ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా
ABN , Publish Date - Apr 10 , 2026 | 04:28 AM
సరదాగా జలపాతం చూడ్డాని కి వెళ్లిన ముగ్గురు గిరిజన బాలికలు ప్రమాదవశాత్తూ నీటి గుమ్మిలో జారిపడి మృత్యువాతపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట...
జలపాతం వద్ద నీటి గుమ్మిలో జారిపడి ముగ్గురు గిరిజన బాలికల దుర్మరణం
అల్లూరి జిల్లా జంబువలసలో పెను విషాదం
అనంతగిరి/హుకుంపేట, ఏప్రిల్ 9 (ఆంధ్రజ్యోతి): సరదాగా జలపాతం చూడ్డాని కి వెళ్లిన ముగ్గురు గిరిజన బాలికలు ప్రమాదవశాత్తూ నీటి గుమ్మిలో జారిపడి మృత్యువాతపడ్డారు. అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట, అనంతగిరి మండలాల సరిహద్దులోని దండేసిగుడ (మల్లుంగుమ్మి) జలపాతం వద్ద ఈ విషాదం చోటుచేసు కుంది. హుకుంపేట పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. బూర్జ పంచాయతీ జంబువలసకు చెందిన విద్యార్థినులు సలేపు త్రిష (17), సలేపు రత్నకుమారి (16), సలేపు పవిత్ర (16), సలేపు అంజలి గురువారం మధ్యాహ్నం గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో గల దండేసిగుడ జలపాతం వద్దకు వెళ్లారు. అక్కడ సరదాగా గడిపి సెల్ఫీలు, ఫొటోలు దిగారు. అదే క్రమంలో జలపాతం దిగువన ఉన్న రాయిపై నిల్చొని సెల్ఫీ దిగుతున్న సమయంలో ప్రమాదవశాత్తూ నలుగురూ నీటి గుమ్మిలో పడిపోయారు. త్రిష, రత్నకుమారి, పవిత్ర లోతైన ప్రదేశంలో మునిగిపోయి, బయటికి రాలేకపోయారు. అంజలి కేకలు వేయడంతో సమీపంలోనే ఉన్న గిరిజనులు పరుగున వచ్చి రక్షించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉంది. త్రిష ఇంటర్మీడియట్ చదువుతుండగా, రత్నకుమారి, పవిత్ర చదువు మధ్యలోని ఆపేశారని తెలిసింది. ముగ్గురి మృతదేహాలనూ నీటిలో నుంచి బయటికి తీశారు.