Share News

యాచించిన చేతికి గౌరవప్రదమైన కొలువు

ABN , Publish Date - Apr 27 , 2026 | 05:35 AM

వివక్ష గోడల మధ్య నలిగిపోయిన ట్రాన్స్‌జెండర్‌ జీవితంలో అరుదైన.. ఊహించని మార్పు ఇది. బీకాం వరకు చదివినా ఉద్యోగం లభించక.. యాచిస్తూ జీవనం సాగిస్తున్న నక్కా వర్షిణి...

యాచించిన చేతికి గౌరవప్రదమైన కొలువు

  • ఎమ్మెల్యే మాధవి చేయూతతో మలుపు తిరిగిన ట్రాన్స్‌జెండర్‌ జీవితం

గుంటూరు, ఏప్రిల్‌ 26(ఆంధ్రజ్యోతి): వివక్ష గోడల మధ్య నలిగిపోయిన ట్రాన్స్‌జెండర్‌ జీవితంలో అరుదైన.. ఊహించని మార్పు ఇది. బీకాం వరకు చదివినా ఉద్యోగం లభించక.. యాచిస్తూ జీవనం సాగిస్తున్న నక్కా వర్షిణి (జీవన్‌ కుమార్‌) అనే ట్రాన్స్‌జెండర్‌కు స్థానిక ఎమ్మెల్యే మాధవి చేయూత అందించి తన కార్యాలయంలో పర్సనల్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇచ్చారు.

ఆ ఫంక్షన్‌ కు హాజరే ఆమె జీవితంలో మలుపు

ఇటీవల గుంటూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఓ ఘటన చోటుచేసుకుంది. కొంతమంది ట్రాన్స్‌జెండర్లు యాచన కోసం వచ్చారు. వారిలో వర్షిణిని గమనించిన ఎమ్మెల్యే మాధవి ఆమెతో మాట్లాడారు. ఏం చదివావు? అని అడిగితే, బీకామ్‌ అని సమాధానమిచ్చింది. ఏదైనా పని చేసుకోవచ్చు కదా! యాచించడం ఎందుకు? అని ఎమ్మెల్యే ప్రశ్నించగా వర్షిణి భావోద్వేగంతో ‘మాకు ఉద్యోగం ఎవరు ఇస్తారు మేడమ్‌... అందుకే ఇలా అడుక్కోవాల్సి వస్తోంది’’ అని సమాధానం ఇచ్చింది. ‘నేను ఉద్యోగం ఇస్తాను. జీతం 15 వేలు. అని ఎమ్మెల్యే చెప్పగా... మేము యాచిస్తేనే నెలకు 30 వేల వర కూ వస్తుంది మేడమ్‌’’ అని చెప్పిందట. దీంతో స్పందించిన ఎమ్మెల్యే.. ‘‘సరే... 25 వేల జీతంతో పని చేస్తావా?’’ అని అడగ్గా.. వర్షిణి వెంటనే అంగీకరించింది.

20 రోజుల్లోనే మారిన జీవితం

ఇచ్చిన మాట ప్రకారం ఎమ్మెల్యే.. వర్షిణిని తన కార్యాలయంలో పీఏగా నియమించుకున్నారు. ఆమె విధుల్లో చేరి సుమారు 20 రోజులు అయ్యింది. యాచన జీవితాన్ని విడిచి గౌరవప్రదమైన ఉపాధిలో అడుగుపెట్టిన వర్షిణి ఇప్పుడు కొత్త జీవితం ప్రారంభించింది.


చదువు ఉన్నా... అవకాశాలు లేవు

గుంటూరు నగరంలో సాధారణ కుటుంబంలో జన్మించిన వర్షిణి కష్టపడి బీకామ్‌ పూర్తి చేసింది.కుటుంబం నుంచి అంగీకారం లేకపోవడం, సమాజంలో అవమానాలు, ఉద్యోగాల్లో తిరస్కారం .. ఇలా సమస్యలు ఎదుర్కొని.. చివరకు జీవనోపాధి కోసం యాచనను నమ్ముకుంది. మరికొంతమంది ట్రాన్స్‌జెండర్లతో కలిసి అద్దె ఇంట్లో నివాసం ఉంది.

దయ కాదు... హక్కు అనే సందేశం

‘చదువుకున్న ప్రతి ఒక్కరికీ గౌరవప్రద జీవనం హక్కుగా లభించాలి. ట్రాన్స్‌జెండర్‌ అని చెప్పి.. అవకాశాలను దూరం చేయడం సరికాదు’ అనే సందేశాన్ని ఎమ్మెల్యే మాధవి తన చర్యతో స్పష్టం చేశారు. ఇది సమాజానికి బలమైన సంకేతమని పలువురు అభిప్రాయపడుతున్నారు. ట్రాన్స్‌జెండర్లను దయతో కాకుండా, తోటి మనిషిగా, సమాన హక్కులతో చూడాల్సిన అవసరాన్ని ఈ ఘటన గుర్తుచేసింది.

Updated Date - Apr 27 , 2026 | 05:36 AM