చదువుల తల్లి శివాని బలవన్మరణం
ABN , Publish Date - Jul 28 , 2026 | 05:49 AM
‘‘నా పేరు శివాని. పదో తరగతి చదువుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి పాల్గొన్న మెగా పీటీఎం వేదికపై మాట్లాడడం చాలా గర్వంగా ఉంది.’’..... మూడ్రోజుల కిందట వేల మంది సమక్షంలో ఆత్మవిశ్వాసంగా పలికిన ఈ మాటలే..
మూడు రోజుల క్రితమే సీఎం ప్రశంసలు
‘నేను శివాని..’ అంటూ మెగా పీటీఎం వేదికపై చంద్రబాబు సమక్షంలో మాట్లాడిన గిరిజన బిడ్డ
చదువులో టాపర్.. ఆశలు రేపి..అంతలోనే విషాదం
‘అమ్మానాన్న.. చాలా సారీ..’ ‘సూసైడ్ నోట్’లో వేదన
ముఖ్యమంత్రి, లోకేశ్ తీవ్ర విచారం
ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశం
రంపచోడవరం, అమరావతి, జూలై 27(ఆంధ్రజ్యోతి): ‘‘నా పేరు శివాని. పదో తరగతి చదువుతున్నాను. గౌరవ ముఖ్యమంత్రి పాల్గొన్న మెగా పీటీఎం వేదికపై మాట్లాడడం చాలా గర్వంగా ఉంది.’’..... మూడ్రోజుల కిందట వేల మంది సమక్షంలో ఆత్మవిశ్వాసంగా పలికిన ఈ మాటలే.. నేడు అందరి గుండెలను బరువెక్కిస్తున్నాయి. గిరిజన విద్యార్థిని ముర్రం శివాని (15) సోమవారం ఇంట్లో ఉరివేసుకుని చనిపోయింది. ‘మీ చేతుల మీదుగా ఏదో ఒకరోజు అవార్డు తీసుకుంటాను’’ అని నాడు వేదికపై చంద్రబాబు సమక్షంలో కంచుకంఠంతో శివాని మాట్లాడింది. ఆమె మాటలు గుర్తు తెచ్చుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. శివాని మరణానికి కారణమైన పరిస్థితులను వెలికితీయాలంటూ పోలీసులను ముఖ్యమంత్రి ఆదేశించారు. చనిపోవడానికి ముందు శివాని రాసినట్టు చెబుతున్న సూసైడ్ నోట్‌లోని అంశాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వివరాల్లోకి వెళితే.. పోలవరం జిల్లా రంపచోడవరం ఇర్లపల్లి గ్రామానికి చెందిన సౌభాగ్యవతి, మురళీకృష్ణల కుమార్తె శివాని. రంపచోడవరం ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. చదువులో ఎప్పుడూ ముందుంటూ పాఠశాల టాపర్‌గా, ఉత్తమ ఆదివాసీ విద్యార్థినిగా గుర్తింపు పొందింది. ఈ కారణంగానే మెగా పీటీఎంలో భాగంగా సీఎంతో కలిసి వేదిక పంచుకునే అవకాశం స్కూలు యాజమాన్యం ఆమెకు ఇచ్చింది. తల్లి సౌభాగ్యవతి కోరుకొండ సమీపంలోని వెదురుపాకలో అంగన్వాడీ టీచర్. తండ్రి మురళీకృష్ణ కోరుకొండలో బిర్యాని పాయింట్ నిర్వహిస్తున్నారు. సౌభాగ్యవతికి తొలుత వరప్రసాద్ అనే వ్యక్తితో వివాహంకాగా, వారికి ఒక కుమారుడు ఉన్నాడు. 15 ఏళ్ల కిందట వరప్రసాద్ మరణించారు. అనంతరం ఆమె మురళీకృష్ణను రెండో వివాహం చేసుకుంది. ఈ దంపతులిద్దరూ గత పదేళ్లుగా వేర్వేరు గ్రామాల్లో విడిగా ఉంటున్నారు. దీంతో శివాని అమ్మ, అమ్మమ్మ సంరక్షణలో పెరిగింది. శుక్రవారం మెగా పీటీఎంలో విద్యార్థుల తరపున ముఖ్యమంత్రి ఎదుట ప్రసంగించి ఆయన అభినందనలు అందుకున్న సంతోషంలో శివాని తన తండ్రి వద్దకు వెళ్లింది. ఆయన కొనిపెట్టిన కొత్త దుస్తులు ధరించి ఎంతో ఆనందంగా ఆదివారం ఇర్లపల్లికి తిరిగి వచ్చినట్టు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అలాంటిది తెల్లారి ఇంట్లో ఉరివేసుకుని శివాని కనిపించింది.
సీఎం ఆవేదన..సమగ్ర దర్యాప్తునకు ఆదేశం
ఆర్టీజీఎస్ సమావేశంలో ఉండగా, ముఖ్యమంత్రికి శివాని మరణం విషయం తెలిసింది. ‘‘శివాని మృతి నన్ను తీవ్ర విషాదంలోకి నెట్టేసింది. మెగా పేరెంట్ టీచర్ మీటింగ్‌లో వేదికపై ఎంతో ఉత్సాహంగా మాట్లాడింది. తన చదువు, ఉన్నత లక్ష్యాల గురించి శివాని చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తుకొస్తూనే ఉన్నాయి. ఎంతో భవిష్యత్తు ఉన్న గిరిజన బిడ్డ తనువు చాలించడం బాధాకరం. ఎంతటి సమస్యకైనా పరిష్కారం ఉంటుంది. మీ బాధను ఆవేదనను, మీ కుటుంబ సభ్యులతో, స్నేహితులతో, ఆత్మీయులతో పంచుకోండి. ఒత్తిడిని అధిగమించి మీ కలలను నిజం చేసుకునేలా ముందుకు సాగండి. ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా అండగా ఉంటుంది’’ అని సీఎం హామీ ఇచ్చారు. శివానీ మాటలు పదే పదే గుర్తుకొస్తున్నాయని మంత్రి లోకేశ్ ఆవేదన వ్యక్తం చేశారు.
చివరి లేఖలో ఆవేదన
వేలాదిమంది ఎదుట ఏమాత్రం బెరుకు లేకుండా మాట్లాడిన శివాని, తనది అని చెబుతున్న సూసైడ్ నోట్‌లో మాత్రం అంతులేని మానసిక వేదనను వ్యక్తం చేసింది. ఆ లేఖ పూర్తి పాఠం.. ‘‘అమ్మ చాలా సారీ. నాకోసం చాలా కష్టపడ్డావ్. డాడీ...నీ డ్రీమ్ నెరవేర్చలేకపోతున్నా. నా కల కూడా సాధించుకోలేకపోతున్నా. నాకు బతకాలని ఉంది. కానీ బతకలేకపోతున్నా. అవమానంగా ఉంది. అమ్మ...నీ కోసం నేనేం చేయలేదు. డాడీ... నీకు ఏదైనా సాధించి చూపించాలని ఉంది. కానీ ఇంతకుమించి తట్టుకోలేకపోతున్నా. ఈ బాధ మొయ్యడం నావల్ల కావట్లేదు. చనిపోయాక నాపై ఎవరూ కోప్పడకండి. డాడీ...నన్ను మీరు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉండండి. అమ్మా బై.. అమ్మమ్మ జాగ్రత్త. అన్నయ్య.. డాడీ మాట విని బాగుపడు. చెడు పనులు చెయ్యకు. అన్నయ్య, వదిన, అమ్మ, అమ్మమ్మ మీరు ఎప్పటికైనా కలవండి. ద్వేషించుకోకండి’’ అని ఆ లేఖలో కోరింది. ఇర్లపల్లి ఆశ్రమ పాఠశాలలో 8 వరకు చదివిన శివాని, తొమ్మిదో తరగతిలో రంపచోడవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చేరింది. అక్కడ టాపర్‌గా నిలిచింది. క్రమశిక్షణ, వినయం, చదువుపై అంకితభావంతో ఉపాధ్యాయుల అభిమానం సంపాదించింది. తోటి విద్యార్థులకు ఆదర్శంగా నిలిచిన ఆమె మరణవార్తతో పాఠశాల శోకసంద్రంగా మారింది. ఉపాధ్యాయులు, విద్యార్థులు కన్నీరుమున్నీరయ్యారు. మృతదేహానికి రంపచోడవరం ఎమ్మెల్యే శిరీషాదేవి నివాళులు అర్పించారు.
వెంటాడుతున్న ప్రశ్నలు
శివాని ఎందుకిలాంటి నిర్ణయం తీసుకుంది.. ఆమెను అంతలా కలచివేసిన పరిస్థితులేంటి... ఆమె మనసులో నడిచిన సంఘర్షణ ఏమిటనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి.