Share News

గిరిజనులకు తప్పని డోలీ వెతలు!

ABN , Publish Date - May 20 , 2026 | 05:40 AM

గిరిజనులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో వైద్యం చేయించుకోవాలంటే నడకయాతన పడాల్సి వస్తోంది.

గిరిజనులకు తప్పని డోలీ వెతలు!

సాలూరు, మే19(ఆంధ్రజ్యోతి): గిరిజనులకు డోలీ కష్టాలు తప్పడం లేదు. గ్రామాలకు రహదారి సౌకర్యం లేకపోవడంతో వైద్యం చేయించుకోవాలంటే నడకయాతన పడాల్సి వస్తోంది. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం కొదమ పంచాయతీ పరిధి బందపాయి గిరిశిఖర గ్రామానికి చెందిన సోడిపిల్లి టీటమ్మ కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. సోమవారం సాయం త్రం కడుపునొప్పి ఎక్కువవడంతో గ్రామస్థులు, కుటుంబ సభ్యులు డోలీ కట్టారు. ఆమెను మోసుకుంటూ.. బందపాయి నుంచి సుమారు 5 కిలోమీటర్లు రాళ్లు రప్పలు దాటి.. కొండ దిగి లోద్ద గ్రామం వరకు చేరుకున్నారు. అక్కడి నుంచి బైకుపై మక్కువ మండలం దుగ్గేరు వెళ్లారు. ఆ గ్రామం నుంచి ఆటో ద్వారా పార్వతీపురం మన్యం జిల్లాకేంద్రాస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యులు చికిత్స అందించడంతో ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉంది. మంగళవారం ఉదయం ఆమెను డిశ్చార్జి చేశారు. కాగా, ఈ విషయం తెలుసుకున్న మంత్రి గుమ్మిడి సంధ్యారాణి పార్వతీపురం జిల్లాకేంద్రాస్పత్రి వైద్యులతో ఫోన్‌లో మాట్లాడారు. టీటమ్మ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మట్లాడుత...కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో రూ.1400 కోట్లతో అనేక గ్రామాలకు రహదారి సౌకర్యం కల్పించామన్నారు. రానున్న రోజుల్లో మరిన్ని గ్రామాల్లో రోడ్ల నిర్మాణం చేపడతామని వెల్లడించారు. గత వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యమే.. గిరిజనులకు శాపంగా మారిందని ఆరోపించారు.

Updated Date - May 20 , 2026 | 05:41 AM