైగానే ఉన్నారు. నిజానికి విరాళమిచ్చిన భక్తులు ఏడాదిలో ఎప్పుడైనా శ్రీవారి వీఐపీ బ్రేక్‌ దర్శన టికెట్లు పొందే అవకాశముంది. అయితే టీటీడీ ఇటీవల విరాళంతో పాటు టికెట్‌ నగదును కూడా ఒకేసారి చెల్లించే అవకాశాన్ని కల్పించింది. దీంతో గతంలో విరాళం చెల్లించి టికెట్ల కోసం ఎదురుచూసే భక్తులకు దర్శన టికెట్లను బుక్‌ చేసుకునే వెసులుబాటు దూరమైంది. ఈ క్రమంలో సమస్యను పరిష్కరించేందుకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ఇటీవల అధికారులతో సమీక్షించారు. విరాళాలు ఇచ్చి దర్శనం కోసం ఎదురు చూస్తున్న భక్తులకు ప్రత్యేకంగా వెబ్‌సైట్‌లో ఆప్షన్‌ పెట్టి ఏడాదిలోపు పూర్తిచేయాలని ఆదేశించారు. సాఫ్ట్‌వేర్‌ను మే నెలాఖరులోగా అందుబాటులోకి తేవాలని స్పష్టంచేశారు. ఈ క్రమంలో ఇప్పటికే ఐటీ విభాగ అధికారులు దాదాపు 80 శాతం సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశారు. ప్రస్తుతం రోజూ ఆన్‌లైన్‌ కరెంట్‌ బుకింగ్‌ కోటాలో 800, ఎయిర్‌పోర్టులో 200తో పాటు మూడునెలల ముందు ఇచ్చే ఆన్‌లైన్‌ కోటాతో సహా మొత్తం 1,500 మందికి దర్శనం కల్పిస్తుండగా, ఈ కోటాలో 200 నుంచి 300 టికెట్లను గతంలో విరాళాలు ఇచ్చిన భక్తులకు ప్రత్యేకంగా కేటాయించాలని టీటీడీ భావిస్తోంది.

Updated Date - May 16 , 2026 | 04:27 AM