ఒకే కుటుంబంలో ఐదుగురి విషాదాంతం
ABN , Publish Date - Apr 23 , 2026 | 03:55 AM
ఓ పెద్దావిడ.. ఆమె కొడుకు, కోడలు.. వారి ఇద్దరు పిల్లలు.. ఎంతో అన్యోన్యమైన కుటుంబం! ఏం జరిగిందో ఏమో.. ఇంట్లో చెరో గదిలో అత్తా, కోడలు అనుమానాస్పద స్థితిలో మరణించగా..
ఇంట్లో అత్తా కోడలు అనుమానాస్పద మృతి..
కొడుకు, మనవడు, మనవరాలు రైలు పట్టాలపై ఆత్మహత్య
తిరుపతి జిల్లా వెంకటకృష్ణపాలెంలో ఘోరం
తిరుపతి/నారాయణవనం, ఏప్రిల్ 22(ఆంద్రజ్యోతి): ఓ పెద్దావిడ.. ఆమె కొడుకు, కోడలు.. వారి ఇద్దరు పిల్లలు.. ఎంతో అన్యోన్యమైన కుటుంబం! ఏం జరిగిందో ఏమో.. ఇంట్లో చెరో గదిలో అత్తా, కోడలు అనుమానాస్పద స్థితిలో మరణించగా.. కొడుకు, మనవడు, మనవరాలు రైలు పట్టాలపై విగత జీవులుగా కనిపించారు. తిరుపతి జిల్లా నారాయణవనం మండలం వెంకటకృష్ణపాలెంలో బుధవారం ఈ ఘోరం చోటుచేసుకుంది. ఒకే కుటుంబంలో ఐదుగురి అనుమానాస్పద మృతి గ్రామస్థులను కలచివేసింది. ఈ మరణాలకు కారణాలు అంతుబట్టడం లేదని గ్రామస్థులు, బంధువులు చెబుతున్నారు. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు.. వెంకటకృష్ణపాలెం గ్రామానికి చెందిన మోహన్ నారాయణవనం మండల కేంద్రంలో సిమెంట్ షాపు నిర్వహిస్తుండగా, అతడి భార్య హరిత అక్కడే బ్యూటీ పార్లర్, టైలరింగ్ షాపు నడుపుతోంది. తల్లి చంద్రకళ, కుమారుడు కౌశిక్, కూతురు హిమానీలతో కలసి ఈ దంపతులు వెంకటకృష్ణపాలెంలో నివాసముంటున్నారు. కౌశిక్ 9వ తరగతి, హిమాని 7వ తరగతి చదువుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మధ్యాహ్నం సుమారు 1.30 గంటల సమయంలో మోహన్ సమీప బంధువు వెంకటకృష్ణపాలెంలోని ఇంటికి వెళ్లగా ఇంట్లో మోహన్ తల్లి చంద్రకళ(60), భార్య హరిత(35) వేర్వేరు గదుల్లో విగతజీవులై కనిపించారు. హరితను చున్నీతో మెడ బిగించి హతమార్చినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. వీరిద్దరి మృతదేహాలు వెలుగుచూసిన నేపథ్యంలో గ్రామస్థులు, బంధువులు, పోలీసులు.. మోహన్, పిల్లల ఆచూకీ కోసం గాలించారు. చివరికి రాత్రి సుమారు 8 గంటల సమయంలో అక్కడికి సమీపంలోని పుత్తూరు మండలం వేపగుంట వద్ద రైలు పట్టాలపై మోహన్(40), కొడుకు కౌశిక్(14), కుమార్తె హిమానీ(12)ల మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మోహన్ కుటుంబ సభ్యులంతా చాలా అన్యోన్యంగా వుంటారని, స్వగ్రామంలోనూ, నారాయణవనంలోనూ అందరితో చాలా మర్యాదగా మెలుగుతారని గ్రామస్థులు, బంధువులు చెబుతున్నారు. హరిత, చంద్రకళ హత్యకు గురయ్యారా? అదే జరిగి వుంటే ఎవరు హత్య చేశారు? మోహనే చంపి ఉంటే కారణాలేమిటి? పిల్లలతో కలసి తనూ ఆత్మహత్యకు ఎందుకు పాల్పడ్డాడు? వంటి ప్రశ్నలకు సమాధానాలు అంతుచిక్కడం లేదు.