Share News

అమరావతిలో పర్యాటక భవన్‌ అంతర్జాతీయ పర్యాటక డెస్క్‌,

ABN , Publish Date - Feb 08 , 2026 | 04:48 AM

రాజధాని అమరావతిలో పర్యాటక భవన్‌ ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ వెల్లడించారు.

అమరావతిలో పర్యాటక భవన్‌ అంతర్జాతీయ పర్యాటక డెస్క్‌,

  • వీసా ఫెసిలిటేషన్‌ సెంటర్‌కు ప్రతిపాదనలు

  • 150 కోట్లతో పర్యాటక బ్రాండింగ్‌, ఈవెంట్లు

  • టూరిజం ప్రాజెక్టుల ద్వారా 1.22 లక్షల ఉద్యోగాలు

  • పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ వెల్లడి

రాజమహేంద్రవరం, ఫిబ్రవరి 7(ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో పర్యాటక భవన్‌ ఏర్పాటు చేయనున్నామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్‌ వెల్లడించారు. అంతర్జాతీయ పర్యాటక డెస్క్‌లు, ప్రధాన పర్యాటక అగ్రిగేటర్లకు స్థలాలు, వీసా ఫెసిలిటేషన్‌ కౌంటర్ల ఏర్పాటుకు అమరావతిలో ఇంటిగ్రేటెడ్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇంటర్‌ప్రెటేషన్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు రూ.100 కోట్లతో ప్రతిపాదనలు చేశామన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని తన కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రవ్యాప్తంగా 60 చోట్ల వాటర్‌ స్పోర్ట్స్‌, అడ్వెంచర్‌ టూరిజం ప్రారంభిస్తున్నాం. బ్లూఫాగ్‌ బీచ్‌లు, ఎకో టూరిజం, టెంట్‌ సిటీలను విస్తరిస్తున్నాం. ఇటీవల పర్యాటక శాఖకు బ్రాండింగ్‌, మార్కెటింగ్‌, ఈవెంట్ల నిర్వహణకు రూ. 150 కోట్లు కేటాయింపు జరిగింది. ఏపీలో వెల్‌నెస్‌ సెంటర్లు ఏర్పాటు చేస్తే పెట్టుబడులు పెట్టడానికి జర్మనీ ముందుకు వచ్చింది. వియత్నాం ఇప్పటికే చర్యలు ఆరంభించింది. వచ్చే ఏడాది గోదావరి పుష్కరాలకు కూడా ప్రచారం చేస్తాం. రాష్ట్రంలో ప్రస్తుతం 27 పర్యాటక ప్రాజెక్టులకు ఎస్‌ఐపీబీ అనుమతులు లభించగా 12 పురోగతిలో ఉన్నాయి. 5 ప్రాజెక్టులకు త్వరలో శంకుస్థాపన చేస్తాం. మరో 7 ప్రాజెక్టులకు భూకేటాయింపులు జరిగాయి. వీటి ద్వారా 1,22,637 ఉద్యోగాలు రానున్నాయి. 117 ప్రఖ్యాత సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నాం. 20నెలల్లో రూ. 30వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాం. రాష్ట్ర చరిత్రలోనే అత్యధికంగా కేంద్రం నుంచి 8 పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.428కోట్ల గ్రాంటు సాధించాం.


ఇప్పటికే ప్రపంచ బ్రాండ్‌గా మారిన అరకు కాఫీ మాదిరిగా చిరుధాన్యాల భోజనం (అరకు కౌనీ)ని పర్యాటకులకు పరిచయం చేస్తాం. దీనికి బ్రాండ్‌ ఇమేజ్‌ వస్తుంది. 21 ప్రధాన పుణ్యక్షేత్రాల వద్ద టెంట్‌ సిటీలు ఏర్పాటు చేస్తున్నాం. కేరళ తరహాలో రాజమహేంద్రవరం, విజయవాడ సహా 8 ప్రాంతాల్లో హౌస్‌బోట్లు ఏర్పాటు చేస్తాం. వైసీపీ అధినేత జగన్‌ ఓదార్పు యాత్రలు చేయడం కాదు. తాను చేసిన పాపాలు కడుక్కోవడానికి ప్రాయశ్చిత్త యాత్ర చేయాలి. జగన్‌ డైవర్షన్‌ పాలిటిక్స్‌ చేస్తున్నారు’’ అని దుర్గేశ్‌ మండిపడ్డారు.

Updated Date - Feb 08 , 2026 | 04:49 AM