Share News

Transport Department: 2 వేల కేసులు.. 1.3 కోట్ల ఫైన్‌!

ABN , Publish Date - Jan 20 , 2026 | 04:08 AM

సంక్రాంతి పండుగ రద్దీని సొమ్ము చేసుకుంటూ, ప్రయాణికుల నుంచి అనుమతికి మించి అధిక చార్జీలు వసూలు చేసిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు.

Transport Department: 2 వేల కేసులు.. 1.3 కోట్ల ఫైన్‌!

  • సంక్రాంతికి ‘ప్రైవేటు’ బాదుడుపై ఆర్టీఏ కొరడా

  • వందల ట్రావెల్స్‌ బస్సులపై అధికారుల చర్యలు

  • స్పెషల్‌ డ్రైవ్‌లో రాష్ట్రవ్యాప్తంగా విస్తృత తనిఖీలు

  • పన్ను ఎగవేత, పర్మిట్‌ ఉల్లంఘనలూ గుర్తింపు

అమరావతి, జనవరి 19(ఆంధ్రజ్యోతి): సంక్రాంతి పండుగ రద్దీని సొమ్ము చేసుకుంటూ, ప్రయాణికుల నుంచి అనుమతికి మించి అధిక చార్జీలు వసూలు చేసిన ప్రైవేట్‌ ట్రావెల్స్‌పై రవాణా శాఖ అధికారులు కొరడా ఝుళిపించారు. ఈ నెల 9 నుంచి 18 వరకు ఆర్టీఏ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టింది. రెండు, మూడు రెట్లు అధికంగా చార్జీలు పిండుకున్న 548 బస్సులపై కేసులు నమోదు చేసి, రూ.55.87 లక్షల జరిమానా విధించారు. సాధారణ చార్జీలతో పోలిస్తే పండుగ సమయంలో 50 శాతం అదనంగా వసూలు చేసుకొనేందుకు ప్రైవేట్‌ ట్రావెల్స్‌ను ఆర్టీఏ అధికారులు అనుమతించారు. అయితే అత్యాశకు పోయిన కొన్ని ట్రావెల్స్‌ వంద, రెండొందల శాతం అధికంగా వసూలు చేశాయి. దీంతో రవాణా శాఖ అధికారులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు. మన రాష్ట్రంలో అతి పెద్ద పండుగైన సంక్రాంతికి పొరుగు రాష్ట్రాలైన తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు నుంచి లక్షలాది మంది సొంతూళ్లకు వచ్చి వెళ్లారు. పండుగకు ముందు ఇటు వచ్చే, ఆ తర్వాత తిరిగి వెళ్లే వారి నుంచి భారీగా చార్జీలు వసూలు చేస్తున్న ట్రావెల్స్‌పై రవాణా శాఖ కమిషనర్‌ మనీష్‌ కుమార్‌ సిన్హాకు ఫిర్యాదులు అందాయి. టికెట్లు బుక్‌ చేసుకునే ఆన్‌లైన్‌ వేదికల్లో ధరలు పరిశీలించిన ఎం.కే.సిన్హా పండుగ సమయంలో రాష్ట్రవ్యాప్తంగా ఎంవీఐలను రోడ్డెక్కించి విస్తృతంగా తనిఖీలు చేయించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో అత్యధికంగా నెల్లూరు జిల్లాలో 87 బస్సులపై కేసులు నమోదు చేసి, రూ.8.31 లక్షల ఫైన్‌ వేశారు. అంబేడ్కర్‌ కోనసీమలో 78, పశ్చిమ గోదావరిలో 65, విశాఖపట్నంలో 54, అన్నమయ్యలో 41, చిత్తూరులో 35, గుంటూరులో 27, తూర్పు గోదావరిలో 27 కేసులు నమోదు చేసి, జరిమానా వసూలు చేశారు.


యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన

కొన్ని ప్రైవేటు ట్రావెల్స్‌ ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొట్టినట్లు అధికారులు తేల్చారు. అధిక ప్రయాణ చార్జీలు వసూలు చేస్తున్న బస్సులపై కొరడా ఝుళిపించిన రవాణా శాఖ అధికారులు.. ఈ క్రమంలో ఇతర నిబంధనల ఉల్లంఘనలను సైతం గుర్తించారు. అందులో పన్ను ఎగవేత, పర్మిట్‌ లేని, ఫిట్‌నెస్‌ చేసుకోని బస్సులతో పాటు ఇతర ఉల్లంఘనలను పసిగట్టారు. పది రోజుల్లో ఏకంగా 1,348 బస్సులపై కేసులు నమోదు చేసి, రూ.71.29 లక్షల జరిమానా వసూలు చేశారు. ఇందులోనూ నెల్లూరు జిల్లా 94 కేసులు, రూ.12.34 లక్షల జరిమానాతో మొదటి స్థానంలో ఉండగా.. గుంటూరు జిల్లాలో 122 కేసుల్లో రూ.5.04 లక్షలు, పల్నాడు 104 కేసుల్లో రూ.4.62 లక్షలు, ఎన్టీఆర్‌ జిల్లా 129 కేసుల్లో రూ.4.51 లక్షల జరిమానా విధించినట్లు ఎం.కే.సిన్హా వెల్లడించారు.

కఠిన చర్యలు తప్పవు..: కమిషనర్‌

రాష్ట్రంలో ప్రయాణికులను గమ్యం చేర్చే ప్రైవేటు ట్రావెల్స్‌ తమ వ్యాపారాన్ని నిరభ్యంతరంగా చేసుకోవచ్చని, ప్రభుత్వం అనుమతించిన చార్జీలు వసూలు చేసుకొంటే.. రవాణా శాఖ పూర్తిగా మద్దతిస్తుందని కమిషనర్‌ ఎం.కే.సిన్హా పేర్కొన్నారు. అలా కాకుండా నిబంధనలు ఉల్లంఘిస్తాం.. అధిక చార్జీలు వసూలు చేస్తాం.. పన్నులు ఎగవేస్తాం.. అంటే అంగీకరించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

Updated Date - Jan 20 , 2026 | 04:09 AM