Share News

‘అస్మదీయ’ ఆరాటం!

ABN , Publish Date - Mar 17 , 2026 | 05:06 AM

సబ్‌స్టేషన్లలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామక ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ట్రాన్స్‌కో టెండర్లు ఆహ్వానించింది.

‘అస్మదీయ’ ఆరాటం!

  • ట్రాన్స్‌కో మ్యాన్‌పవర్‌ ఏజెన్సీల నియామక

  • టెండర్లలో అడ్డగోలుగా నిబంధనల మార్పు

  • తొలుత పాత విధానంలో టెండర్లు ఆహ్వానం

  • నాలుగు రోజులకే రూల్స్‌ మార్చేస్తూ సవరణ

  • వైసీపీ నేతల సంస్థలకు కాంట్రాక్టు కట్టబెట్టేందుకే!

  • కీలకంగా వ్యవహరించిన ఓ ట్రాన్స్‌కో డైరెక్టర్‌

  • సమగ్ర విచారణకు కార్పొరేషన్‌ సీఎండీ ఆదేశం

అమరావతి, మార్చి 16(ఆంధ్రజ్యోతి): సబ్‌స్టేషన్లలో ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామక ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ట్రాన్స్‌కో టెండర్లు ఆహ్వానించింది. నిబంధనలు తమకు కావాల్సిన వారికి అనుగుణంగా లేవని, సవరణ చేసి తమకు అనుకూలమైన రూల్స్‌ను ఆ టెండరులో చేర్చారు. ఈ మొత్తం వ్యవహారంలో ట్రాన్స్‌కోలో కీలక బాధ్యతల్లో ఉన్న డైరెక్టర్‌ ఒకరు మంత్రి పేషీ పేరుతో చక్రం తిప్పినట్లు సమాచారం. వైసీపీ నాయకుల సంస్థలకు టెండర్లను కట్టబెట్టేలా కీలక పాత్ర పోషిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ట్రాన్స్‌కో సీఎండీ సమగ్ర విచారణకు ఆదేశించారు.

నిబంధనలు ఇలా మార్చేశారు..

విజయవాడ, కడప, వైజాగ్‌ జోన్లలో 132, 220, 400 కేవీ సబ్‌స్టేషన్ల పరిధిలో ఆపరేషన్‌, మెయింటెనెన్సు పనుల నిర్వహణ నిమిత్తం ఔట్‌సోర్సింగ్‌ సిబ్బంది నియామకం కోసం మ్యాన్‌పవర్‌ ఏజెన్సీలను ఎంపిక చేసేందుకు ఈ నెలలో రూ.12 కోట్ల విలువైన టెండర్లను పిలిచారు. మూడేళ్ల కాలానికి తొలుత పిలిచిన టెండరులో అర్హత సాధించిన బిడ్డర్‌కు గరిష్ఠంగా 2 పనులు మాత్రమే ఇవ్వాలని పేర్కొన్నారు. కాంట్రాక్టులో పాల్గొనేందుకు.. విద్యుత్తు రంగంలో ఓఅండ్‌ఎం లేదా నిర్మాణ రంగంలో కనీసం 2 ఏళ్ల అనుభవం ఉన్న వారే అర్హులని, కాంట్రాక్టు విలువలో 50 శాతం టర్నోవర్‌ కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఇద్దరు బిడ్డర్లు ఒకే ధర కోట్‌ చేస్తే, లాటరీ విధానంలో తుది బిడ్డర్‌ను ఎంపిక చేస్తామని నిబంధనల్లో చేర్చారు.


అయితే 4 రోజులకే టెండరును సవరిస్తూ, నిబంధనలన్నింటినీ మార్చేస్తూ అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. అర్హులైన బిడ్డర్‌కు గరిష్టంగా నాలుగు పనులు ఇవ్వొచ్చని మార్పు చేశారు. ఇద్దరు బిడ్డర్లు ఒకే ధర కోట్‌ చేస్తే, లాటరీ విధానం కాకుండా మార్కుల విధానాన్ని ప్రవేశ పెట్టారు. మొత్తం 100 మార్కుల్లో 20 మార్కులు స్థానిక బిడ్డర్లకు, 40 మార్కులు జోనల్‌ కమిటీ ఇచ్చే అసె్‌సమెంట్‌కి, గత అనుభవానికి 20 మార్కులు, మరో 20 మార్కులు ఫైనాన్షియల్‌ టర్నోవర్‌కు కేటాయించారు. అయిన వారికి లాభం చేకూర్చేందుకే నిబంధనలు మార్చేశారని పలువురు కాంట్రాక్టర్లు ఆరోపిస్తున్నారు.


ఆయనే సూత్రధారి.. గతంలోనూ ఇలానే..!

టెండర్‌ నిబంధనలను ఇష్టారాజ్యంగా మార్చేయడం వెనుక ఓ ట్రాన్స్‌కో డైరెక్టర్‌ ప్రధాన సూత్రధారి కావడం గమనార్హం. వైసీపీ హయాంలో డైరెక్టరుగా బాధ్యతలు చేపట్టిన ఈయన.. కూటమి ప్రభుత్వంలోనూ కొనసాగుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే పదవీకాలం పూర్తయినా.. మరో ఏడాది కొనసాగింపునకు ఉన్నతాధికారులు సిద్ధమవుతున్నారు. గతంలోనూ ఓపీజీడబ్ల్యూ (ఆప్టికల్‌ గ్రౌండ్‌ వైర్‌) టెండరులో సదరు డైరెక్టరు ఉద్దేశపూర్వకంగా టెండర్లను రద్దు చేశారు. తొలుత ఓపీజీడబ్ల్యూ టెండరును రూ.84.95 కోట్లతో పిలిచారు. తర్వాత రద్దు చేసి రూ.101 కోట్లకు రీటెండరు పిలిచారు. ఈ ఏడాది కండక్టర్ల టెండర్లలోనూ ఒక్కో ఊరికి ఒక్కో రేటు నిర్ణయించడంలోనూ ఈయనే ప్రధాన పాత్రధారి. వీటన్నింటినీ ‘ఆంధ్రజ్యోతి’ వెలుగులోకి తీసుకురావడంతో ఉన్నతాధికారులు ఆ టెండర్లను రద్దు చేశారు.

కోర్టుకెళ్లిన కాంట్రాక్టర్లు..

మ్యాన్‌ పవర్‌ ఏజెన్సీ టెండర్‌ నిబంధనలను అడ్డగోలుగా మార్చేయడంపై కొందరు కాంట్రాక్టర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీంతో నిబంధనల మార్పు సరికాదన్న కోర్టు.. టెండరు ప్రక్రియను కొనసాగిస్తూనే ఏప్రిల్‌ 6న తుది తీర్పు వెలువరించే వరకు టెండర్లను తెరవవద్దని ఆదేశించింది. ఈ వ్యవహారంపై ట్రాన్స్‌కో సీఎండీ కె.విజయానంద్‌, జేఎం డీ సాయి సూర్య ప్రవీణ్‌ చంద్‌ జోక్యం చేసుకున్నారు. నిబంధనల మార్పుపై విచారణకు ఆదేశించడంతోపాటు కోర్టు తీర్పుకు అనుగుణంగా తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. ఇకపై మ్యాన్‌పవర్‌ ఏజెన్సీ టెండర్లను పాత విధానంలోనే కొనసాగించాలని కూడా ఆదేశాలు జారీ చేశారు.

Updated Date - Mar 17 , 2026 | 05:06 AM