Share News

‘కల్తీ’లో హవాలా

ABN , Publish Date - Feb 08 , 2026 | 03:52 AM

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం ఓ అంతులేని కథలా సాగుతోంది! పాలే లేకుండా నెయ్యి తయారుచేసి దాదాపు రూ.250 కోట్ల విలువైన 60 లక్షల కిలోలు సరఫరా చేసిన కుట్రలో విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి.

‘కల్తీ’లో హవాలా

  • మాఫియా రాకెట్‌ను తలదన్నేలా హవాలా డీల్స్‌

  • భోలే బాబా నుంచి విడతలవారీగా మళ్లింపు

  • అందులో కొంత తిరిగి భోలే బాబాకు

  • ఢిల్లీ, బెజవాడ, గ్వాలియర్‌, చెన్నై మీదుగా తిరుపతికి చేరిన 21 కోట్ల సొమ్ము

  • వైష్ణవి సీఈవో చావ్డాకు 19.86 కోట్లు

  • అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లిందో?

  • మంగళం దగ్గరే మంగళం పాడేశారు

  • అంతిమ లబ్ధిదారుడెవరో కనిపెట్టని సిట్‌

  • కమీషన్‌ ఏజెంట్‌ శ్రీనివాసన్‌కు 31 లక్షలు

  • టీటీడీ డెయిరీ నిపుణుడు విజయభాస్కర్‌రెడ్డికి 75 లక్షలు.. ఇందులో 34 లక్షలు సిట్‌ సీజ్‌

తమ తరఫున టీటీడీకి కల్తీనెయ్యి సరఫరా చేసినందుకు భోలే బాబా డెయిరీ నిర్వాహకులు రూ.19.86 కోట్లను హవాలా మార్గంలో వైష్ణవి డెయిరీ సీఈవో అపూర్వ చావ్డాకు పంపారు. తిరుపతిలోని మంగళం ఏరియాలో ఉన్న ఆయన ఇంటికి ఈ సొమ్ము చేరింది. తొలుత డబ్బును ఢిల్లీలో హవాలా ఏజెంట్‌ ఆశీష్‌ అగర్వాల్‌కు, ఆయన నుంచి మరో ఏజెంట్‌ పటేల్‌ లాలా భాయ్‌కు చేర్చగా.. లాలా భాయ్‌ ఆ నగదును తన మరో ముగ్గురు ఏజెంట్లకు చేర్చి వారి ద్వారా విడతల వారీగా చావ్డాకు పంపించారు. సిట్‌ ఇంత వరకే నిర్ధారించినట్లు తెలిసింది.

నిజానికి టీటీడీకి నెయ్యి సరఫరా చేసినందుకు బిల్లులు దేవస్థానం నుంచే వైష్ణవి డెయిరీకి వచ్చాయి. కానీ డబ్బులు భోలే బాబా నుంచి హవాలా మార్గంలో వైష్ణవి డెయిరీ సీఈఓ చావ్డాకు చేరాయి. అంటే.. తెరవెనక ఆ డబ్బులు ఎవరి కోసమో పంపించారన్నది స్పష్టం. తిరుపతి దాకా చేరిన రూ.19.86 కోట్లు ఆ తర్వాత ఎక్కడికి వెళ్లాయి? ఆ డబ్బును చావ్డా ఎవరికి అందించారు? ఆ అంతిమ లబ్ధిదారుడు ఎవరు? అన్నది మిస్టరీగా మారింది. హవాలాతో సంబంధం లేకుండా నాటి టీటీడీ చైర్మన్‌ వైవీ పీఏ చిన్నఅప్పన్న ఖాతాలో రూ.4.6 కోట్లు వచ్చిపడ్డాయి. ఆయనకంటే ‘పెద్దవారికి’ ఇచ్చేందుకు పెద్ద మొత్తంలో డబ్బును చావ్డాకు పంపించారా? ఈ ప్రశ్నకు సమాధానం కనిపెట్టాల్సింది సీబీఐ నేతృత్వంలోని సిట్‌నే.


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

తిరుమల కల్తీ నెయ్యి వ్యవహారం ఓ అంతులేని కథలా సాగుతోంది! పాలే లేకుండా నెయ్యి తయారుచేసి దాదాపు రూ.250 కోట్ల విలువైన 60 లక్షల కిలోలు సరఫరా చేసిన కుట్రలో విస్తుపోయే నిజాలు వెల్లడవుతున్నాయి. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో కల్తీ నెయ్యి కుట్రలో హవాలా రాకెట్‌ బట్టబయలైంది. కల్తీ చేసిన నెయ్యిని టీటీడీకి అంటగట్టడంలో జరిగిన అక్రమాలను సీబీఐ సిట్‌ నిగ్గు తేల్చింది. కల్తీ నెయ్యిని సరఫరా చేయాలన్న ముందస్తు కుట్రను అమలు చేసి తద్వారా వచ్చిన సొమ్మును హవాలా మార్గంలో నడిపించి పంచుకున్నారు. ఢిల్లీ, విజయవాడ మీదుగా తిరుపతికి సాగిన హవాలా మార్గంలో తిరుపతిలోని మంగళం వద్ద ఉన్న ఓ ఇంటికి 20 కోట్ల సొమ్ము చేరింది. అతిస్వల్ప మొత్తం టీటీడీ డెయిరీ నిపుణుడు విజయభాస్కర్‌రెడ్డికి, మరికొంత కమిషన్‌ ఏజెంటు శ్రీనివాసన్‌కు వెళ్లింది. నికరంగా 19.86 కోట్ల రూపాయలు వైష్ణవి డెయిరీ సీఈఓ అపూర్వ చావ్డాకు చేరినట్లు నిర్ధారణ అయింది. ఆ తర్వాత అక్కడి నుంచి డబ్బు ఎక్కడికి వెళ్లిందన్నది మాత్రం పెద్ద మిస్టరీనే. అంతిమ లబ్ధిదారుడు ఎవరన్నది సిట్‌ కనిపెట్టలేకపోయింది. మాఫియా రాకెట్‌ను తలదన్నెలా ఈ హవాలా బాగోతం సాగింది. చుక్కపాలు కూడా సేకరించని భోలే బాబా డెయిరీ తిరుమలకు స్వచ్ఛమైన ఆవుపాల నెయ్యి సరఫరా చేస్తామని టెండర్‌ దక్కించుకోవడమే ఓ పెద్ద కుట్ర. ఈ కుట్రను అమలు చేయడంలో, హవాలా రాకెట్‌లో భోలేబాబా నిర్వాహకులు పొమిల్‌ జైన్‌(ఏ3), విపిన్‌ జైన్‌ (ఏ4)లు ఎవరెవరిని భాగస్వాములు చేశారు? కల్తీకి అవసరమైన రసాయనాలు, ఇతర నూనెలను ఎక్కడెక్కడ కొన్నారు? ఎక్కడెక్కడ దొంగ బిల్లులు సృష్టించారు? నెయ్యి సరఫరా కాంట్రాక్టులో డబ్బులు ఏయే మార్గాల్లో తిరుపతిలోని అపూర్వ చావ్డాకు చేరాయి? అన్నదే హవాలా రాకెట్‌లోని అసలు గుట్టు.


భోలే బాబా నుంచి భోలే బాబాకు

హవాలా రాకెట్‌ను భోలే బాబా నిర్వాహకులైన పొమిల్‌జైన్‌, విపిన్‌జైన్‌లు ముందుండి నడిపారు. ఇందులో ఆశీష్‌ అగర్వాల్‌ అనే వ్యక్తి (ఏ15) కీలకం. ఆయన ఓ హవాలా ఏజెంటు. పాత ఢిల్లీలో చాందినీ చౌక్‌లోని కుచా గచీరామ్‌లో ఆయనకు ఓ హవాలా దుకాణం(షాప్‌ నంబరు 304) ఉంది. భోలే బాబా నిర్వాహకులు నెయ్యిని ఆశీష్‌ అగర్వాల్‌ నుంచి కొన్నట్లుగా తప్పుడు పత్రాలు సృష్టించారు. భోలా బాబా బ్యాంకు ఖాతాల నుంచి ఆశీష్‌ అగర్వాల్‌కు నగదు చె ల్లింపులు జరిగాయి. తనకొచ్చిన డబ్బును ఆయన బ్యాంకుల నుంచి విత్‌డ్రా చేసి హవాలా మార్గంలో వ్యవహారం నడిపించారు. ఆ డబ్బును తొలుత రాధేశ్యామ్‌ ఓజా నడిపిస్తున్న హవాలా దుకాణం (నంబరు 287)కు చేర్చారు. ఆ తర్వాత డబ్బును అదే ప్రాంతంలో ఉన్న మరో హవాలా దుకాణం (షాప్‌ నంబరు 18బీ)కి చేర్చారు. ఇది రిషబ్‌జైన్‌ అనే వ్యాపారిది. ఇక్కడి నుంచి డబ్బును గ్వాలియర్‌కు చెందిన దీపక్‌జైన్‌కు చేర్చారు. ఆయనకు డబ్బు చేర్చడం వెనుక ఓ కారణం ఉంది. భోలే బాబా డెయిరీ కల్తీ నెయ్యి తయారీకి ముందు రిఫైన్డ్‌ ఫామ్‌కెర్నెల్‌ ఆయిల్‌, పామోలిన్‌లు సమకూర్చుకున్నది. వీటిని దీపక్‌ జైన్‌కు డైవర్ట్‌ చేశారు. అయితే భోలే బాబాకే చెందిన కంపెనీలు హార్ష్‌ ట్రేడింగ్‌ కో, హార్ష్‌ ఫ్రెష్‌ డెయిరీ ఫుడ్జ్‌ నుంచి దీపక్‌జైన్‌ వాటిని కొనుగోలు చేసినట్లుగా తప్పుడు బిల్లులు సృష్టించారు. అందుకే దీపక్‌జైన్‌ తనకు హవాలా మార్గంలో చేరిన డబ్బును తిరిగి వైట్‌గా మార్చి భోలే బాబాకు బిల్లుల చెల్లింపు పేరిట అధికారికంగా బ్యాంకు ఖాతాల ద్వారా పంపించారు.


ఎప్పుడెప్పుడంటే..

  • 2024 జనవరి, ఫిబ్రవరి, మార్చి, జూన్‌, జూలై నెలల్లో కలిపి మొత్తం 12.55 కోట్ల రూపాయలను అపూర్వ చావ్డా తీసుకున్నారు.

  • పటేల్‌ లాలా భాయ్‌కు చెందిన మరో ఏజెంటు మదరమ్‌ దేవాసి (చెన్నై) నుంచి 2023- 24 సంవత్సరాల్లో చావ్డా 7.31 కోట్ల రూపాయలను హవాలా మార్గంలో తీసుకున్నారు. ఇవన్నీ భోలే బాబా నిర్వాహకులు పంపించిన సొమ్మే.

  • చావ్డాకు మొత్తం 19.86 కోట్ల రూపాయలు చేరింది. కొన్ని సందర్భాల్లో ఆయనే నేరుగా హవాలా ఏజెంట్ల వద్దకు వెళ్లి డబ్బు తీసుకోగా, మరికొన్ని సార్లు హవాలా ఏజెంట్లు తిరుపతిలోని ఆయన ఇంటి కి డబ్బు చేర్చారు.


టీటీడీ డెయిరీ నిపుణుడికి సొమ్ము

హవాలా డబ్బు అందుకున్న వారిలో నాటి టీటీడీ డెయిరీ నిపుణుడు మద్ది విజయభాస్కర్‌రెడ్డి కూడా ఉన్నారు. హైదరాబాద్‌లోని హవాలా ఏజెంటు అర్జున్‌ గోస్వామి ద్వారా భోలే బాబా నిర్వాహకులు విజయభాస్కర్‌రెడ్డికి 75 లక్షల రూపాయలు పంపించారు. మూడు దఫాలుగా ఈ నగదు చేరింది. వైష్ణవీ డెయిరీ ద్వారా టీటీడీకి కల్తీనెయ్యి సరఫరా అయ్యేలా సహకరించినందుకు ఈ నజరానా ఇచ్చారు. సిట్‌ విచారణ మొదలయ్యాక ఈ విషయం గుర్తించి, తనిఖీల సందర్భంగా 34 లక్షల నగదును సిట్‌ సీజ్‌ చేసింది. కమిషన్‌ ఏజెంట్‌ ద్వారా మేనేజ్‌మెంట్‌పి.పి.శ్రీనివాసన్‌ అనే కమిషన్‌ ఏజెంటుకు కూడా భోలే బాబా డెయిరీ నుంచి 31.40 లక్షల నగదు అందింది. చె న్నైలో ఉండే మదరమ్‌ దేవాసి అనే హవాలా ఏజెంటు ద్వారా ఆయనకు ఈ డబ్బు చేరింది. ఈ డబ్బును శ్రీనివాసన్‌తో పాటు కల్తీనెయ్యికి అన్ని విధాలుగా సహకరించిన టీటీడీలోని అధికారులు, ఉద్యోగులకు ఇవ్వాలని భోలే బాబా నిర్వాహకులు పంపించారు.


హవాలా సొమ్ము తిరుపతికి

హవాలా రాకెట్‌లో మరో కోణం ఉంది. ఆశీష్‌ అగర్వాల్‌ మరికొంత డబ్బును పటేల్‌ లాలా భాయ్‌కు చెందిన హవాలా దుకాణం (షాప్‌ నంబర్‌ 309-1బీ)కు పంపించారు. ఆయన దగ్గర ఏవో ముడిపదార్థాలు కొనుగోలు చేసినట్లుగా బిల్లులు సృష్టించారు. ఆ బిల్లుల చెల్లింపు పేరిట సొమ్మును పంపించారు. తనకందిన డబ్బును పటేల్‌ లాలా భాయ్‌ తన ముగ్గురు హవాలా ఏజెంట్లకు పంపించారు. వారిలో విజయవాడలోని భార త్‌ భాయ్‌ ఠాకూర్‌, చెన్నైలోని మదరమ్‌ దేవాసి, హైదరాబాద్‌కు చెందిన అర్జున్‌ గోస్వామి ఉన్నారు. వైష్ణవీ డెయిరీ అనేది కూడా కల్తీనెయ్యి సరఫరాలో కీలకపాత్రధారి. తిరుపతికి భోలే బాబా తరఫున నెయ్యి సరఫరా చేసిన వాటిలో వైష్ణవీ డెయిరీ కూడా ఉంది. దాని సీఈఓనే తిరుపతిలోని మంగళం ఏరియాలో ఉన్న అ పూర్వ చావ్డా. పటేల్‌ లాలా భాయ్‌కు చెందిన హవాలా ఏజెంట్లను అపూర్వ చావ్డా 2023-24 సంవత్సరాల వ్యవధిలో పలుమార్లు కలిశారు. వారి వద్ద నుంచి 19. 86 కోట్ల రూపాయలను తీసుకెళ్లిపోయారు. విజయవాడలో హవాలా ఏజెంటు భార త్‌ భాయ్‌ ఠాకూర్‌ వద్దకు అపూర్వ చావ్డా పలుమార్లు వెళ్లి డబ్బు తీసుకున్నారు.

ఎవరీ అపూర్వ చావ్డా?

అపూర్వ చావ్డా గుంటూరులోని ఓ మిర్చి వ్యాపారి. తర్వాత ఆయన వైష్ణవి డెయిరీ సీఈఓగా వచ్చారు. భోలే బాబా నిర్వాహకులు పొమిల్‌ జైన్‌, విపిన్‌ జైన్‌లతో ఉన్న పరిచయాలతో కల్తీనెయ్యిలో వేలుపెట్టారు. గతంలో భోలే బాబా డెయిరీకి తిరుమలకు నెయ్యి సరఫరా కాంట్రాక్టు దక్కింది. తనకంత సామర్థ్యం లేదు కాబట్టి వైష్ణవి డెయిరీకి సబ్‌ కాంట్రాక్టు ఇప్పించారు. ఈ డెయిరీ నుంచి కూడా కల్తీ నెయ్యి తిరుమలకు సరఫరా అయిందని సిట్‌ తేల్చింది.

Updated Date - Feb 08 , 2026 | 09:50 AM