Share News

పోలీస్‌ స్టేషన్‌లో ఇంటి దొంగ!

ABN , Publish Date - Feb 28 , 2026 | 05:23 AM

తిరుపతి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే ఓ కానిస్టేబుల్‌ బాధితులకు అప్పగించాల్సిన బంగారు నగలు తాకట్టు పెట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి.

పోలీస్‌ స్టేషన్‌లో ఇంటి దొంగ!

  • బాధితులకు అప్పగించాల్సిన బంగారు నగలు తాకట్టు.. అధికారుల హెచ్చరికలతో రెండు రోజుల్లో తిరిగి జమ

  • గతంలోనూ రికవరీ సొమ్ము నుంచి రూ.50 వేలు స్వాహా

  • ట్రెజరీకి చెల్లించాల్సిన ట్రాఫిక్‌ చలాన్ల మొత్తం మాయం

  • తిరుపతి రూరల్‌ స్టేషన్‌ కానిస్టేబుల్‌పై ఆరోపణలు

  • ఎస్పీ దృష్టికి వెళ్లకుండా తొక్కిపెట్టిన ఎస్‌బీ సిబ్బంది

తిరుపతి(నేరవిభాగం), ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): తిరుపతి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసే ఓ కానిస్టేబుల్‌ బాధితులకు అప్పగించాల్సిన బంగారు నగలు తాకట్టు పెట్టినట్టు ఆరోపణలు వస్తున్నాయి. గతంలోనూ ఆయన రూ.50వేల రికవరీ సొమ్ముతో పాటు ట్రాఫిక్‌ చలాన్ల మొత్తాన్ని కూడా నొక్కేశారని పోలీసు వర్గాలే ఆరోపిస్తున్నాయి. దొంగల నుంచి రికవరీ చేసిన నగదు, నగలను వాటి సొంతదారులకు కోర్టు ద్వారానే పోలీసులు అప్పగిస్తారు. దీనికి సంబంధించిన ప్రక్రియ పూర్తయ్యేవరకు చోరీ సొత్తు ఆయా పోలీస్‌ స్టేషన్లలోనే భద్రపరుస్తారు. ప్రతీ స్టేషన్‌లోనూ ఎంతో కొంత మొత్తం రికవరీ సొత్తు ఉండటం సాధారణమే. ఇలాగే తిరుపతి రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఉన్న రికవరీ సొత్తు నుంచి సుమారు రూ.12 లక్షలు విలువజేసే 90 గ్రాముల బంగారు నగలు మాయమైనట్టు విశ్వసనీయ సమాచారం. అప్రమత్తమైన అధికారులు ఇంటి దొంగను గుర్తించి నిలదీశారు. ఉన్నతాధికారులకు తెలిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించడంతో... అవసరానికి కుదువ పెట్టుకున్నానని చెప్పిన సదరు కానిస్టేబుల్‌ రెండు రోజుల్లో ఆ నగలు తిరిగి ఇచ్చేసినట్టు తెలుస్తోంది.

గతంలోనూ ఇదే తీరు..

2023లోనూ ఈ కానిస్టేబుల్‌ ఇదే పోలీస్‌ స్టేషన్‌లో ఉంచిన రికవరీ సొమ్ము నుంచి రూ.50వేలు కాజేస్తూ సీసీ కెమెరాకు దొరికిపోయినట్లు సమాచారం. అయినా ఆ డబ్బులు ఆయన తిరిగి ఇవ్వకపోవడంతో తన ఆధీనంలోని సేఫ్‌ లాకర్‌ (బీరువా) నుంచి నగదు చోరీ అయినందుకు బాధ్యత వహిస్తూ అప్పటి స్టేషన్‌ రైటర్‌ ఆ మొత్తాన్ని జమ చేసినట్టు తెలుస్తోంది. అలాగే పదేళ్ల క్రితం ఆయన ఏర్పేడు పోలీస్‌ స్టేషన్‌లో పనిచేసినప్పుడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్రాఫిక్‌ చలాన్ల మొత్తాన్ని నొక్కేసినట్టు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. అప్పట్లో వాహన చలాన్లను మాన్యువల్‌గా రాసేవారు. చలానా బుక్‌లను జిల్లా పోలీసు కార్యాలయం జారీ చేసేది. కొత్తబుక్‌ తీసుకొచ్చే బాధ్యతను అప్పటి ఎస్‌ఐ ఈ కానిస్టేబుల్‌కు అప్పగించారు. ఈయన చలానా పుస్తకాలు జారీచేసే సిబ్బందికి ముడుపులు సమర్పించి కొత్త రసీదు పుస్తకం తీసుకొని, ట్రెజరీలో చెల్లించాల్సిన మొత్తాన్ని స్వాహా చేసినట్టు సమాచారం. శాఖాపరమైన చర్యలకు బాధ్యులు కాకుండా ఉండేందుకు అప్పటి ఎస్‌ఐ ఆ మొత్తాన్ని చెల్లించి బయటపడినట్టు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. రూరల్‌ కానిస్టేబుల్‌ నగలు కాజేసిన విషయం స్పెషల్‌ బ్రాంచ్‌(ఎ్‌సబీ) సిబ్బందికి తెలిసినప్పటికీ వారు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు దృష్టికి తీసుకెళ్లలేదని తెలుస్తోంది. ఇలాంటి విషయాలపట్ల ఎస్పీ కఠినంగా వ్యవహరిస్తారన్న భయంతో సదరు కానిస్టేబుల్‌ ఎస్‌బీ సిబ్బంది కాళ్లావేళ్లా పడటంతో వారు మౌనంగా ఉన్నట్లు సమాచారం.

Updated Date - Feb 28 , 2026 | 05:23 AM