Share News

పేలిన ప్రాణాలు

ABN , Publish Date - Mar 01 , 2026 | 04:44 AM

అది... కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం శివారు! గోదావరి కాలువ అవతల పచ్చని పొలాల మధ్య... సూర్యశ్రీ ఫైర్‌ వర్క్‌! శనివారం మధ్యాహ్నం 2.10 గంటలు! శుభకార్యాలు, జాతర్ల కోసం భారీగా బాణసంచా...

పేలిన ప్రాణాలు

  • ‘గోదావరి జిల్లా’లో మరో బాణసంచా విషాదం

  • 21మంది బుగ్గి

  • 10 మందికి గాయాలు

  • కాకినాడ జిల్లా వేట్లపాలెంలో భారీ విస్ఫోటం

  • శివారు పొలాల మధ్య సూర్యశ్రీ ఫైర్‌ వర్క్స్‌

  • సింగారమ్మ జాతర కోసం భారీగా ఆర్డర్‌

  • తయారీ పనిలో నిమగ్నమైన కార్మికులు

  • చిచ్చుబుడ్లలో మందు కూరుతుండగా నిప్పు

  • నారబాంబులకు అంటుకొని వరుస పేలుళ్లు

  • 8 కిలోమీటర్ల వరకూ వినిపించిన శబ్దం

  • అర కిలోమీటరు ఎగిరి పడిన మృతదేహాలు

  • గుర్తుపట్టలేనంతగా కాలి, ముక్కలైన శరీరాలు

పచ్చని పొలాల మధ్య విస్ఫోటాల చిచ్చు రేగింది. వేడుకల్లో వెలుగులు పంచే బాణసంచా... మరోసారి ప్రాణాలను పేల్చేసింది. గత దీపావళి ముందు జరిగిన ఘోరం మరువక ముందే... ‘గోదావరి జిల్లా’లో మరో పెను విషాదం చోటు చేసుకుంది. నిర్లక్ష్యపు నిప్పు రాజుకుంది. కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెంలోని బాణసంచా తయారీ కేంద్రంలో మరణ మృదంగం మోగింది. ఏకంగా 21 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. మరో పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో చాలామంది పరిస్థితి విషమంగా ఉంది. మృతుల్లో తయారీ కేంద్రం యజమాని కూడా ఉన్నారు. అప్పుడు... అక్కడ పని చేస్తున్న వారిలో అత్యధికులు బాధితులుగా మారారు. తయారీ కేంద్రం కుప్పకూలి... చుట్టుపక్కల ప్రాంతం పొగచూరి... వాహనాలు ఛిద్రమై... మృతదేహాలు చెల్లా చెదురై... ఆ ప్రాంతం యుద్ధ భూమిని తలపించింది. క్షతగాత్రుల హాహాకారాలతో దద్దరిల్లింది.

(కాకినాడ/సామర్లకోట - ఆంధ్రజ్యోతి)

అది... కాకినాడ జిల్లా సామర్లకోట మండలం వేట్లపాలెం శివారు! గోదావరి కాలువ అవతల పచ్చని పొలాల మధ్య... సూర్యశ్రీ ఫైర్‌ వర్క్‌! శనివారం మధ్యాహ్నం 2.10 గంటలు! శుభకార్యాలు, జాతర్ల కోసం భారీగా బాణసంచా తయారు చేయడంలో కార్మికులు నిమగ్నమయ్యారు. అంతలోనే... ఒక్కసారిగా పెను విస్ఫోటం! ఎనిమిది కిలోమీటర్ల దూరానికీ వినిపించిన శబ్ధాలు! భూకంపం వచ్చిందా అన్నంతగా కంపించిన పరిసరాలు! వరుసగా పేలుళ్ల మీద పేలుళ్లు జరుగుతూనే ఉన్నాయి. 20 మీటర్ల ఎత్తుదాకా మంటలు ఎగిసి పడ్డాయి. పేలుళ్ల ధాటికి అక్కడికక్కడే 21 మంది చనిపోయారు. బాణసంచా తయారీ కేంద్రానికి సంబంధించిన రెండు షెడ్లు కుప్ప కూలిపోయాయి. కార్మికులకు సంబంధించిన ద్విచక్ర వాహనాలు ముక్కలు ముక్కలుగా విడిపోయాయి. సినిమాల్లో చూపినట్లుగా సైకిళ్లు గాలిలోకి ఎగిరి కిందపడ్డాయి. ఇనుప డ్రమ్ములు, స్తంభాలు తుత్తునియలయ్యాయి. పేలుడు తీవ్రత తెలుపుతూ... ఆ ప్రాంతమంతా మరుభూమిని తలపించింది.


అసలేం జరిగింది...

వేట్లపాలెంలోని సూర్యశ్రీ ఫైర్‌ వర్క్‌ బాణసంచా తయారీ కేంద్రం బాణాసంచా తయారీకి ప్రసిద్ధి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో శుభకార్యాలు, జాతరలు, పండగలకు ఇక్కడి నుంచే బాణసంచా వెళ్తుంది. అడబాల శ్రీను అనే వ్యక్తి తన ఇద్దరు కుమారులు అడబాల వీరబాబు, అర్జున్‌ పేర్లతో ఈ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. తాజాగా... జగ్గంపేట నియోజకవర్గం గోకవరం మండలం సింగారమ్మ చింత అమ్మవారి ఉత్సవాలకోసం భారీ ఆర్డరు వచ్చింది. దీంతో తాత్కాలికంగా మరికొందరు కార్మికులను నియమించుకున్నారు. సామర్లకోట, వేట్లపాలెం, మేడపాడు తదితర ప్రాంతానికి చెందిన సుమారు 70 మంది శనివారం బాణసంచా తయారీ పనికి వెళ్లారు. మధ్యాహ్నం రెండు గంటల సమయానికి వారిలో దాదాపు సగంమంది భోజనానికి వెళ్లారు. మిగిలిన వారంతా పనిలో నిమగ్నమయ్యారు. వివిధ వర్గాల కథనం ప్రకారం... కలర్‌ చిచ్చుబుడ్ల తయారీ దగ్గరే తొలి చిచ్చు పుట్టుంది. ఈ చిచ్చుబుడ్లలో మందు కూరేందుకు మెల్లగా సుత్తితో కొడతారు. ఆ సమయంలోనే నిప్పు రవ్వ రాజుకుంది. అది పక్కనే ఉన్న ‘సెర్చ్‌ లైట్‌’ అనే మరోరకం బాణసంచాపై పడింది. మెల్లగా పేలుడు మొదలైంది. అక్కడికి దగ్గరే వందల సంఖ్యలో ‘నార బాంబులు’ (బ్యాటరీ బాంబులు) ఉన్నాయి. వాటికీ మంట అంటుకుంది. దీనికి తోడు... తమిళనాడు నుంచి తెప్పించిన పేలుడు రసాయనం రెండు డ్రమ్ముల్లో నిండుగా ఉంది. ఇంకేముందీ... యుద్ధంలో బాంబులు కురిపిస్తున్నట్లుగా పేలుళ్లు మొదలయ్యాయి. ఆగకుండా... పేలుతూనే ఉన్నాయి. వందల సంఖ్యలో ఉన్న నారబాంబుల వల్లే పేలుళ్ల తీవ్రత ఎక్కువగా ఉందని తెలుస్తోంది. ఆ ప్రాంతం గోదావరి కాలువకు ఆవల, పొలాల మధ్య ఉండటంతో... తక్షణ సహాయం అందే దిక్కూ లేకుండా పోయింది. పెద్ద ఎత్తున ఎగసి పడుతున్న మంటలు, బాణసంచా పేలుడు, దట్టమైన పొగ కారణంగా... లోపలికి వెళ్లలేకపోయామని, అప్పటికే అక్కడున్న చాలామంది ప్రాణాలు కోల్పోయారని స్థానికులు తెలిపారు.


హుటాహుటిన..

భారీ విస్ఫోటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. జిల్లా కలెక్టర్‌ షాన్‌మోహన్‌ సగిలి, ఎస్పీ బిందుమాధవ్‌, జాయింట్‌ కలెక్టర్‌ అపూర్వ భరత్‌, అసిస్టెంట్‌ కలెక్టర్‌ మనీషా, కాకినాడ, పెద్దాపురం ఆర్డీఓలు, డీఎస్పీలు, సీఐలు.... ఇలా అందరూ సంఘటన స్థలానికి చేరుకున్నారు. కాకినాడ, సామర్లకోట, పెద్దాపురం నుంచి పెద్ద ఎత్తున ఫైరింజన్లు వచ్చి మంటలను అదుపు చేశాయి. ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. మృతదేహాల గుర్తింపు, ఆసుపత్రులకు తరలింపు వంటి వ్యవహారాలను ఉన్నతాధికారులు పర్యవేక్షించారు.

మళ్లీ... మళ్లీ... పేలుడు

మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6.30 గంటల దాకా ఫైరింజన్లతో మంటలు ఆర్పుతూనే ఉన్నారు. ఈ క్రమంలో బాణసంచా తయారీ కేంద్రంలో ధ్వంసమైన ఒక రేకులషెడ్డు, కాంక్రీట్‌ భవనం అడుగున సగం కాలకుండా ఉన్న మందుగుండు మళ్లీ పేలింది. ఆ సమయంలో... కలెక్టర్‌, ఎస్పీ అక్కడే ఉన్నారు. పేలుడు ధాటికి పరుగులు తీశారు.

మాంసపు ముద్దలుగా...

పేలుళ్ల తీవ్రతకు మృతదేహాలు బొగ్గులుగా మారిపోయాయి. చిందరవందరగా పడిపోయాయి. ఏ మృతదేహం ఎవరిదోకూడా గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయి. తల, కాళ్లు చేతులు తెగిపడి ఎగిరి... పక్కనే ఉన్న పొలాల్లో మాంసపు ముద్దలు పడ్డాయి. మరికొందరైతే... ఉన్నచోట ఉన్నట్లుగానే బుగ్గి అయ్యారు. మృతుల్లో కొంతమందిని అతికష్టంపై వెతికి పోలీసులు, స్థానికులు గుర్తించారు. ఘటనా స్థలానికి ఐదారువందల మీటర్ల దూరంలోనూ గోదావరి కాలువ గట్టుపై తలలేని మొండెం కనిపించింది. ముద్దలు ముద్దలుగా, తునాతునకలైన మృతదేహాలను ఒకచోట చేర్చి స్ట్రెచర్‌ మీద ఎక్కించేందుకు ఫైర్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది సైతం వణికిపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొన్ని మృతదేహాలను అతికష్టం మీద గుర్తించగా... గుర్తుపట్టలేని మృతదేహాలకు నంబర్లు వేసి సామర్లకోట మార్చురీకి తరలించారు.


వేట్లపాలెం దుర్ఘటన మృతులకు పోస్టుమార్టం పూర్తి

కాకినాడ, ఫిబ్రవరి 28(ఆంధ్రజ్యోతి): కాకినాడ జిల్లా వేట్లపాలెం బాణసంచా తయారీ కేంద్రం సూర్య శ్రీ ఫైర్‌ వర్క్స్‌లో జరిగిన ఘోర ప్రమాద దుర్ఘటనలో మరణించిన కూలీల మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి చేశారు. శనివారం రాత్రి మృతుల కుటుంబీకులు, బంధువులకు అధికారులు మృతదేహాలను అప్పగించారు. అంత్యక్రియల ఖర్చు కింద 25 వేల రూపాయల చొప్పున అందజేశారు.

Updated Date - Mar 01 , 2026 | 04:51 AM