Srisailam ITDA: శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోకి గిరిజన ఆశ్రమ పాఠశాలలు
ABN , Publish Date - Jan 20 , 2026 | 05:30 AM
కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఉన్న ఆశ్రమ పాఠశాలలను జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారుల పాలన నుంచి శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి...
అమరావతి, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): కర్నూలు, ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో ఉన్న ఆశ్రమ పాఠశాలలను జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారుల పాలన నుంచి శ్రీశైలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి (పీవో) పరిధిలోకి తెస్తూ గిరిజన సంక్షేమశాఖ ఉత్తర్వులు జారీచేసింది. 2012కు ముందు శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలన్నీ శ్రీశైలం ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తుండేవారు. 2012 ఫిబ్రవరి 27న ఉమ్మడి రాష్ట్రంలో గిరిజన సంక్షేమశాఖ కమిషనర్... ఈ ఆశ్రమ పాఠశాలలను జిల్లా గిరిజన సంక్షేమాధికారి పరిధిలోకి తెస్తూ ఉత్తర్వులిచ్చారు. 2012 ఏప్రిల్ నుంచి ఆ ఉత్తర్వులు అమల్లోకి వచ్చాయి. కర్నూలు జిల్లాలోని ఆరు ఆశ్రమ పాఠశాలలు, ప్రకాశం జిల్లాలోని 14 ఆశ్రమ పాఠశాలలు, గుంటూరు జిల్లాలోని 3 ఆశ్రమ పాఠశాలలు జిల్లా కేంద్రాలకు దూరంగా ఉండటం వల్ల వాటి పర్యవేక్షణ అధికారులకు ఇబ్బందిగా ఉందని, వాటిని సమీపంలోని శ్రీశైలం ఐటీడీఏ పీవో పరిధిలోకి తీసుకురావాలని గిరిజన సంక్షేమశాఖ డైరక్టర్ సిఫారసు చేశారు. దీంతో వాటి పాలనాబాధ్యతలను శ్రీశైలం ఐటీడీఏ పరిధిలోకి తెస్తూ గిరిజన సంక్షేమ శాఖ ఆదేశాలిచ్చింది.