ఎస్వీ గోశాలకు రూ.1.85 కోట్ల ఎండుగడ్డి విరాళం
ABN , Publish Date - May 11 , 2026 | 04:28 AM
జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్, శ్రీనివాస సేవా ట్రస్టు ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ గోశాలకు ఆదివారం భారీగా ఎండుగడ్డి విరాళం అందింది. టీటీడీ బోర్డు సభ్యుడు..
తిరుపతి(టీటీడీ), మే 10 (ఆంధ్రజ్యోతి): జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్, శ్రీనివాస సేవా ట్రస్టు ఆధ్వర్యంలో తిరుపతి ఎస్వీ గోశాలకు ఆదివారం భారీగా ఎండుగడ్డి విరాళం అందింది. టీటీడీ బోర్డు సభ్యుడు జ్యోతుల నెహ్రూ, ట్రస్టు చైర్మన్ టి.సత్యనారాయణ 180 లారీల ద్వారా రూ.1.85 కోట్ల విలువైన 1600 టన్నుల ఎండుగడ్డిని విరాళంగా అందజేశారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరి మాట్లాడుతూ కాకినాడ జిల్లా జగ్గంపేట ప్రాంతం నుంచి ఎండుగడ్డిని సేకరించి సొంత నిధులతోపాటు, రవాణా ఖర్చులను భరిస్తూ ఇంత భారీ స్థాయిలో విరాళం అందించడం అభినందనీయమన్నారు. ఎస్వీ గోశాలకు అందించిన ఎండుగడ్డిని తిరుపతి, తిరుమల, పలమనేరు, భాకరాపేట సమీపంలోని కమలయ్యగారిపల్లె గోశాలలకు సరఫరా చేస్తామన్నారు. జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ గత ఏడాది 38 లారీల ఎండుగడ్డిని అందించామని, ఈసారి 180 లారీలు విరాళంగా సమర్పించడం ఆనందంగా ఉందన్నారు. జగ్గంపేట రైతులు ఉచితంగా ఎండుగడ్డిని అందించడం గొప్ప విషయమని కొనియాడారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి, జానకీదేవి, భానుప్రకాశ్‌రెడ్డి, ఎన్.సదాశివరావు, శాంతారామ్, దర్శన్, ఎస్వీ గోశాల డైరెక్టర్ ఏవీఎన్ శివకుమార్, ఏవీఎస్వో రమేష్, వైద్యులు భువన, అనిల్ తదితరులు పాల్గొన్నారు. ఇదే సందర్భంగా జ్యోతుల నెహ్రూ ఎస్వీ గోశాలకు రెండు గోవులు, దూడను విరాళంగా అందించారు.