తిరుపతి శెట్టిపల్లి భూముల కేసులో ఇద్దరిపై వేటు
ABN , Publish Date - Feb 27 , 2026 | 03:46 AM
అత్యంత విలువైన తిరుపతి శెట్టిపల్లి ఎస్టేట్ భూములను దొడ్డిదారిన ప్రైవేటుపరం చేద్దామనుకున్న వ్యవహారంపై సర్కారు కన్నెర్ర చేసింది.
సూపరింటెండెంట్, సీనియర్ అసిస్టెంట్ సస్పెన్షన్
సెటిల్‌మెంట్ కమిషనర్ ఉత్తర్వులు
‘ఆంధ్రజ్యోతి’ కథనంపై స్పందన
అమరావతి, ఫిబ్రవరి 26 (ఆంధ్ర జ్యోతి): అత్యంత విలువైన తిరుపతి శెట్టిపల్లి ఎస్టేట్ భూములను దొడ్డిదారిన ప్రైవేటుపరం చేద్దామనుకున్న వ్యవహారంపై సర్కారు కన్నెర్ర చేసింది. సెటిల్‌మెంట్ కమిషనరేట్‌లోని ఇద్దరు అధికారులను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. తదుపరి విచారణకు ఆదేశించింది. ‘రెవెన్యూలో ఇంటిదొంగ’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’ గురువారం వార్తను ప్రచురించిన సంగతి తెలిసిందే. తిరుపతి రూరల్ మండలంలోని శెట్టిపల్లిలో రూ.500 కోట్ల విలువైన 40 ఎకరాల భూమిని ప్రైవేటు పరం చేద్దామన్న పన్నాగాన్ని వెలుగులోకి తీసుకొచ్చింది. తిరుపతి సెటిల్‌మెంట్ అధికారిగా జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఉత్తర్వులను అడ్మిట్ చేసుకోవడానికి బదులుగా తిరస్కరించేలా రాష్ట్ర సెటిల్‌మెంట్ కమిషనర్ వద్ద ఫైలు నడిపారు. ప్రైవేటుకు లబ్ధి చేకూర్చడానికి సర్వే, సెటిల్‌మెంట్‌లోని ఓ అధికారి ప్రైవేటు పార్టీని ఏకంగా ఆఫీసు పరిసరాలకే పిలిచి బేరసారాలు ఆడినట్లుగా విచారణలో తేలింది. జేసీ ఇచ్చిన ఆదేశాలను తిరస్కరించేలా ఫైలు పెట్టిన విషయాన్ని సెటిల్‌మెంట్ కమిషనర్ కూర్మనాథ్ గుర్తించి ఆ ఫైలును పక్కనపెట్టారు. ఈ విషయం తెలుసుకున్న ప్రైవేటు వ్యక్తి ఆఫీసులోకి వచ్చి అధికారులతో మంతనాలు జరిపినట్లుగా గుర్తించారు. ‘‘కావాల్సినంత ఇస్తాం.. తీసుకోండి. ఫైలును ఎందుకు పక్కనపెట్టారు? ఏం కావాల్నో అడగండి. వెళ్లి మాట్లాడండి. ఫైలును ఓకే చేయించండి ’’ అని మంతనాలు జరిపిన విషయం ఉన్నతాధికారులకు తెలిసి బాధ్యులపై క్రమశిక్షణ చర్యలకు వెంటనే ఫైలు పెట్టాల్సిందిగా ఆదేశించారని సమాచారం. ఈ విషయంలో మరో అధికారి తలదూర్చి సస్పెన్షన్‌ను అడ్డుకునేందుకు బేరసారాలు చేశారు.
సీరియస్ చర్యలు వద్దని సెటిల్‌మెంట్ కమిషనర్‌పై ఉన్నతస్థాయిలో ఒత్తిళ్లు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఓ ఉద్యోగ సంఘం నేతతోనూ రాయబారాలు నడిపించారు. జరిగిన తప్పు తీవ్రమైనది కావడంతో ఈ వ్యవహారంలో బాధ్యులైన ఓ సూపరింటెండెంట్‌ను, మరో సీనియర్ అసిస్టెంట్‌ను సస్పెండ్ చేస్తూ సెటిల్‌మెంట్ కమిషనర్ ఆదేశాలు ఇచ్చారు. ‘విధి నిర్వహణలో తప్పుడు ప్రవర్తన, రికార్డులను తారుమారు చేయడం, ఉన్నతాధికారులను తప్పుదోవపట్టించేలా అవాస్తవాలను ప్రజెంటేషన్ చేయడం’ అన్న అభియోగాలపై ఇద్దరిని సస్పెండ్ చేసినట్లు తెలిసింది. ఇదిలాఉంటే, ఈ పరిణామంపై ప్రభుత్వం తక్షణమే స్పందించింది. ఏం జరుగుతోందంటూ ఆరాతీసింది. శెట్టిపల్లి భూముల విషయంలో ఎలాంటి తప్పు జరగకుండా చర్యలు తీసుకోవాలని సెటిల్‌మెంట్ కమిషనర్‌ను ప్రభుత్వం ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు సెటిల్‌మెంట్ కమిషనర్ కూర్మనాథ్ గురువారం తిరుపతి రూరల్ తహశీల్దార్, ఇతర రెవెన్యూ అధికారులను పిలిచి సమీక్ష నిర్వహించినట్లు సమాచారం.