మస్కట్‌లో చిత్రహింసలు అనుభవిస్తున్నా!
ABN , Publish Date - Jun 22 , 2026 | 05:55 AM
బతుకుదెరువు కోసం మస్కట్‌కు వెళ్లిన ఓ మహిళ పనిచేసే చోట నరకయాతన పడుతున్నానని.. తనను కాపాడాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానీలను సెల్ఫీ వీడియోలో వేడుకుంది.
భారత్‌కు రప్పించాలని సెల్ఫీ వీడియోలో తిరుపతి జిల్లా మహిళ వేడుకోలు
పాకాల, జూన్ 21 (ఆంధ్రజ్యోతి): బతుకుదెరువు కోసం మస్కట్‌కు వెళ్లిన ఓ మహిళ పనిచేసే చోట నరకయాతన పడుతున్నానని.. తనను కాపాడాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానీలను సెల్ఫీ వీడియోలో వేడుకుంది. వీడియోలో తిరుపతి జిల్లా పాకాల మండలం కావలివారిపల్లెకు చెందిన టి.సుజాత.. కాకినాడకు చెందిన చీకరమిల్లి వేణుబాబు అనే ఏజెంటు ద్వారా గత ఏడాది సెప్టెంబరులో మస్కట్ (ఒమాన్) వెళ్లారు. అక్కడ ఓ ఇంట్లో పనికి కుదిరింది. రెండు నెలలుగా ఆరోగ్యం బాగా లేకపోవడంతో ఇండియాకు పంపించాలని యజమానిని వేడుకున్నా ఒప్పుకోలేదు. పైగా ఇంకా కష్టమైన పనులు చేయిస్తున్నారు. ఏజెంటు వేణుబాబు తనను అమ్మేశాడని చెబుతున్నారని కన్నీటిపర్యంతమైంది. తనను రక్షించాలని ఆ సెల్ఫీ వీడియోలో వేడుకుంది. ఆమె భర్త మునిరాజు ఈ నెల 15వ తేదీన పీజీఆర్‌ఎ్‌సలో ఫిర్యాదు చేశారు. తన భార్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని, స్వదేశానికి రప్పించాలని వేడుకుంటున్నారు.