‘బాండ్ల’లో బాదేశారు!
ABN , Publish Date - Jun 10 , 2026 | 04:51 AM
రహదారుల అభివృద్ధి పేరుతో టీడీఆర్ బాండ్లలో కోట్లు కొల్లగొట్టేందుకు వైసీపీ హయాంలో మాస్టర్ ప్లాన్ వేశారు. పొలాలు, స్థలాలు ఇవ్వని వారిని బెదిరించి భయపెట్టారు.
తిరుపతి కార్పొరేషన్ పరిధిలో రూ.414 కోట్ల భారీ దోపిడీ
టీడీఆర్ బాండ్ల జారీలో ‘మాస్టర్ ప్లాన్’
మాస్టర్ ప్లాన్ రోడ్ల పేరిట నాడు భారీ దందా
ఇళ్ల స్థలాలనూ వాణిజ్యభూమిగా చూపారు
వైసీపీ హయాంలో ప్రభుత్వ భూమికీ టీడీఆర్
స్థలం ఇవ్వని యజమానులకు బెదిరింపులు
నాటి అక్రమాల నిగ్గు తేల్చిన విజిలెన్స్
నలుగురు మున్సిపల్ కమిషనర్లు, ఆరుగురు సబ్ రిజిస్ర్టార్లు, 20 మంది పట్టణ ప్రణాళిక సిబ్బందిపై చర్యలకు సిఫారసు
(తిరుపతి(టీటీడీ)-ఆంధ్రజ్యోతి)
రహదారుల అభివృద్ధి పేరుతో టీడీఆర్ బాండ్లలో కోట్లు కొల్లగొట్టేందుకు వైసీపీ హయాంలో మాస్టర్ ప్లాన్ వేశారు. పొలాలు, స్థలాలు ఇవ్వని వారిని బెదిరించి భయపెట్టారు. తాము భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకొని అభివృద్ధి చేస్తున్నామని గొప్పలు చెప్పారు. అయితే ఇదంతా తమ జేబులు నింపుకొనేందుకేనన్న నిజం బట్టబయలైంది. కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అనేక మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో వైసీపీ హయాంలో జారీ చేసిన టీడీఆర్ బాండ్లపై విజిలెన్స్ విచారణ చేపట్టారు. తిరుపతి కార్పొరేషన్ పరిధిలోనే టీడీఆర్ బాండ్ల జారీ పేరుతో ఏకంగా రూ.414.87 కోట్ల భారీ దోపిడీ చేసినట్లు నిగ్గు తేల్చారు. ప్రైవేటు స్థలాలకు టీడీఆర్ బాండ్లు జారీచేసి వాటిని ప్రభుత్వం తీసుకుంటుంది. కానీ, వైసీపీ హయాంలో తిరుపతిలో ప్రభుత్వ స్థలాలకు కూడా టీడీఆర్ బాండ్లు జారీ చేసినట్లు విచారణలో గుర్తించారు. ఈ అక్రమాలపై ప్రభుత్వానికి నివేదికను అందించారు. ఇందుకు బాఽధ్యులైన అప్పటి నలుగురు మున్సిపల్ కమిషనర్లతో పాటు ఆరుగురు సబ్ రిజిస్ట్రార్లు, 20 మంది పట్టణ ప్రణాళిక విభాగ సిబ్బందిపై చర్యలకు సిఫారసు చేశారు. మాస్టర్‌ప్లాన్ రోడ్ల నిర్మాణం విషయంలో అప్పటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి, ఆయన కుమారుడైన అప్పటి కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ అభినయ్ అన్నీ తామై వ్యవహరించారు. ఏకంగా ఎస్వీ విశ్వవిద్యాలయం లోపలి నుంచే రోడ్లు వేసేందుకు ప్రయత్నించగా విద్యార్థులు, పూర్వ విద్యార్థులు, మాజీ ప్రొఫెసర్లు ఉద్యమించడంతో వెనకడుగు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. చాలా ప్రాంతాల్లో స్థానికులను బెదిరించి వారి స్థలాలు రోడ్ల నిర్మాణానికి తీసుకున్నారన్న విమర్శలున్నాయి. వీరిద్దరికీ తెలియకుండా ఇంత పెద్దమొత్తంలో అక్రమంగా టీడీఆర్ బాండ్ల జారీ సాధ్యం కాదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. 414 కోట్ల మేరకు అక్రమాలు అధికారులే చేయడం అసాధ్యమన్న వాదనలున్నాయి. అడ్డగోలుగా బాండ్లు పొందిన వ్యక్తులను విచారించి ఆ సొమ్ము విషయమై ప్రశ్నిస్తే, అసలు దోషులు బయటపడే ఆస్కారం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
విజిలెన్స్ గుర్తించిన అక్రమాలు
తిరుపతిలో భూమి విలువను ఎక్కువ చేసి చూపించారు. ఇందుకోసం నివాస స్థలాలను వాణిజ్య ప్రాంతం కింద చూపించడం ద్వారా మార్కెట్ విలువను పెంచి చూపించి దాని ఆఽధారంగా టీడీఆర్ పరిమితిని వినియోగించుకున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.320 కోట్ల భారీ నష్టం జరిగింది..
ఐదు మాస్టర్‌ప్లాన్ రోడ్ల అభివృద్ధిలో భాగంగా తిరుపతి జాయింట్ సబ్‌రిజిస్ర్టార్ వ్యవసాయ భూములకు సంబంధించి 16 టీడీఆర్ బాండ్లను నివాస/ వాణిజ్య రేట్లను ఖరారు చేస్తూ ఇచ్చారు. దీనివల్ల ఖజానాకు 60.17 కోట్లు నష్టం వచ్చింది.
మాస్టర్ ప్లాన్ రోడ్ల విస్తరణలో అప్పగించిన స్థలానికి 1:4 నిష్పత్తిలో టీడీఆర్ బాండ్లను జారీ చేయాల్సి ఉంది. 3 రోడ్ల అభివృద్ధి కోసం 60 టీడీఆర్ బాండ్లను జారీ చేశారు. వాస్తవానికి 1,410 చ.గ. స్థలాన్ని మాత్రమే సేకరించగా, 2,200 చ.గ. విస్తీర్ణానికి బాండ్లు జారీ చేశారు. దీనివల్ల వాస్తవానికి సేకరించిన దానికంటే రూ.6.50 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు అదనంగా జారీ చేశారు.
రెండు మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధి కోసం బఫర్ జోన్లలో ప్రభావితమైన స్థలానికి 1:4 నిష్పత్తిలో 10 బాండ్లు జారీ చేశారు. ఆ జోన్లలో వాస్తవానికి 1000చదరపు మీటర్ల భూమిని సేకరించారు. దీని అసలు విలువ రూ.3.50కోట్లు మాత్రమే. అయితే ఏకంగా రూ.9కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. దీనివల్ల ప్రభుత్వానికి రూ.5.50 కోట్ల మేరకు నష్టం వచ్చింది.
ప్రభుత్వానికి చెందిన స్థలానికే ఏకంగా టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు నేరుగా రూ.2.50 కోట్ల నష్టం ఏర్పడింది. సాధారణంగా ప్రైవేటు వ్యక్తుల నుంచి భూమి సేకరించినప్పుడు మాత్రమే టీడీఆర్ బాండ్లు ఇస్తారు. ఇక్కడ మాత్రం ప్రభుత్వ భూమికే బాండు జారీ చేశారు.
ఎలాంటి అభివృద్ధి పనులు చేయకుండానే టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.5.20 కోట్ల నష్టం ఏర్పడింది.
ఒక గ్రూప్ హౌసింగ్ ప్రాజెక్టులోనే బఫర్ జోన్ అభివృద్ధి కోసం టీడీఆర్ బాండ్లు జారీ చేశారు. దీనివల్ల ఖజానాకు 15 కోట్ల నష్టం వాటిల్లింది.