ఏపీలో ట్రిపుల్ ఇంజన్ సర్కార్: సుజనా చౌదరి
ABN , Publish Date - Feb 19 , 2026 | 04:08 AM
‘ఆంధ్రప్రదేశ్‌లో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది. ఇది రాష్ట్రాన్ని పునర్నిర్మించే బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది’ అని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కొనియాడారు.
బడ్జెట్‌తో ప్రజల్లో భరోసా పెరిగింది: ఎమ్మెల్యేలు
అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): ‘ఆంధ్రప్రదేశ్‌లో ట్రిపుల్ ఇంజన్ సర్కార్ నడుస్తోంది. ఇది రాష్ట్రాన్ని పునర్నిర్మించే బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది’ అని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి కొనియాడారు. బుధవారం అసెంబ్లీల్లో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా ఆయనతో పాటు ఎమ్మెల్యేలు జ్యోతుల నెహ్రూ, కురుపాం ఎమ్మెల్యే జగదీశ్వరీ, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి, తాడేపల్లి ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి, పెదకూరపాడు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, శింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణ్ ప్రసంగించారు. ‘రాష్ట్రాభివృద్ధికి కేంద్ర నిధులు కూడా వాడుకోవాలి. ఈ ఏడాది 16వ ఆర్థిక సంఘం, రాష్ట్రానికి దాదాపు రూ.60 వేల కోట్లు ఇచ్చేందుకు సిద్ధమైంది. ప్రభుత్వం ఇచ్చే నిధులతో పాటు సీఎ్‌సఆర్ నిధులను తెప్పించుకుని, వాటితో నియోజకవర్గాల అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యేలపై ఉంది. ప్రభుత్వం ఎమ్మెల్యేలకు కొంత మేర నిధులు ఇవ్వాలి’ అని సుజనా కోరారు. రాష్ట్ర బడ్జెట్ సామాన్యుడికి భరోసా, నమ్మకం కల్పించే విధంగా ఉందని జగ్గంపేట ఎమ్మెల్యేల జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ బడ్జెట్ దూరదృష్టి కలిగిన నాయకత్వానికి ప్రతిబింబమని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. పేదరికం లేని సమాజ సాధనే లక్ష్యమని, కొవ్వూరు ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి అన్నారు.