Share News

బీసీ రిజర్వేషన్ల ఖరారుకు పారదర్శక విధానం

ABN , Publish Date - May 13 , 2026 | 04:46 AM

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లను ఖరారు విషయంలో పారదర్శక విధానాన్ని అవలంబిస్తామని డెడికేటెడ్‌ కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా తెలిపారు.

బీసీ రిజర్వేషన్ల ఖరారుకు పారదర్శక విధానం

  • డెడికేటెడ్‌ కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా వెల్లడి

అనంతపురం కలెక్టరేట్‌, మే 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు బీసీ రిజర్వేషన్లను ఖరారు విషయంలో పారదర్శక విధానాన్ని అవలంబిస్తామని డెడికేటెడ్‌ కమిషన్‌ చైర్మన్‌ రాజీవ్‌ రంజన్‌ మిశ్రా తెలిపారు. మంగళవారం అనంతపురం జిల్లా కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం బీసీ సంఘాలు, ప్రజా సంఘాల ప్రతినిధుల నుంచి వినతిపత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వెనుకబడిన తరగతులకు కేటాయించాల్సిన రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించడం కోసం జిల్లాల పర్యటన చేపట్టామన్నారు. క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉన్న జనాభా గణాంకాలు, గత ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం, ప్రస్తుత పరిస్థితులపై సమగ్ర సమాచారాన్ని సేకరిస్తున్నామని తెలిపారు. షెడ్యూల్డ్‌ కులాలు, షెడ్యూల్డ్‌ తెగల జనాభా లెక్కలు స్పష్టంగా ఉన్నాయని, వెనుకబడిన తరగతుల విషయంలో క్షేత్రస్థాయి గణాంకాలు, వారి సామాజిక స్థితిగతులపై స్పష్టత అవసరమని పేర్కొన్నారు. రిజర్వేషన్ల ప్రక్రియలో ప్రజలు, బీసీ సంఘాలు, వివిధ రాజకీయ పక్షాల అభిప్రాయాలు అత్యంత కీలకమన్నారు.

Updated Date - May 13 , 2026 | 04:46 AM