తిరుపతిలో నేటి కూటమి సభ వాయిదా
ABN , Publish Date - Jun 09 , 2026 | 04:27 AM
కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయోత్సవాల్లో భాగంగా తిరుపతిలో మంగళవారం నిర్వహించ తలపెట్టిన తొలి బహిరంగ సభ వాయిదా పడింది.
స్టీల్ ప్లాంట్ ప్రమాదంతో నిర్ణయం
పవన్, మాధవ్‌తో చర్చించిన సీఎం
రేపు ఢిల్లీకి సీఎం, డిప్యూటీ సీఎం.. ఎన్డీయే నేతల భేటీకి హాజరు
అమరావతి/విశాఖపట్నం,, జూన్ 8(ఆంధ్రజ్యోతి): కూటమి ప్రభుత్వం రెండేళ్ల పాలన విజయోత్సవాల్లో భాగంగా తిరుపతిలో మంగళవారం నిర్వహించ తలపెట్టిన తొలి బహిరంగ సభ వాయిదా పడింది. విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదం నేపథ్యంలో తిరుపతి సభను వాయిదా వేయాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్‌తో చర్చించిన అనంతరం సభను వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. కాగా, సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి పవన్ బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన 10న ఢిల్లీలో జరగనున్న ఎన్డీయే పార్టీల సీఎంలు, డిప్యూటీ సీఎంల సమావేశంలో పాల్గొంటారు. త్వరలో జరగబోయే కేంద్ర క్యాబినెట్ పునర్ వ్యవస్థీకరణపై బీజేపీ పెద్దలతో చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.
10 వేల మందితో విశాఖ సభ: పల్లా
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 17న విశాఖపట్నంలో విజయోత్సవ సభ నిర్వహిస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తెలిపారు. ఆయన సోమవారం విశాఖలో విలేకరులతో మాట్లాడుతూ ఈ సదస్సుకు పది వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం వరకు జరగనున్న ఈ సదస్సు వేదికను ఒకటి రెండు రోజుల్లో ఎంపిక చేస్తామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేశ్, బీజీపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్, కేంద్రం నుంచి సీనియర్ మంత్రి ఒకరితోపాటు ఉత్తరాంధ్రకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కూటమి నేతలు ఈ సదస్సుకు హాజరవుతారని తెలిపారు.