బాండ్లలో బరితెగింపు
ABN , Publish Date - Jul 08 , 2026 | 04:29 AM
తిరుపతిలోని అక్కారంపల్లి మీదుగా గ్రాండ్ వరల్డ్ 80 అడుగుల రోడ్డును మాస్టర్ ప్లాన్ రోడ్ల పథకంలో భాగంగా తలపెట్టారు. దీనికోసం గ్రామంలోని సర్వే నంబరు 11/2బి/2ఎ/2లోని 2 వేల చ.మీటర్ల స్థలానికి..
తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్లలో మర్మాలెన్నో!
వైసీపీ హయాంలో ‘రహదారుల’పై ఆటలు
‘మాస్టర్ ప్లాన్’లో లేకున్నా రోడ్డు.. టీడీఆర్ జారీ
ప్లాన్‌కు భిన్నంగా ఇష్టానుసారం రోడ్ల కుదింపు
కృత్రిమ విలువలు సృష్టించి రూ.కోట్లు జేబులోకి
వ్యవసాయ భూములకు వాణిజ్య మార్కెట్ ధర
పక్క పక్క స్థలాలకు నివాస, వాణిజ్య రేటు
బఫర్ జోన్‌లో 1:2 రూల్.. కానీ 4 రెట్ల చెల్లింపు
మున్సిపల్ అధికారులు, సబ్ రిజిస్ర్టార్ల నిర్వాకం
ఇలాంటి మలుపులు.. మరకలపై ‘ఆంధ్రజ్యోతి’ సమగ్ర కథనం
తిరుపతి మాస్టర్ ప్లాన్ రోడ్ల దందాలో తవ్వినకొద్దీ అక్రమాలు వెలికి వస్తూనే ఉన్నాయి. మాస్టర్ ప్లాన్‌ను అడ్డగోలుగా మార్చివేయడం దగ్గర మొదలుపెట్టి.. యథేచ్ఛగా టీడీఆర్ బాండ్లను జారీచేయడం వరకు, ఈ అక్రమాలు తిరిగిన మలుపులు, అందులోని మర్మాలు విజిలెన్స్ అధికారులనే నివ్వెరపరుస్తున్నాయి. వైసీపీ హయాంలో అప్పటి తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి వేసిన ‘మాస్టర్ ప్లాన్’ ప్రభుత్వ ఖజానాకు రూ. కోట్లలో నష్టం తెచ్చిపెట్టిందని విజిలెన్స్ విచారణలో తేలింది. మొత్తం వ్యవహారంలో ఇప్పటికే మున్సిపల్ అధికారులు, సబ్ రిజిస్ర్టార్ల పాత్రపై విజిలెన్స్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా సమగ్ర నివేదికను సమర్పించారు. తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో వైసీపీ హయాంలో టీడీఆర్ బాండ్ల జారీలో జరిగిన అక్రమాలపై సమగ్ర కథనం..
(అమరావతి, ఆంధ్రజ్యోతి)
తిరుపతిలోని అక్కారంపల్లి మీదుగా గ్రాండ్ వరల్డ్ 80 అడుగుల రోడ్డును మాస్టర్ ప్లాన్ రోడ్ల పథకంలో భాగంగా తలపెట్టారు. దీనికోసం గ్రామంలోని సర్వే నంబరు 11/2బి/2ఎ/2లోని 2 వేల చ.మీటర్ల స్థలానికి ఎన్.రాహుల్‌రెడ్డి, ఎ.వైదేహిలకు 2020లో చ.గజానికి రూ.14,500 నివాస ప్రాంత మార్కెట్ విలువ చొప్పున టీడీఆర్ బాండును జారీచేశారు. అయితే ప్రతిపాదిత రోడ్డు పనులు జరగలేదు. కానీ వారు టీడీఆర్ చ.గజానికి రూ.14వేలు, 16 వేలు, రూ.21 వేల చొప్పున తమ బాండ్లను విక్రయించారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.5 కోట్ల నష్టం వాటిల్లింది. ఒకవేళ మున్సిపల్ అధికారులు టీడీఆర్ బాండు జారీ చేయకుండా ఉంటే...ప్రతిపాదిత ప్రభావిత ప్రాంతానికి ఆనుకొని, భవిష్యత్తులో భవన నిర్మాణ అనుమతి తీసుకునే సమయంలో ఆ స్థలాన్ని ఉచితంగానే వారు మున్సిపల్ అధికారులకు సరెండర్ చేయాల్సి వచ్చేది. ఇలా....వైసీపీ హయాంలో అధికారులు అడ్డగోలుగా టీడీఆర్ బాండ్లను జారీచేసి రూ.కోట్లలో నష్టం కలిగించారు.

రహదారులను కుదించారు..
తిరుపతి మున్సిపాలిటీ పరిధిలోని గొల్లవానిగుంట రోడ్డు వెడల్పును 80 అడుగుల నుంచి 60 అడుగులకు కుదిస్తూ 2021 జూన్ 4న కౌన్సిల్‌లో తీర్మానించారు. ఇందుకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకోలేదు. తదుపరి ఆమోద ఉత్తర్వులు కూడా పొందలేదు. అయినప్పటికీ రోడ్డును కుదించేశారు.
బాండ్లకు బ్యాండ్..
గంగమ్మ గుడి ఆలయం రోడ్డును ఏరియా డెవల్‌పమెంట్ ప్లాన్ ప్రకారం 40 అడుగుల వెడల్పుతో అభివృద్ధి చేశారు. అయితే పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ జీవో ప్రకారం ఈ రోడ్డు మాస్టర్ ప్లాన్‌లో ఆమోదం పొందలేదు. అయినప్పటికీ పనులు చేపట్టడంతోపాటు, రోడ్డు అభివృద్ధిలో భాగంగా ప్రైవేటు వ్యక్తులకు టీడీఆర్ బాండ్లు సైతం జారీ చేశారు.
నాలుగు రెట్ల ‘దోపిడీ’
బఫర్ జోన్లలో అర్హత ఉన్న వాటికి 1:2 నిష్పత్తిలో టీడీఆర్ బాండ్లు ఇవ్వాలి. ఈ నిబంధనను ఉల్లంఘిస్తూ బఫర్ జోన్లలో ప్రభావితమైన స్థలానికి 1:4 నిష్పత్తిలో బాండ్లు జారీ చేశారు. అక్కారంపల్లిలోని 119/17, 129/6 సర్వే నంబర్లు; తిమ్మినాయుడుపాలెం లోని 331/7, 332/2ఏ సర్వే నంబర్లలో 10 మీటర్ల కంటే తక్కువ వెడల్పు ఉన్న కాలువ/వాగు ఉంది. ఇది ప్రతిపాదిత 40 అడుగుల అక్కారంపల్లి రోడ్డును దాటుకుంటూ వెళ్తోంది. ఈ పొలం కాలువ/వాగుకు ఇరువైపులా రెండు మీటర్ల వరకు బఫర్ జోన్ వర్తిస్తుంది. రోడ్డు విస్తరణలో కోల్పోయిన స్థలంలో కొంతభాగం ఈ బఫర్ జోన్ పరిధిలోకి వచ్చినా, మున్సిపల్ అధికా రులు నిబంధనలు అతిక్రమించి 1:2 నిష్పత్తిలో కాకుండా 1:4 నిష్పత్తిలో బాండ్లు జారీ చేశారు. ఈ రెండు రోడ్ల అభివృద్ధి కోసం 10 టీడీఆర్ బాండ్లను జారీ చేశారు. బఫర్ జోన్ల పరిధిలో సేకరించిన వెయ్యి చ.మీటర్ల స్థలానికి వాస్తవానికి రూ.3.50 కోట్ల బాండ్లు ఇవ్వాలి. కానీ రూ.9 కోట్ల బాండ్లు ఇచ్చారు. ప్రభుత్వానికి రూ.5.50 కోట్ల నష్టం వాటిల్లింది.
ఇదేం ‘అప్రోచ్’?
కె.అన్నపూర్ణ అనే మహిళతోపాటు మరికొందరి పేరుతో 2005లో ఎల్.పి.నెం 17/జీ1/2005 ద్వారా 50 అడుగుల వెడల్పు అప్రోచ్ రోడ్డుతో జన చైతన్య లేఅవుట్‌కు ఆమోదం పొందారు. కొంక చెన్నయ్యగుంట 100 అడుగుల రోడ్డు అభివృద్ధి పనులప్పుడు సర్వే నెం. 165/2బీలోని స్థలానికి అన్నపూర్ణ పేరుమీద టీడీఆర్ బాండు జారీ చేశారు. 2266.23 చ.మీటర్ల స్థలాన్ని ప్రభుత్వానికి అప్పగించి.. 9064.92 చ.మీటర్ల విస్తీర్ణానికి బాండ్ల రూపంలో పరిహారం పొందారు. అయితే 2266.23 చ.మీటర్ల రోడ్డులో అప్పటికే ఉనికిలో ఉన్న అప్రోచ్ రోడ్డుకు చెందిన 139.35 చ.మీటర్ల స్థలం కూడా కలిసి ఉంది. అన్నపూర్ణకు చ.గజానికి రూ. 25వేల చొప్పున వాణిజ్య ధరతో బాండు జారీ చేశారు. వాస్తవంగా ఇక్కడ 100 అడుగుల రోడ్లు కొత్తగా వేస్తున్నారు. ఆ ప్రాంతాన్ని పరిశీలించకుండా లబ్ధిదారు సమర్పించిన సమాచారం ఆధారంగానే వాణిజ్య ప్రాంతంగా పేర్కొంటూ, తిరుపతి జాయింట్ సబ్ రిజిస్ర్టార్ ‘‘మార్కెట్ వాల్యూ సర్టిఫికెట్’లో వాణిజ్య ధర ఇచ్చారు. వాస్తవానికి అప్పటి నివాసిత మార్కెట్ విలువ చ.గజానికి రూ.11వేలు మాత్రమే. ఆ తర్వాత టీడీఆర్ బాండును అన్నపూర్ణ, ఇతరులకు చ.గజానికి రూ.27,500 చొప్పున విక్రయించారు. అమ్మకం జరిగిన సమయంలోనూ నివాసిత మార్కెట్ విలువ చ.గజానికి కేవలం రూ.13వేలే. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.2 కోట్ల నష్టం వచ్చింది. కొంకచెన్నయ్యగుంటలోని సర్వే నెం.174/2లో కె.సుబ్రహ్మణ్యంరెడ్డి అనే వ్యక్తి పేరుతో 1012/000133/టీడీఆర్/కె/2022 నంబరుతో బాండు జారీ చేశారు. ఇక్కడ ఆయనకు చెందిన 780 చ.మీటర్ల స్థలానికి రూ.11వేల చొప్పున బాండు ఇచ్చారు. తర్వాత సుబ్రహ్మణ్యంరెడ్డి ఆ బాండును చ.గజానికి రూ.28వేల చొప్పున ఇతరులకు విక్రయించారు. ఆ సమయంలో అక్కడ మార్కెట్ విలువ చ.గజానికి రూ.13వేలే ఉంది. ఖజానాకు రూ.1.5 కోట్ల నష్టం వచ్చింది.
ఖజానాకు కోట్లలో నష్టం
పూలవానిగుంట 80 అడుగుల రోడ్డులో అక్కారంపల్లిలోని సర్వే నంబరు 48లోని స్థలాలకు పులిగోరు నిరంజన్‌రెడ్డి, పులిగోరు మహేశ్వరరెడ్డిల పేరు మీద టీడీఆర్ బాండ్లను జారీ చేశారు. చదరపు గజానికి రూ.37వేల వాణిజ్య ధర మేరకు ఆరు వేల చ.మీటర్లు (7175.94 చ.గజాలు), 12 వేల చ.మీటర్ల (14351.881 చ.గజాలు) విస్తీర్ణానికి బాండ్లు ఇచ్చారు. కానీ బాండ్లు జారీ చేసిన భూమి వ్యవసాయ భూమి. పులిగోరు నిరంజన్‌రెడ్డి 6500 చ.మీటర్ల (7773.935 చ.గజాలు) టీడీఆర్ విస్తీర్ణాన్ని చ.గజానికి రూ.37వేల చొప్పున, పులిగోరు మహేశ్వరరెడ్డి 11వేల చ.మీటర్ల (13155.891 చ.గజాలు) టీడీఆర్ విస్తీర్ణాన్ని చదరపు గజానికి రూ.37వేల చొప్పున ఇతరులకు విక్రయించారు. ఈ అమ్మకాలు జరిగిన సమయంలో అక్కడ మార్కెట్ విలువ కేవలం రూ.26వేలు మాత్రమే. ఫలితంగా ఖజానాకు రూ.24 కోట్ల నష్టం ఏర్పడింది.
ఏరియా అదే.. విలువలు వేర్వేరు..
హీరో హోండా 60 అడుగుల రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా తిరుపతి గ్రామంలోని సర్వే నంబరు 1/1బీలోని స్థలానికి కంచి రాము అనే వ్యక్తికి 13,155.891 చ.గజాల విస్తీర్ణానికి బాండు జారీ చేశారు. లబ్ధిదారులు సమర్పించిన ఇంటి నంబరు ఆధారంగా జాయిట్ సబ్‌రిజిస్ర్టార్ మార్కెట్ విలువ ధ్రువీకరణ పత్రంలో వాణిజ్య విలువగా ఇచ్చారు. కంచి రాము 8969.925 చ.గజాల విస్తీర్ణాన్ని చ.గజానికి రూ.64వేల చొప్పున ఇతరులకు విక్రయించారు. వాస్తవానికి 2023లో ఆ అమ్మకం జరిగిన సమయంలో అక్కడ నివాసిత ప్రాంత మార్కెట్ విలువ చ.గజానికి రూ.32వేలు మాత్రమే. ఖజానాకు రూ.30కోట్ల నష్టం ఏర్పడింది. ఇదే పద్ధతిలో లబ్ధిదారులు 300 టీడీఆర్ బాండ్లను కృత్రిమ మార్కెట్ విలువలకు విక్రయించి/బదిలీ చేసి వదిలించుకున్నారు. దీనివల్ల ప్రభుత్వ ఖజానాకు రూ.320 కోట్ల మేరకు భారీ నష్టం ఏర్పడింది.
అక్రమాల్లో మరి కొన్ని..
గొల్లవానిగుంట 60 అడుగుల రోడ్డు అభివృద్ధి పనుల కోసం ఎం.శిరీష్ అనే వ్యక్తి పేరుతో 300 చ. మీటర్ల విస్తీర్ణానికి బాండు జారీచేశారు. అయితే శిరీషికు చెందిన సొంత స్థలాన్ని తీసుకోలేదు. అయినప్పటికీ చ.గజానికి రూ.15వేలు నివాస ప్రాంత మార్కెట్ విలువతో టీడీఆర్ బాండు జారీ చేశారు. ఐదు మాస్టర్ ప్లాన్ రోడ్ల అభివృద్ధి పనుల్లో వ్యవసాయ భూములకు తిరుపతి జాయింట్ సబ్‌రిజిస్ర్టార్, రేణిగుంట సబ్‌రిజిస్ర్టార్ నిబంధనలకు విరుద్ధంగా నివాస, వాణిజ్య ప్రాంత ధరలతో 18 టీడీఆర్ బాండ్లను జారీ చేశారు. ఖజానాకు రూ.60 కోట్ల నష్టం తెచ్చారు. కాగా, మూడు రోడ్ల అభివృద్ధి కోసం 60 బాండ్లు జారీ చేశారు. ఇందుకోసం 1410 చ.గజాలు మాత్రమే సేకరించారు. అయితే 2200 చ.గజాల విస్తీర్ణానికి బాండ్లను జారీ చేశారు. అంటే సేకరించని 790 చ.గజాల అదనపు స్థలానికి ఏకంగా రూ.6.50 కోట్ల విలువైన టీడీఆర్ బాండ్లను అదనంగా ఇచ్చారు.