Share News

కాటేసిన విధి!

ABN , Publish Date - Jan 21 , 2026 | 03:43 AM

చావుబతుకుల్లో ఉన్న తల్లిని చికిత్స కోసం వైద్యశాలకు తరలిస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కొడుకు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో మృతి చెందాడు..

కాటేసిన విధి!

  • తల్లిని ఆస్పత్రికి తీసుకువెళుతుండగా కొడుకుకు ప్రమాదం

  • ఆరోగ్యం విషమించి తల్లి, కోమాలోకి వెళ్లి కుమారుడు మృతి

  • ప్రకాశం జిల్లా కందుకూరులో ఘటన

కందుకూరు, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): చావుబతుకుల్లో ఉన్న తల్లిని చికిత్స కోసం వైద్యశాలకు తరలిస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో కొడుకు తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో మృతి చెందాడు. ఆరోగ్యం విషమించి ఆస్పత్రికి చేరేలోగానే ఆ తల్లి కూడా చనిపోయింది. ఈ విషాద ఘటన ప్రకాశం జిల్లా కందుకూరులో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకొంది. వివరాలు.. కందుకూరు పట్టణ పోలీసుస్టేషన్‌లో షాజిద్‌ (38) కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారు. సోమవారం రాత్రి విధుల్లో ఉండగా..తల్లి (70) పరిస్థితి విషమంగా ఉందని ఫోన్‌ రావడంతో హుటాహుటిన ఇంటికి వచ్చారు. అంబులెన్స్‌లో పట్టణంలోని ఓ ప్రైవేటు వైద్యశాలకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ముందు అంబులెన్స్‌ వెళ్తుండగా వెనుక మోటారుసైకిల్‌పై షాజిద్‌ వెళుతున్నారు. వైద్యశాల సమీపంలో ఎదురుగా వస్తు న్న మరో మోటారుసైకిల్‌ ఢీకొట్టడంతో కిందపడిన ఆయన తీవ్ర గాయాలపాలై కోమాలోకి వెళ్లిపోయారు. ఈలోగా అంబులెన్స్‌ హాస్పిటల్‌కు చేరగా షాజిద్‌ తల్లిని పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్టు ప్రకటించారు. షాజిద్‌ను ఒంగోలు తరలించగా అక్కడ ఓ ప్రైవేటు వైద్యశాలలో చికిత్సపొందుతూ మంగళవారం రాత్రి మృతిచెందారు. ఆయనకు భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు.

Updated Date - Jan 21 , 2026 | 04:46 AM