Share News

రాజధానితో ‘చెడుగుడు’..!

ABN , Publish Date - Mar 21 , 2026 | 05:00 AM

వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని ప్రాజెక్టు పనులు దాదాపు ఐదేళ్లపాటు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా రాజధాని అమరావతి అభివృద్ధి ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కింది.

రాజధానితో ‘చెడుగుడు’..!

  • సీఆర్‌డీఏ కమిషనర్‌ కన్నబాబు బదిలీ

  • రాజధాని పనులు కీలక దశలో ఉండగా బంతాట

  • భూసమస్యల పరిష్కారంలో సీఆర్‌డీఏ కీలక పాత్ర

  • కొత్త కమిషనర్‌ వచ్చి.. వీటి గురించి తెలుసుకుని ఒక్కో చిక్కుముడి విప్పేది ఎన్నడు..?

  • కీలక సమయంలో చెడుగుడు తగదంటున్న రాజధాని రైతులు

(విజయవాడ-ఆంధ్రజ్యోతి)

వైసీపీ ప్రభుత్వ హయాంలో అమరావతి రాజధాని ప్రాజెక్టు పనులు దాదాపు ఐదేళ్లపాటు నిలిచిపోయాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజా రాజధాని అమరావతి అభివృద్ధి ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కింది. ప్రస్తుతం శరవేగంగా సాగుతున్న రాజధాని పనులు చాలా కీలక దశలో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో ఏపీ సీఆర్‌డీఏ కమిషర్‌గా ఉన్న కె.కన్నబాబును బదిలీ చేయడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే రాజధానిలో అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన సంస్థల మధ్య ఆధిపత్య పోరు మూడు ముక్కలాటలా తయారైంది. ఇది రాజధాని పనులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఇలాంటి దశలో సీఆర్‌డీఏ కమిషనర్‌ కన్నబాబును బదిలీ చేయడంతో గ్రూపుల ఆధిపత్యం రాజ్యమేలుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ సంస్థల మధ్య పోరుపై ఇటీవలే ‘ఆంధ్రజ్యోతి’లో ‘కోల్డ్‌వార్‌’ శీర్షికతో ప్రత్యేక కథనం ప్రచురితమైంది. ఈ కోల్డ్‌వార్‌ ప్రభావం ఇటీవల సీఆర్‌డీఏపైనా పడింది. దీంతో సీఆర్‌డీఏ పర్యవేక్షణలో ఉన్న చాలా పనులు, అధికారాలను ఏడీసీఎల్‌, ఏజీఐసీఎల్‌కు బదలాయించారు. ప్రస్తుతం సీఆర్‌డీఏ దగ్గర ల్యాండ్‌, ప్లానింగ్‌ విఽభాగాలు మాత్రమే ఉన్నాయి. ఒకప్పుడు రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థగా కీలకంగా ఉన్న సీఆర్‌డీఏ పరిధి క్రమేణా తగ్గిపోయింది. గ్రూపుల పోరు కారణంగానే.. ఈ పరిస్థితి తలెత్తిందన్న విమర్శలు ఉన్నాయి. రాజధానిలో రైతుల సమస్యలు పరిష్కరించే బాధ్యత సీఆర్‌డీఏపై ఉంది. గతంలో అధికారులు చేసిన తప్పుల కారణంగా రాజధాని రైతులు ప్రస్తుతం అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. రాజధాని గ్రామాల్లో అమలుచేసిన భూసమీకరణ మినహాయింపు వ్యవహారం ప్రస్తుతం అతి పెద్దసమస్యగా మారింది. ఈ సమస్యలను సీఆర్‌డీఏ అధికారులు పరిష్కరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో సీఆర్‌డీఏ కమిషనర్‌ను బదిలీ చేయడం విమర్శలకు తావిస్తోంది. కన్నబాబు స్థానంలో కొత్తగా వచ్చే కమిషనర్‌ వీటిని అర్ధం చేసుకోవడానికిచాలా సమయం పట్టే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలో రాజధాని రైతుల్లో అసహనం నెలకొనే ప్రమాదం ఉంది.


అదే అతిపెద్ద సమస్య

రాజధానిలో భూసేకరణ పరిధి విషయంలో ఒక్కో గ్రామానికి ఒక్కో రకంగా మినహాయింపు ఇచ్చారు. ఉదాహరణకు నెక్కల్లులో 6 ఎకరాలకు మాత్రమే మినహాయింపు ఇచ్చారు. మందడంలో 62 ఎకరాలను మినహాయించారు. మిగిలిన గ్రామాల విషయానికి వస్తే తుళ్లూరుకు 55 ఎకరాలు, రాయపూడికి 40.8 ఎకరాల వరకు మినహాయింపు ఇచ్చారు. లింగాయపాలెంలో 7.13 ఎకరాలు, నేలపాడులో 14 ఎకరాలు, వెంకటపాలెంలో 21 ఎకరాలు, అనంతవరంలో 40 ఎకరాలు, వెలగపూడిలో 26 ఎకరాల చొప్పున మినహాయింపు ఇచ్చారు. అన్ని గ్రామాలకు సమాన ప్రాతిపదికన మినహాయింపులు లేకపోవడం వల్ల.. ఈ గందరగోళాన్ని పరిష్కరించాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది తీర్చలేని సమస్యగా తయారైంది. అయితే ఈ అంశాలపై రైతులు న్యాయస్థానాలను ఆశ్రయించకుండా సీఆర్‌డీఏ అధికారులు సంయమనంతో వ్యవహరిస్తున్నారు. కొద్ది కాలంగా ఈ తప్పు సరిదిద్దటానికి సీఆర్‌డీఏ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పుడు కొత్త కమిషనర్‌ వస్తే.. ఈ సమస్య గురించి తెలుసుకోవడానికే చాలాకాలం పడుతుంది. పనులు వేగంగా సాగుతున్న సమయంలో... రైతుల సమస్యలను పరిష్కరించాల్సిన కీలక తరుణంలో.. ఆధిపత్య పోరు కారణంగా సీఆర్‌డీఏ కమిషనర్‌ను బదిలీ చేసి చెడుగుడు ఆడుతున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 21 , 2026 | 05:02 AM