నేడే తిరుపతిలో భారీ సభ
ABN , Publish Date - Jun 12 , 2026 | 04:29 AM
రాష్ట్రంలో వైసీపీ పాలనకు చరమగీతం పాడి.. కొలువైన కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో శుక్రవారం తిరుపతిలో ....
కూటమి రెండేళ్ల ప్రస్థానంపై నివేదన
సంక్షేమం, అభివృద్ధిని ప్రజల ముందుంచనున్న ప్రభుత్వం
తిరుపతి(టీటీడీ), జూన్ 11(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో వైసీపీ పాలనకు చరమగీతం పాడి.. కొలువైన కూటమి ప్రభుత్వం రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో శుక్రవారం తిరుపతిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఈ రెండేళ్లలో సాధించిన విజయాలు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలు, రాష్ట్ర పునర్నిర్మాణానికి చేపట్టిన కార్యక్రమాలను ప్రజలకు వివరించనున్నారు. తిరుపతి రూరల్ మండలం దామినేడు వద్ద జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ప్రాంతంలో ఉదయం 11 గంటలకు సభ ప్రారంభమవుతుంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరుగుతుంది. సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, కేంద్ర, రాష్ట్రమంత్రులు హాజరు కానున్నారు. ఇప్పటికే పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ల చైర్మన్లు తిరుపతి చేరుకున్నారు. ప్రజలు, లబ్ధిదారులు సభను వీక్షించేందుకు అనువుగా 24 గ్యాలరీలను ఏర్పాటు చేశారు. ప్రధాన వేదికకు కుడి, ఎడమ వైపుల రెండు మినీ వేదికలను ఏర్పాటు చేశారు. అక్కడకు వచ్చినవారు వీక్షించేందుకు అనుగుణంగా ఎల్‌ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేస్తున్నారు. సభ ఏర్పాట్లను హోంమంత్రి అనిత, మంత్రి అనగాని సత్యప్రసాద్, కూటమి నేతలు పరిశీలించారు.
సభా వేదికపై..: వేదికపై చంద్రబాబు, పవన్ కల్యాణ్, మాధవ్, కేంద్ర, రాష్ట్ర మంత్రులు కూర్చుంటారు. స్థానిక ఎంపీ, ఎమ్మెల్యే మాత్రమే వేదికపైన కూర్చునేందుకు అవకాశం కల్పిస్తున్నారు. ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ ఛైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులకు ప్రత్యేక సీటింగ్ ఉంటుంది. మంత్రులు, ఎమ్మెల్యేలతో చంద్రబాబు, పవన్ కలిసి భోజనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎమ్మెల్యేలకు ప్రత్యేక టెంటులో భోజనాలుంటాయి. సభకు వచ్చేవారికి భోజన సౌకర్యం కల్పించేందుకు స్థానిక చంద్రగిరి ఎమ్యెల్యే పులివర్తి నాని ఏర్పాట్లు చేశారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధికి సూచికగా వివిధ పథకాల పేర్లతో 18 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రజలను, సంక్షేమ పథకాల లబ్ధిదారులను తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రభుత్వ ధనం ఉపయోగించరాదని స్పష్టమైన ఆదేశాలివ్వడంతో 162 ఆర్టీసీ బస్సులను అద్దెకు తీసుకున్నారు. వీటికి ముందుగానే నగదు చెల్లించారు. పలు ప్రైవేటు వాహనాలను వినియోగిస్తున్నారు. ఎమ్మెల్యేలను హోటళ్ల నుంచి ప్రాంగణానికి తీసుకొచ్చేందుకు ఎలక్ర్టిక్ బస్సులు వాడనున్నారు. సుమారు 4 ఎకరాల పరిధిలో ప్రత్యేక పార్కింగ్ సౌకర్యం ఏర్పాటు చేశారు. ప్రజలు రహదారిపైన నడిచి వస్తే ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని.. ఇనుప రైలింగులతో ప్రత్యేకంగా దారి ఏర్పాటు చేశారు.