దాహం తీర్చేందుకు...
ABN , Publish Date - May 06 , 2026 | 12:26 AM
పశ్చిమ పల్లె సీమల్లో దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న క‘న్నీటి’ కష్టాలు తీరనున్నాయి.
రూ.128.75 కోట్లు మంజూరు
కోడుమూరు కష్టాలకు విముక్తిగా జీడీపీ నుంచి పైపు లైన
జొహరాపురానికి హంద్రీ నీవా నీరు
పాదయాత్రలో నారా లోకేశ ఇచ్చిన హామీల అమలు దిశగా అడుగులు
కర్నూలు, మే 5(ఆంధ్రజ్యోతి): పశ్చిమ పల్లె సీమల్లో దీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న క‘న్నీటి’ కష్టాలు తీరనున్నాయి. జిల్లాలోని 53 గ్రామాల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపడానికి రూ.128.75 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఆ గ్రామాలకు సురక్షిత తాగునీరు అందించేందుకు గ్రామీణ తాగునీటి సరఫరా ఇంజనీర్లు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. కోడుమూరుకు గాజులదిన్నె జలాశయం నుంచి పైపు లైన ఏర్పాటు చేయబోతున్నారు. హంద్రీనీవా కాలువ ద్వారా జొహరాపురం గ్రామానికి శుద్ధి చేసిన స్వచ్ఛమైన తాగునీరు అందించి వక్రేణి నీటి కష్టాల నుంచి విముక్తి కలిగించనున్నారు. వీలునుబట్టి తుంగభద్ర, ఎల్లెల్సీ కాలువ, గాజులదిన్నె, పత్తికొండ, పులికనుమ జలాశయాల నుంచి స్వచ్ఛమైన నీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అవకాశం లేని గ్రామాలకు బోర్ల ద్వారా నీరు సరఫరా చేయనున్నారు. టెండర్లు ప్రక్రియ పూర్తి చేసి పనులు ప్రారంభించేలా ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలి. ఆ వివరాలపై ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనం.
జిల్లాలో కోడుమూరు, ఎమ్మిగనూరు, మంత్రాలయం, ఆలూరు, పత్తికొండ, పాణ్యం నియోజకవర్గాల్లోని 27 మండలాల పరిధిలో 484 పంచాయతీలు ఉన్నాయి. కర్నూలు నగరం, ఆదోని, ఎమ్మిగనూరు పట్టణాలు మినహా జిల్లా అంతా గ్రామీణ ప్రాంతమే. గ్రామీణ తాగునీటి సరఫరా (ఆర్‌డబ్ల్యూఎస్) విభాగం రికార్డులు ప్రకారం 32 సమగ్ర రక్షిత మంచినీటి పథకాలు (సీపీడబ్ల్యూఎస్) ద్వారా 360 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందిస్తున్నారు. మిగిలిన గ్రామాల్లో పీడబ్ల్యూఎస్ ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నట్లు చూపుతున్నారు. అయితే.. మెజార్టీ సీపీడబ్ల్యూఎస్ పథకాలు 25-35 ఏళ్లకు ముందు నిర్మించినవే. జనాభా పెరగడం, నీటి పథకాలు నిర్వహణ లోపం వెరసి పశ్చిమ ప్రాంతాల్లో తాగునీటి కష్టాలతో తల్లడిల్లుతున్నారు. వేసవి వచ్చిందంటే మంచినీటి కోసం సమరం తప్పడం లేదు. పలు గ్రామాల్లో జల జగడాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో నీటి కష్టాలకు స్వస్తి చెప్పి స్వచ్ఛమైన తాగునీరు ఇవ్వాలనే లక్ష్యంగా 2019 ఆగస్టు 15న కేంద్ర ప్రభుత్వం జల్ జీవన మిషన (జేజేఎం) అమలులోకి తెచ్చింది. 2024 వరకు అంటే ఐదేళ్లలో ప్రతి ఇంటికి కుళాయి కనెక్షనతో పాటు శుద్ధి చేసిన స్వచ్ఛమైన నీరు అందించాలి. రూ.692.92 కోట్లతో 1,491 పనులు చేపట్టారు. ఈ పనులు పూర్తి చేసి ఉంటే పశ్చిమ ప్రాంతంలో తాగునీటి కష్టాలు ఉండేవి కాదు. అయితే.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అంతులేని నిర్లక్ష్యం కారణంగా సకాలంలో నిధులు వినియోగించుకోలేదు. గడువు తీరడం వల్ల రూ.567.29 కోట్ల విలువైన 1,024 పనులు రద్దు చేశారు. ఫలితంగా గ్రామీణులకు కన్నీటి కష్టాలు మిగిలాయి.
ఫ లోకేశ పాదయాత్ర హామీల అమలు దిశగా..:
2023 ఏప్రిల్ నెలలో టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రస్తుత మంత్రి నారా లోకేశ యువగళం పాదయాత్ర చేశారు. ఆ సమయంలో ప్రతి పల్లెలో తాగునీటి సమస్యతో జనం పడుతున్న ఇబ్బందులు కళ్లారా చూశారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే నీటి కష్టాలు తీరుస్తామంటూ స్పష్టమైన హామీ ఇచ్చారు. కోడుమూరులో జరిగిన సభలో నారా లోకేశ, గూడూరు ప్రజాగళం సభలో సీఎం చంద్రబాబు కోడుమూరు పట్టణ తాగునీటి సమస్యను తీరుస్తామంటూ హామీ ఇచ్చారు. నాటి హామీల అమలు దిశగా అడుగులు పడుతున్నాయి. తాగునీటి కోసం నిధులు మంజూరు చేస్తున్నారు.
ఫ 53 గ్రామాలు.. రూ.128.75 కోట్లు:
ఆదోని, ఆలూరు, కోడుమూరు, మంత్రాలయం, పత్తికొండ, ఎమ్మిగనూరు నియోజకవర్గాల్లో 53 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించి నీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపనున్నారు. ఇందు కోసం రూ.128.75 కోట్లు మంజూరు చేశారు. స్టేట్ డెవలప్‌మెంట్ ఫండ్ (ఎస్‌డీఎఫ్), ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌డీఎస్ (ప్లెయిన) గ్రాంట్ కింద ఈ నిధులు మంజూరు చేస్తూ మార్చి 26న జీవోఎంఎస్ నంబరు.54 ప్రభుత్వం జారీ చేసింది. నిధులు మంజూరైన గ్రామాలకు ఎక్కడి నుంచి తాగునీరు సరఫరా చేయాల్సిందీ ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీర్లు ప్రతిపాదనలు, నివేదికలు సిద్ధం చేశారు. సాంకేతిక అనుమతులు రాగానే టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి పనులకు శ్రీకారం చుట్టే అవకాశం ఉంది. అత్యధికంగా కోడుమూరు నియోజకవర్గానికి ఐదు గ్రామాలకు రూ.43.26 కోట్లు మంజూరు చేయగా, మంత్రాలయం నియోజకవర్గంలో 21 గ్రామాలకు రూ.28.52 కోట్లు మంజూరు చేశారు. రాబోయే వేసవి నాటికి ఆయా గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందించే అవకాశాలు ఉన్నాయి.
ఫ కోడుమూరు నీటి కష్టాలకు చెక్:
కోడుమూరు మేజర్ పంచాయతీ జనాభా 45 వేలు పైమాటే. చెంతనే హంద్రీ నది ప్రవహిస్తున్నా ప్రజలు ఏటేటా తాగునీటి కష్టాలు అనుభవిస్తున్నారు. వాటి సమస్యల పరిష్కారానికి నిధులు మంజూరు చేసి కోడుమూరు ప్రజల తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కేడీసీసీబీ చైర్మన డి. విష్ణువర్ధనరెడ్డి, ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశలకు లేఖలు రాశారు. ఎట్టకేలకు ప్రభుత్వం రూ.38.67 కోట్లు మంజూరు చేసింది. గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి 12 కిలోమీటర్లు పైపులైన, కోడుమూరు వద్ద ఫిల్టర్ బెడ్స్ నిర్మించి స్వచ్ఛమైన తాగునీరు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.
ఫ హంద్రీ నీవా నుంచి జొహరాపురానికి తాగునీరు:
ఆస్పరి మండలం జొహరాపురం జనాభా పది వేలకు పైగా ఉంది. దశాబ్దాలుగా తాగునీటి సమస్యతో తల్లడిల్లుతున్నారు. వందేళ్ల క్రితం పూర్వీకులు తవ్వుకున్న వక్రేణి (వర్షపు నీటి నిల్వ కుంట) నీరే ఆ పల్లె వాసులకు ప్రాణజలం. కుంట నీరు తాగడం వల్ల ఆనారోగ్య సమస్యలు తలెత్తాయి. జొహరాపురం నీటి కష్టాలను ఆంధ్రజ్యోతి పలు కథనాలు ద్వారా వెలుగులోకి తెచ్చింది. వాటిపై కూటమి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. హంద్రీ నీవా కాలువ నుంచి ప్రత్యేక పైపులైన, గ్రామం చెంతనే 15 ఎకరాల పంచాయతీ స్థలంలో ఎస్‌ఎస్ ట్యాంక్, ఫిల్టర్ బెడ్స్ నిర్మించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతూ రూ.6.75 కోట్లు మంజూరు చేశారు. ఆలూరు, ఆస్పరి, దేవనకొండ మండలాల్లో ఏడు గ్రామాలకు రూ.12.34 కోట్లు మంజూరు చేశారు. మిగిలిన నియోజకవర్గల్లో కూడా అందుబాటులోని నీటి వనరులు సద్వినియోగం చేసుకొని దాహం తీర్చే లక్ష్యంగా పైపులైన, ఫిల్టర్ బెడ్స్, ఎస్‌ఎస్ ట్యాంకులు, బోర్లు ద్వారా నీటి సరఫరాకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
ఫ నియోజకవర్గాల వారిగా మంజూరైన నిధులు:
------------------------------------------------------------------------
నియోజకవర్గం గ్రామాలు నిధులు (రూ.కోట్లు)
-------------------------------------------------------------------------
ఆదోని 3 13.30
ఆలూరు 7 12.34
కోడుమూరు 5 43.27
మంత్రాలయం 21 28.53
పత్తికొండ 13 9.61
ఎమ్మిగనూరు 4 21.70
---------------------------------------------------------
మొత్తం 53 128.75
----------------------------------------------------------