Share News

విద్యార్థినిని వీపున కట్టుకుని..!

ABN , Publish Date - Jul 04 , 2026 | 04:30 AM

ఓవైపు వర్షం.. మరోవైపు రాళ్లతో కూడిన అటవీమార్గం.. అయినా మొక్కవోని ధైర్యం తో.. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థినిని తన వీపు పై మోసుకుని..

విద్యార్థినిని వీపున కట్టుకుని..!

  • ఆసుపత్రిలో చేర్చి ప్రాణాలు కాపాడిన భద్రగిరి వార్డెన్‌ హేమ

  • వర్షంలో.. అడవి మార్గంలో 3 కిలో మీటర్లు కాలినడకన తెగువ

  • మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ శైలజ ప్రశంసలు

పార్వతీపురం/గుమ్మలక్ష్మీపురం, జూలై 3(ఆంధ్రజ్యోతి): ఓవైపు వర్షం.. మరోవైపు రాళ్లతో కూడిన అటవీమార్గం.. అయినా మొక్కవోని ధైర్యం తో.. తీవ్ర అస్వస్థతకు గురైన విద్యార్థినిని తన వీపు పై మోసుకుని వెళ్లి సకాలంలో వైద్యం అందించి ఆ చిన్నారి ప్రాణాలు కాపాడారు ఓ మహిళా వార్డెన్‌. ఆమె చూపిన తెగువ, మానవత్వం ఇప్పుడు అందరి నీ కదిలిస్తోంది. ఈ ఘటన ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది!. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలంలోని మారుమూల వాడపుట్టి కొండ శిఖర గ్రామానికి చెందిన విద్యార్థిని భువనేశ్వరి భద్రగిరి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్ర మ పాఠశాలలో ఏడో తరగతి చదువుతోంది. ఇటీవల సెలవుల సందర్భంగా వాడపుట్టికి వెళ్లింది. ఆ విద్యార్థిని తండ్రి చనిపోవడంతో తన బాబాయ్‌ వద్ద ఉంటోంది. అక్కడ ఆ బాలికకు తీవ్రమైన కడుపునొప్పి, వాంతులు, అధిక జ్వరం వచ్చింది. పాఠశాల తెరిచినా రాకపోవడంతో వార్డెన్‌ హేమ జూన్‌ 30న ఆ గ్రామానికి వెళ్లారు. విద్యార్థిని ఆరోగ్యం విషమం గా ఉండడంతో ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు యత్నించారు. అప్పటికే వర్షం పడుతోంది. గ్రామానికి రోడ్డు లేకపోవడంతో అంబులెన్స్‌ వచ్చే పరిస్థితి లేదు. దీం తో ఆ బాలికను ఓ చీరతో తన వీపునకు కట్టుకుని సుమారు మూడు కిలోమీటర్లు కాలికనడకన వెళ్లి నెల్లికెక్కువ గ్రామానికి చేర్చింది. అక్కడి నుంచి బాలికను అంబులెన్స్‌లో పార్వతీపురం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స అందించారు. బాలిక కోలుకుని శుక్రవారం ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయింది. వార్డెన్‌ చూపిన సేవాభావం, సమయస్ఫూర్తి, మానవత్వాన్ని అందరూ కొనియాడుతున్నారు. ఆలస్యంగా వెలుగుచూసిన ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ రాయపాటి శైలజ శుక్రవారం ఎక్స్‌ వేదికగా స్పందించారు. ప్రతికూల వాతావరణంలో సైతం బాలికను ఆస్పత్రికి తరలించిన తీరును అభినందించారు.

Updated Date - Jul 04 , 2026 | 04:31 AM