Share News

Nellore: పండక్కి వచ్చి తిరిగిరాని లోకాలకు..

ABN , Publish Date - Jan 17 , 2026 | 04:06 AM

పండక్కని వచ్చిన అన్నాచెల్లెలు తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి తీరంలో శుక్రవారం చోటు చేసుకుంది.

Nellore: పండక్కి వచ్చి తిరిగిరాని లోకాలకు..

  • సముద్రంలో మునిగి ఇద్దరి దుర్మరణం

  • మరో ఇద్దరు గల్లంతు, ఆచూకీ కోసం గాలింపు

  • మృతిలోనూ వీడని అన్నాచెల్లెళ్ల బంధం

  • కళ్ల ముందే తోబుట్టువుల మృతితో మిన్నంటిన అన్న రోదన

  • కనుమ రోజు నెల్లూరు జిల్లాలో విషాదం

అల్లూరు, జనవరి 16 (ఆంధ్రజ్యోతి): పండక్కని వచ్చిన అన్నాచెల్లెలు తిరిగిరాని లోకాలకు చేరుకున్నారు. ఈ ఘటన నెల్లూరు జిల్లా అల్లూరు మండలం ఇస్కపల్లి తీరంలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. బుచ్చికి చెందిన ఈగ చిన్నబ్బయ్య, ఈగ అమ్ములు, ఈగ బాలకృష్ణ అనాథలు. వీరిలో చిన్నబ్బయ్య చిట్టేడులో గురుకుల పాఠశాలలో ఇంటర్‌ చదువుతున్నాడు. బాలకృష్ణ (15), అమ్ములు (14) అల్లూరు మండలం నార్తుఆములూరు గొల్లపాలెంలో పదోతరగతి, తొమ్మిదో తరగతి చదువుతున్నారు. గత మంగళవారం అల్లూరు పేటలో నిర్వహించిన పోలేరమ్మ తిరునాళ్లకు వెళ్లి అనంతరం పండక్కి అల్లూరు మజరా గ్రామమైన ఎర్రపుగుంటలోని వదిన ఇంటికి వచ్చారు. రెండ్రోజులు ఉత్సాహంగా పండుగ జరుపుకొన్నారు. ఇస్కపల్లి పంచాయతీ ఆదిరాఘవపురం ఎన్‌టీఆర్‌ కాలనీకి చెందిన వీరి స్నేహితులు కొమరగిరి అభిషేక్‌ (16), చేజర్లలో గురుకుల పాఠశాలలో ఇంటర్‌ చదువుతున్న గంధళ్ల సుధీర్‌(15)తో పాటు బాలాయపల్లి మండలం పాకపురికి చెందిన బీఎస్సీ నర్సింగ్‌ చదువుతున్న సిరిసినంబేటి వెంకటేశ్వర్లు అక్కడికి చేరుకున్నారు. అందరూ కలిసి శుక్రవారం మధ్యాహ్నం ఇస్కపల్లి సముద్ర తీరానికి వెళ్లారు. స్నానం చేసేందుకు మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో సముద్రంలోకి దిగారు. అమ్ములు, బాలకృష్ణ, అభిషేక్‌, సుధీర్‌ ఓవైపు వెళ్లగా, మిగిలిన ఇద్దరూ మరోవైపు వెళ్లారు. లోపల గుంతలు ఉన్న విషయం తెలియని ఆ నలుగురు ఒకరి తరువాత మరొకరు నీటిలో మునిగి పోయారు.


ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో వీరిని గమనించలేదు. ఎక్కడా వారు కనపడకపోయేసరికి చిన్నబ్బయ్య, వెంకటేశ్వర్లు గట్టిగా కేకలు వేస్తూ బయటికి పరుగులు తీశారు. స్థానిక మత్స్యకారులకు విషయం తెలియజేయగా, వారు సముద్రంలో దిగి గాలింపు చేపట్టారు. అమ్ములు మృతదేహం కాసేపటికి ఒడ్డుకు కొట్టుకురాగా, బాలకృష్ణ మృతదేహాన్ని మత్స్యకారులు గుర్తించారు. సమాచారం తెలుసుకున్న కావలి డీఎస్పీ శ్రీధర్‌, సీఐ పాపారావు, ఎస్‌ఐ శ్రీనివాసులు రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షించారు. స్థానిక మత్స్యకారుల సహకారంతో గాలింపు ముమ్మరం చేశారు. అయినా మరో ఇరువురి ఆచూకీ లభ్యం కాలేదు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం అల్లూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


అయ్యో.. పాపం!

తోబుట్టువుల మృతిని జీర్ణించుకోలేక చిన్నబ్బయ్య రోదించిన తీరు స్థానికులను కలచివేసింది. వీరంతా గతంలో నార్తుఆములూరు గొల్లపాలెంలోని చైల్డ్‌ ఆశ్రమంలో విద్యనభ్యసించారు. వీరిలో చిన్నబ్బయ్య, అభిషేక్‌, సుధీర్‌, వెంకటేశ్వర్లు ఒకేచోట చదువుకోవడంతో స్నేహితులయ్యారు. పండుగ సెలవులకు వచ్చి మృత్యువాత పడటం స్థానికులను కలచి వేసింది. కాగా.. మెరైన్‌ పోలీసుల నిర్లక్ష వైఖరి వల్లే ఈ దారుణం జరిగిందని స్థానిక మత్స్యకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. గల్లంతైన వారి ఆచూకీ కోసం మెరైన్‌ బోట్లతో రాత్రి కూడా సైతం గాలిస్తామని కావలి ఆర్డీవో సన్నీ వంశీకృష్ణ తెలిపారు.

Updated Date - Jan 17 , 2026 | 04:18 AM