ఎవరు చెబితే కిడ్నాప్ చేశారు?
ABN , Publish Date - Feb 22 , 2026 | 04:28 AM
విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) పీఆర్వో సతీశ్ (ఏ1), క్రమశిక్షణ విభాగం ఇన్‌చార్జి మునిచంద్ర (ఏ12), వాహనాల ఇన్‌చార్జి వాసు(ఏ17)ను ఐదు రోజుల పోలీసు కస్టడీకి...
పోలీస్ కస్టడీలో ఎంబీయూ పీఆర్వో, మరో ఇద్దరికి ప్రశ్నలు
తిరుపతి కోర్టు అనుమతితో ఐదు రోజుల పోలీస్ కస్టడీకి
తిరుచానూరు, ఫిబ్రవరి 21 (ఆంధ్రజ్యోతి): విద్యార్థి నేతల కిడ్నాప్ కేసులో మోహన్‌బాబు యూనివర్సిటీ (ఎంబీయూ) పీఆర్వో సతీశ్ (ఏ1), క్రమశిక్షణ విభాగం ఇన్‌చార్జి మునిచంద్ర (ఏ12), వాహనాల ఇన్‌చార్జి వాసు(ఏ17)ను ఐదు రోజుల పోలీసు కస్టడీకి ఇస్తూ తిరుపతి న్యాయస్థానం శనివారం ఉత్తరులిచ్చింది. ఆమేరకు ఈ ముగ్గురినీ ఏఎస్పీ రవిమనోహరాచారి ఆధ్వర్యంలో చంద్రగిరి డీఎస్పీ ప్రసాద్, సీఐ సునీల్‌కుమార్ బృందం కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ధర్నా చేయడానికి వెళుతున్న విద్యార్థి సంఘం నేతలను ఎందుకు కిడ్నాప్ చేశారు? ఎవరుచెబితే ఈ పనిచేశారు? అసలు మీ ఉద్దేశం ఏమిటి..? అనే ప్రశ్నలు వేసి నిందితుల నుంచి సమాధానాలు రాబట్టినట్లు తెలిసింది. ఇదిలా ఉండగా.. ఇదే కేసులో ఏ3గా ఉన్న మంచు విష్ణుకు నోటీసులు ఇచ్చినా.. ఇంతవరకు విచారణకు హాజరు కాలేదని సీఐ సునీల్‌కుమార్ తెలిపారు. తిరుపతి కలెక్టరేట్ వద్ద ధర్నా చేయడానికి వెళుతున్న ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా కార్యదర్శి అలీ అక్బర్, ఉపాధ్యక్షుడు వినోద్‌ను తిరుచానూరు వద్ద కిడ్నాప్ చేసిన వ్యవహారంలో ఎంబీయూ పీఆర్వో సతీశ్, మోహన్‌బాబు, మంచు విష్ణుతో పాటు మరో 20మందిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. కాగా, ఏ2 మోహన్‌బాబుకు అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు ఈ నెల 17న జరిగిన విచారణలో హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణ మార్చి 3న జరగనుంది.