తిరుపతి కలెక్టర్ ‘శెట్టిపల్లి’ విధానం భేష్!
ABN , Publish Date - May 08 , 2026 | 05:56 AM
కలెక్టర్ల సదస్సులో భాగంగా తమ జిల్లాల్లో పాటించిన ఉత్తమ విధానాలపై కలెక్టర్లు ప్రజంటేషన్ ఇచ్చారు. ‘శెట్టిపల్లి మోడల్ టౌన్‌షిప్’ ప్రాజెక్టు గురించి తిరుపతి కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ వివరించారు.
పాటించాలని కలెక్టర్లకు సీఎం నిర్దేశం
అమరావతి, మే 7(ఆంధ్రజ్యోతి): కలెక్టర్ల సదస్సులో భాగంగా తమ జిల్లాల్లో పాటించిన ఉత్తమ విధానాలపై కలెక్టర్లు ప్రజంటేషన్ ఇచ్చారు. ‘శెట్టిపల్లి మోడల్ టౌన్‌షిప్’ ప్రాజెక్టు గురించి తిరుపతి కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ వివరించారు. ‘తిరుపతికి అత్యంత సమీపంలో ఉన్న గ్రామం శెట్టిపల్లి. సుమారు 636.38 ఎకరాల విస్తీర్ణమున్న ఈ గ్రామాన్ని 1948 చట్టం కింద ఇనామ్ ఎస్టేట్‌గా ప్రకటించి 1979లో ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. సెటిల్‌మెంట్ ప్రక్రియ పూర్తికాపోవడంతో అక్కడి వారికి ఎటువంటి చట్టపరమైన హక్కులు, పట్టాలు దక్కలేదు. ఐదు దశాబ్దాల పాటు ఎటువంటి చట్టబద్ధత లేకుండానే ఆ భూముల్లో క్రయవిక్రయాలు జరిగాయి. 2015-16లో ఈ భూములను సెక్షన్ 22ఏ కింద చేర్చడంతో రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు 2024 జూలై నుంచి ప్రభుత్వం పలు దఫాలుగా చర్చలు జరిపింది. ల్యాండ్ పూలింగ్ విధానంలో భాగంగా సుమారు 223.63 ఎకరాలను లబ్ధిదారులకు కేటాయించి, 65 ఎకరాలను మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థకు అప్పగించాం. పర్యాటక శాఖకు 90 ఎకరాలు కేటాయించాం. అర్హులైన 823 మందికి కనీసం రెండు సెంట్ల స్థలం వచ్చేలా మొత్తం 2,111 ప్లాట్లను లేఅవుట్‌లో రూపొందించాం’ అని కలెక్టర్ తెలిపారు. ఉదయం 7.30 నుంచి 10.30 గంటల వరకూ తిరిగి సాయంత్రం 6 నుంచి 9 గంటల వరకూ ప్రత్యేకంగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నామని చెప్పారు. రోజూ సగటున 200 ప్లాట్ల చొప్పున ఇప్పటికే 1,302 ప్లాట్ల రిజిస్ట్రేషన్ విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. శెట్టిపల్లి టౌన్‌షిప్ ద్వారా లబ్ధిదారులకు సుమారు రూ.1,100 కోట్ల విలువైన ఆస్తి సమకూరడంతో పాటు రిజిస్ట్రేషన్ ఫీజుల మాఫీ ద్వారా రూ.16.25 కోట్ల మేర లబ్ధి చేకూరిందని తెలిపారు. పర్యాటక శాఖకు ఇచ్చిన 90 ఎకరాలతో ప్రభుత్వానికి 400 కోట్లు విలువైన ఆస్తి దక్కిందని వివరించారు. ఈ విధానం అద్భుతమని సీఎం చంద్రబాబు కొనియాడారు. అన్ని జిల్లాల కలెక్టర్లు దీన్ని అమలు చేయాలని సూచించారు.