Share News

‘టైటిల్‌’ వివాదాలు తేల్చేది సివిల్‌ కోర్టులే

ABN , Publish Date - Jun 10 , 2026 | 04:56 AM

భూమికి సంబంధించి టైటిల్‌ వివాదాలు తేల్చే అధికారం సివిల్‌ కోర్టులకే ఉంటుందని, వాటిపై విచారణ జరిపే అధికారం స్థానిక సంస్థల అధికారులకు ఉండదని హైకోర్టు తేల్చిచెప్పింది.

‘టైటిల్‌’ వివాదాలు తేల్చేది సివిల్‌ కోర్టులే

  • వాటిని స్థానిక సంస్థలు విచారణ జరపలేవు

  • న్యాయస్థానాల అధికారాల్లోకి చొరబడొద్దు

  • భవన నిర్మాణం కోసం దరఖాస్తు వచ్చినప్పుడు భూమి దరఖాస్తుదారు స్వాధీనంలోనే ఉందా?

  • టైటిల్‌ వారి పేరు మీదే ఉందా? అనేదే చూడాలి

  • ‘లీగల్‌’ పేరిట నిరాకరించొద్దు: హైకోర్టు

అమరావతి, జూన్‌ 9(ఆంధ్రజ్యోతి): భూమికి సంబంధించి టైటిల్‌ వివాదాలు తేల్చే అధికారం సివిల్‌ కోర్టులకే ఉంటుందని, వాటిపై విచారణ జరిపే అధికారం స్థానిక సంస్థల అధికారులకు ఉండదని హైకోర్టు తేల్చిచెప్పింది. కోర్టు అధికార పరిధిలోకి చొరబడడానికి వీల్లేదని స్పష్టం చేసింది. భవన నిర్మాణ అనుమతుల కోసం చేసుకున్న దరఖాస్తు పరిశీలించే సమయంలో సదరు ఆస్తి దరఖాస్తుదారుడి స్వాధీనంలోనే ఉందా?. టైటిల్‌ అతని పేరు మీదే ఉందా?. అనే విషయాలను మాత్రమే ప్రాథమికంగా పరిశీలించాలని పేర్కొంది. భూమిపై యాజమాన్య హక్కు(టైటిల్‌) ఎవరిదనే విషయంపై విచారణ చేసే అధికారం గ్రామ పంచాయితీ అధికారులకు లేదని స్పష్టం చేసింది. లీగల్‌ నోటీసు ఆధారంగా గ్రామ పంచాయితీ కార్యదర్శి భవన నిర్మాణ అనుమతులు నిరాకరించడాన్ని తప్పుపట్టింది. పంచాయితీ కార్యదర్శి చర్య చట్టవిరుద్ధమని పేర్కొంది. ప్రస్తుత కేసులో ఓ వ్యక్తి ఇచ్చిన లీగల్‌ నోటీసు ఆధారంగా పిటిషనర్‌ కాంటారెడ్డి జమాల్‌రెడ్డికి భవన నిర్మాణ అనుమతిని నిరాకరిస్తూ సీతారామపురం గ్రామపంచాయితీ చేసిన తీర్మానాన్ని న్యాయస్థానం కొట్టివేసింది. భవన నిర్మాణానికి అనుమతి కోరుతూ జమాల్‌రెడ్డి చేసుకున్న దరఖాస్తును ఏపీ పంచాయితీరాజ్‌ చట్టనిబంధనల ప్రకారం తిరిగి పరిశీలించి తగిన ఉత్తర్వులు జారీ చేయాలని పంచాయితీ కార్యదర్శిని ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి ఇటీవల తీర్పు ఇచ్చారు.


ఇదీ.. కేసు!

నంద్యాల జిల్లా, మహానంది మండలం, సీతారామపురం గ్రామంలోని సర్వే నెంబరు 408లో ఉన్న 195.5 చదరపు గజాల స్థలాన్ని అదే గ్రామానికి చెందిన సోదరులు వెంకటరమణ, రామకృష్ణుడు నుంచి 2009, అక్టోబరు 22న రిజిస్టర్డ్‌ సేల్‌ డీడ్‌ ద్వారా జమాల్‌రెడ్డి కొనుగోలు చేశారు. ఆ స్థలంలో మట్టిగోడలతో కూడిన ఇల్లు నిర్మించి పంచాయితీకి ఆస్తి పన్ను చెల్లిస్తున్నారు. ఆ ఇంటి స్థానంలో పక్కా భవనం నిర్మించేందుకు జమాల్‌రెడ్డి ప్రయత్నించగా అనుమతులు లేవంటూ పంచాయితీ కార్యదర్శి షోకాజ్‌ నోటీసు ఇచ్చారు. దానికి వివరణ ఇస్తూ భవన నిర్మాణ అనుమతి కోసం బిల్డింగ్‌ ప్లాన్‌, ఇతర దస్త్రాలను జమాల్‌రెడ్డి పంచాయితీకి సమర్పించారు. మరో వైపు జమాల్‌ రెడ్డికి స్థలం విక్రయించిన వెంకటరమణ, రామకృష్ణుడి మరో సోదరుడు శ్రీనివాసులు, వారి వారసులు 2009లో చేసుకున్న రిజిస్ట్రేషన్‌ చెల్లదని 2025, డిసెంబరు 17న లీగల్‌ నోటీసు పంపించారు. సోదరులు ముగ్గురు కలిసి 27 సెంట్ల స్థలాన్ని కొనుగోలు చేశారని, ఆ స్థలంలో కొంతభాగాన్ని జమాల్‌రెడ్డికి విక్రయించేటప్పుడు కేవలం ఇద్దరు మాత్రమే సంతకాలు చేశారని, రిజిస్ట్రేషన్‌ చెల్లుబాటు కాదని అందులో పేర్కొన్నారు. ఈ లీగల్‌ నోటీసు ఆధారంగా జమాల్‌రెడ్డికి భవన నిర్మాణ అనుమతులు నిరాకరిస్తూ 2025, డిసెంబరు 24న గ్రామపంచాయితీ తీర్మానం చేసింది. దీంతో జమాల్‌రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయమూర్తి తుది నిర్ణయాన్ని వెల్లడించారు.


ఆ తీర్మానం చెల్లదు

‘‘పంచాయితీ రాజ్‌ చట్టంలోని నిబంధనల ప్రకారం అనుమతులు లేకుండా భవన నిర్మాణం చేపట్టడానికి వీల్లేదు. ప్రస్తుత కేసులో గ్రామ పంచాయితీ కార్యదర్శి ఇచ్చిన షోకాజ్‌ నోటీసుకు పిటిషనర్‌ వివరణ ఇచ్చారు. లీగల్‌ నోటీసు ఇచ్చిన శ్రీనివాసులు వారసులు సైతం అదే గ్రామంలో నివాసం ఉంటున్నారు. స్థలం విక్రయం విషయంలో వారు సివిల్‌ కోర్టును ఆశ్రయించలేదు. ఈ నేపథ్యంలో శ్రీనివాసులు వారసులు ఇచ్చిన నోటీసు ఆధారంగా గ్రామపంచాయితీ తీర్మానం చేయడం చట్టవిరుద్ధం. ఈ తీర్మానంపై సంబంధిత అథారిటీ వద్ద అప్పీల్‌ చేసుకునేందుకు వెసులుబాటు ఉన్నప్పటికీ, సహేతుక కారణం లేకుండా ఏకపక్షంగా తీర్మానం చేసినప్పుడు నేరుగా హైకోర్టును ఆశ్రయించవచ్చు.’’ అని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు.

Updated Date - Jun 10 , 2026 | 04:57 AM