Traffic Chaos as Sankranti Travelers: పండగ సందడి తిరిగెళ్లిపోతోంది
ABN , Publish Date - Jan 18 , 2026 | 04:04 AM
సంక్రాంతి మూడు రోజులు సొంతూరులో హుషారుగా గడిపిన వారు తిరుగుప్రయాణమయ్యారు. శనివారం విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి వేలాది వాహనాలతో కిటకిటలాడింది.
సంక్రాంతికి వచ్చిన వారు తిరుగుప్రయాణం
విజయవాడ-హైదరాబాద్ రహదారి కిటకిట
నందిగామ, జనవరి 17: సంక్రాంతి మూడు రోజులు సొంతూరులో హుషారుగా గడిపిన వారు తిరుగుప్రయాణమయ్యారు. శనివారం విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి వేలాది వాహనాలతో కిటకిటలాడింది. నందిగామ సమీపంలోని బైపాస్, అప్రోచ్ రోడ్లకు మరమ్మతులు నిర్వహించడంతో ప్రయాణం సాఫీగానే సాగింది. అయితే ట్రాఫిక్ నియంత్రణ విషయంలో ముందస్తు ఏర్పాట్లలో పోలీసు యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించింది. కనుమ మరుసటిరోజు నుంచి తిరుగు ప్రయాణం సాగుతుందని తెలిసి కూడా ట్రాఫిక్ నియంత్రణ బోర్డులు ఏర్పాటు చేయలేదు. ఒక్క క్షణం ఆపినా వేలాది వాహనాలు ఆగిపోయే పరిస్థితుల్లో స్పీడ్‌బ్రేకర్లు, బోర్డులు ఏర్పాటుచేస్తూ పోలీసులు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారు. దీంతో శనివారం ఉదయం గంటపాటు వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఓ గంట తర్వాత వాహనాలు సాఫీగా కదిలాయి. గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని కీసర టోల్‌ప్లాజా వద్ద ముందస్తు ఏర్పాట్లు చేశారు. సాధారణంగా ఐదు కౌంటర్ల నుంచి వాహనాలు వెళ్లేందుకు అనుమతి ఇస్తారు. శనివారం ఉదయం మరో మూడు కౌంటర్లు అదనంగా తెరిచారు. దీంతో వాహనాలు వేగంగా ముందుకుసాగాయి.