అనాథ శవాలతో వ్యాపారం!
ABN , Publish Date - Jan 29 , 2026 | 12:51 AM
మచిలీపట్నం సర్వజన ఆస్పత్రిలో సరికొత్త వ్యాపారం నడుస్తోంది. అక్రమ సంపాదనకు అలవాటుపడిన కొందరు వ్యక్తులు ఓ మాఫియాగా ఏర్పడి అనాథ మృతదేహాలతో వ్యాపారం ఆరంభించారు. ఆస్పత్రి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రైవేటు వైద్య కళాశాలలకు గుట్టుగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఒక్కో మృతదేహానికి రూ.70 వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేస్తున్నారు. వీరికి ఆస్పత్రిలో పనిచేసే పలువురు ఉద్యోగులు సహకరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా అందాయని, వారు పిలిపించి హెచ్చరించిన తర్వాత కూడా శవాల విక్రయాలు జరుగుతున్నట్టు తెలిసింది. చర్యలు తీసుకోవాల్సిన ఆస్పత్రి అధికారులు పట్టనట్టు ఉండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమ వుతున్నాయి.
- మచిలీపట్నం సర్వజన ఆస్పత్రిలో 20కిపైగా మృతదేహాలు మాయం!
- రాష్ట్రంలోని వివిధ ప్రైవేటు వైద్య కళాశాలలకు గుట్టుగా విక్రయం
- ఒక్కో మృతదేహానికి రూ.70 వేల నుంచి రూ.లక్ష వసూలు!
- అక్రమ సంపాదన కోసం బరితెగించిన ఓ మాఫియా
- వీరికి ఆస్పత్రిలో పనిచేసే ఉద్యోగుల సహకారం!
- ఇటీవల ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు అందిన ఫిర్యాదు
- పిలిచి హెచ్చరించినా ఆగని విక్రయాలు
మచిలీపట్నం సర్వజన ఆస్పత్రిలో సరికొత్త వ్యాపారం నడుస్తోంది. అక్రమ సంపాదనకు అలవాటుపడిన కొందరు వ్యక్తులు ఓ మాఫియాగా ఏర్పడి అనాథ మృతదేహాలతో వ్యాపారం ఆరంభించారు. ఆస్పత్రి నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రైవేటు వైద్య కళాశాలలకు గుట్టుగా అమ్మకాలు సాగిస్తున్నారు. ఒక్కో మృతదేహానికి రూ.70 వేల నుంచి రూ. లక్ష వరకు వసూలు చేస్తున్నారు. వీరికి ఆస్పత్రిలో పనిచేసే పలువురు ఉద్యోగులు సహకరిస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. ఇటీవల ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా అందాయని, వారు పిలిపించి హెచ్చరించిన తర్వాత కూడా శవాల విక్రయాలు జరుగుతున్నట్టు తెలిసింది. చర్యలు తీసుకోవాల్సిన ఆస్పత్రి అధికారులు పట్టనట్టు ఉండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమ వుతున్నాయి.
ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం :
జిల్లా కేంద్ర ఆస్పత్రిగా ఉన్న మచిలీపట్నంలోని ప్రభుత్వాస్పత్రిని మూడేళ్ల క్రితం మచిలీపట్నం మెడికల్ కళాశాలకు అనుబంధంగా సర్వజన ఆస్పత్రిగా మార్పు చేశారు. గతంలో ఇక్కడ పనిచేసిన వైద్యుల్లో అధిక శాతం మంది బదిలీపై వెళ్లిపోయారు. వైద్యులతో పాటు ఇతర విభాగాల్లో ఎక్కువ మంది ఉద్యోగులు నూతనంగా వచ్చి విధులు నిర్వహిస్తున్నారు. పాత, కొత్త అధికారులు, ఉద్యోగుల్లో కొందరు ఓ మాఫియాతో చేతులు కలిపి అనాథ మృతదేహాలను విక్రయించే పనిని చేపట్టారని ఆరోపణలు వస్తున్నాయి.
అంత్యక్రియలకు మంగళం!
ఆస్పత్రికి వచ్చిన అనాథ మృతదేహాలను ఆస్పత్రి ఆవరణలోని మార్చురీలో భద్రపరుస్తారు. నాలుగైదురోజుల వరకు ఎవ్వరూ ఈ మృతదేహాలను తీసుకునేందుకు రాకుంటే మునిసిపాలిటీ సిబ్బందికి అప్పగించి అంత్యక్రియలు పూర్తిచేసే అనవాయితీ గతంలో ఉండేది. ఈ ఆనవాయితీకి కొంతకాలంగా మంగళం పాడారు. ఆస్పత్రిలో పనిచేసే ఉద్యోగులు, మరికొందరు కలిసి ఆస్పత్రి మార్చురీలోని అనాథ మృతదేహాలను మూడో కంటికి తెలియకుండా మాయం చేస్తున్నారు. గత కొద్ది నెలల్లో సుమారు 20 వరకు మృతదేహాలను రాష్ట్రంలోని వివిధ మెడికల్ కళాశాలలకు విక్రయించి భారీగా సొమ్ము చేసుకున్నట్టు తెలిసింది.
జిల్లా అధికారులకు ఫిర్యాదు
ఇటీవల ఈ వ్యవహారంపై జిల్లా అధికారులకు కొందరు ఫిర్యాదులు చేశారు. సీరియస్‌గా తీసుకున్న సదరు జిల్లా అధికారులు ఈ అంశంపై ఆస్పత్రి అధికారులను పిలిపించి తమదైన శైలిలో క్లాస్ తీసుకున్నట్లు సమాచారం. ఏ నెలలో ఎన్ని అనాధ మృతదేహాలు ఆస్పత్రికి వచ్చాయి, వాటిని ఏం చేశారో రికార్డులు చూపమని అడిగితే సర్వజన ఆస్పత్రి వైద్యులు నీళ్లు నమిలి, ఒకరిపై ఒకరు చెప్పుకుని ఈ విషయం నుంచి తాత్కాలికంగా బయట పడినట్లు ఆసుపత్రి వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఇంతా జరిగినా గత వారం రోజుల వ్యవధిలో ఒక మృతదేహాన్ని గుట్టుచప్పుడు కాకుండా విక్రయించేసినట్లు విశ్వసనీయ సమాచారం.
ఫార్మాలిన్ ఎక్కించి మరీ..
సర్వజన ఆస్పత్రికి అనాథ మృతదేహాలు వస్తే శవాలు విక్రయించే మాపియా మార్చురీ చుట్టూనే తిరుగుతోందని ఆరోపణలు ఉన్నాయి. అనాథ మృతదేహం వచ్చిందనే సమాచారం ఆస్పత్రి వర్గాలే ప్రైవేటు మెడికల్ కళాశాలలకు మృతదేహాలను విక్రయించే ఏజెంట్లకు చేరవేయడం, వారు వచ్చి ఒక్కో మృతదేహాన్ని రూ.70 వేల నుంచి లక్ష రూపాయలకు కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారని ఆస్పత్రిలో పనిచేసే కొందరు వైద్యులు, సిబ్బంది చెప్పుకుంటున్నారు. మృతదేహం ఐదారు నెలల పాటు చెడిపోకుండా ఉండేలా ఆస్పత్రిలోని ఫార్మాలిన్ (మృతదేహాలను సంరక్షించడానికి వాడే ద్రావణం)ను వాడుతుండటం గమనార్హం. మృతదేహం మెడకు ఇరువైపులా ఉన్న పెద్దనరాలను కట్ చేసి, ఐదులీటర్ల ఫార్మాలిన్‌ను మృతదేహంలోకి ఎక్కించి ప్రైవేటు మెడికల్ కళాశాలలకు అక్రమమార్గంలో విక్రయించేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. అనాథ మృతదేహాలకు ఆస్పత్రి ఖర్చులతోనే ఫార్మాలిన్‌వాడి మరీ విక్రయాలు జరుపుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని కొందరు వైద్యులు, సిబ్బంది ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై లోతుగా విచారణ చేస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని ఆస్పత్రి వర్గాలు బాహాటంగానే చెప్పుకుంటున్నాయి.
అలాంటిదేమీ లేదు
మచిలీపట్నం సర్వజన ఆస్పత్రి నుంచి అనాథ మృతదేహాలను విక్రయించే అవకాశమే లేదు. ఈ తరహా మృతదేహాలు ఉంటే మచిలీపట్నం మెడికల్ కళాశాలకు లేదా పూర్తిస్థాయి అనుమతులతో ఇతర కళాశాలలకు పంపే అవకాశం ఉంటుంది.
-ఆశాలత, మచిలీపట్నం సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్