తిరుపతి సభ సక్సెస్
ABN , Publish Date - Jun 13 , 2026 | 05:46 AM
అధికారం చేపట్టి రెండేళ్లయిన సందర్భంగా తిరుపతిలో శుక్రవారం కూటమి నిర్వహించిన విజయోత్సవ సభ విజయవంతమైంది.
భారీగా హాజరైన మూడు పార్టీల శ్రేణులు
తరలివచ్చిన కేంద్ర, రాష్ట్ర మంత్రులు
సీఎం ప్రసంగంలో ప్రధానికే అధిక ప్రాధాన్యం
జోరుగా వర్షం కురిసినా ఆగని సభ
తిరుపతి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): అధికారం చేపట్టి రెండేళ్లయిన సందర్భంగా తిరుపతిలో శుక్రవారం కూటమి నిర్వహించిన విజయోత్సవ సభ విజయవంతమైంది. సీఎం, డిప్యూటీ సీఎం, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, మంత్రి లోకేశ్ సహా పలువురు మంత్రులు, మూడు పార్టీలకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభలో పాల్గొన్నారు. గత ఎన్నికల తర్వాత మూడు పార్టీల అగ్రనేతలు కలసి పాల్గొన్న రాజకీయ సభ ఇదే కావడంతో మూడు పార్టీల శ్రేణులూ భారీగా తరలివచ్చాయి. సభ జరుగుతుండగా మొదలైన వర్షం.. అది ముగిశాక కూడా జోరుగా కురిసింది. అయినా ఎటువంటి ఆటంకం ఎదురుకాలేదు. ప్రాంగణం మొత్తంలో జర్మన్ షెడ్ ఏర్పాటు చేయడంతో సభలో ఉన్నవారికి వర్ష ప్రభావం తెలియలేదు. చంద్రబాబు ప్రసంగంలో ప్రధాని మోదీకి అమిత ప్రాధాన్యమిచ్చారు. ఉదయం 11.27 గంటలకు ప్రారంభమైన సభ మధ్యాహ్నం 1.53 గంటలకు ముగిసింది. సభలో చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేశ్, బీజేపీ నేత మాధవ్‌తో పాటు స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ప్రసంగించారు. తొలుత మాధవ్ తర్వాత లోకేశ్ ప్రసంగించారు. డిప్యూటీ సీఎం మాట్లాడిన అనంతరం చివరగా సీఎం ప్రసంగించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఇద్దరూ కలసి ఒకేసారి వేదికపైకి వచ్చారు.
కలియతిరిగిన లోకేశ్..
సభలో లోకేశ్ అంతా తానై తిరిగారు. ఉదయం 10.55 గంటలకే ఆయన వేదికపైకి చేరుకున్నారు. కేంద్ర మంత్రులు కె.రామ్మోహన్‌నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్‌తో, రాష్ట్ర మంత్రులతో మాట్లాడుతూ గడిపారు. పవన్ కల్యాణ్ వేదికపైకి రాగానే లోకేశ్ ఆయనకు అభివాదం చేశారు. సీఎం, డిప్యూటీ సీఎం క్యాండిల్‌తో జ్యోతి వెలిగించి లోకేశ్ చేతికి ఇవ్వగా.. ఆయన తాను వెలిగించకుండా హోంమంత్రి అనితకు క్యాండిల్ ఇచ్చారు. ఆమె వెలిగించాక.. ఆయన కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, పెమ్మసానిని పిలిచి వారితో కలసి జ్యోతి వెలిగించారు. సభ ముగిశాక ఎమ్మెల్యేలతో కలసి సీఎం భోజనం చేస్తారని ప్రకటించినప్పటికీ.. ఆయన నేరుగా బస్సులోకి వెళ్లిపోయారు. అందులోనే భోజనం చేశారు. తర్వాత లోకేశ్ ఎమ్మెల్యేలు భోజనం చేస్తున్న అన్ని టేబుళ్ల వద్దకూ వెళ్లి వారందరినీ పలుకరించారు. జనసేన నుంచి పర్యాటక మంత్రి కందుల దుర్గేశ్, ఇతర ఎమ్మెల్యేలు హాజరవగా.. సీనియర్ మంత్రి నాదెండ్ల మనోహర్ రాలేదు.